SLBC సొరంగంలో మృతదేహాలైనా దొరికేనా?
టీబీఎం మధ్య ఏడు మీటర్ల లోతులో ఉన్న నాలుగు మృతదేహాలను ఈరోజు సాయంత్రానికి వెలికి తీసే అవకాశం ఉంది.;
పొట్ట చేతపట్టుకుని పక్క రాష్ట్రానికి పని కోసం వచ్చిన కార్మికులు. రోజు కూలీ చేసుకుంటూ తన వారిని తలుచుకుంటూ కాలం వెళ్లదీస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ ముగిస్తే తిరిగి తమ ఊరెళ్లి కుటుంబంతో కొన్నాళ్లైనా సంతోషంగా గడపొచ్చని ఎన్నో కలలు కన్నారు. అలాంటి వారి కలలను విధి ఛిన్నాభిన్నం చేసింది. సొరంగంలో పనులు చేస్తుండగా ఒక్కసారిగా పైకప్పు కూలిపోయింది. ఈ ఘటన ఫిబ్రవరి 22న జరిగింది. అదే ఎస్ఎల్‌బీసీ ప్రమాదం. ఈ ప్రమాదం జరిగి తొమ్మిది రోజులైనా ఇప్పటికీ లోపల చిక్కకుపోయినా కార్మికులకు సంబంధించి ఎటువంటి సమాచారం అందలేదు. వారు చనిపోయారా? ఏదైనా అద్భుతం జరిగి బతికే ఉన్నారా? అన్నది అంచనాలకు కూడా అందడం లేదు. కొన్ని సహాయక బృందాలు, ఆఖరికి అధికారి యంత్రాంగం సైతం వారు మరణించారనే బలంగా భావిస్తున్నాయి. సహాయక చర్యల్లో కీలక పురోగతి వచ్చి కూడా రెండు రోజులు అవుతున్నా.. వారి ఆచూకీ ఇప్పటికీ అందక పోవడం.. వారి కుటుంబీకులను కలచివేస్తోంది. తమ వారి మృతదేహాలనైనా తాము చూడగలుగుతామా? అన్న సందేహం వారిలో రోజురోజుకు అధికమవుతోంది. కానీ అధికార యంత్రాంగం, రెస్క్యూ టీమ్స్ మాత్రం సహాయక చర్యలను కొనసాగిస్తూనే ఉన్నాయి. నిర్విరామంగా సహాయక చర్యలను చేస్తూ వీలైనంత త్వరగా లోపలి వారి పరిస్థితి తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి.
కానీ లోపల నిరంతరం వస్తున్న నీటి ఊట, దాని వల్ల పెరుగుతున్న బురద వారికి అతిపెద్ద సవాల్‌గా మారుతున్నాయి. వాటిని అధిగిస్తూ సహాయక చర్యలను వేగంగా ముందుకు నడిపించడానికి అన్ని విధాలా ప్రయత్నిస్తున్నారు రెస్క్యూ సిబ్బంది. వీటి కారణంగా లోపల చిక్కుకున్న వారిని గుర్తించినా వారిని బయటకు తీసుకురావడానికి మాత్రం తీవ్రంగా శ్రమించాల్సి ఉంటుందని సహాయక బృందాలు చెప్తున్నాయి. లోపల బురద దాదాపు 15 అడుగుల వరకు పేరుకుపోయిందని, అక్కడ ఆక్సిజన్ కూడా చాలా తక్కువ మోతాదులో ఉందని చెప్పారు. అయినా తొలగిస్తున్న కొద్దీ బురద వచ్చి పేరుకుపోతోందని అంటున్నారు. పైభాగంలో తవ్వి బురదను తొలగించే కొద్ది కింద నుంచి వస్తున్న నీటి ఊట ఉబికి వస్తూ.. తనతో పాటు మరింత బురదను సొరంగంలోకి తీసుకొస్తోందని, ఇది సహాయక చర్యలను ఆలస్యం చేస్తోందని చెప్పుకొస్తున్నారు. షిఫ్టుకు 120 మంది చొప్పున రోజుకు 3 షిఫ్టుల్లో సహాయక బృందాలు పనిచేస్తున్నాయి. మొత్తం 18 ఏజెన్సీలు, 54 మంది అధికారులు,703 మంది సిబ్బంది ఈ ఆపరేషన్ లో పనిచేస్తున్నారు.
ఇదిలా ఉంటే సొరంగం లోపల చిక్కుకున్నవారు ఎక్కడెక్కడున్నారు అన్న అంశాలు కీలక సమాచారం అందుతోంది. టన్నెల్ మధ్యలో నలుగురు, టన్నెల్ ముందు భాగం కింద సుమారు 15-20 అడుగుల లోతులో నలుగురు చిక్కుకున్నట్లు అధికారులు గుర్తించినట్లు తెలుస్తోంది. టీబీఎం మధ్య ఏడు మీటర్ల లోతులో ఉన్న నాలుగు మృతదేహాలను ఈరోజు సాయంత్రానికి వెలికి తీసే అవకాశం ఉందని సమాచారం. ఇందుకోసం చర్యలను వేగవంతం చేయనున్నట్లు సహాయక బృందాల నుంచి అందుతున్న సమాచారం. వారి మృతదేహాలను బయటకు తీయడం కోసం తీవ్రంగా శ్రమిస్తున్నామని సహాయక బృందాలు చెప్తున్నాయి. కాగా టీబీఎం మధ్యవి కాకుండా మిగిలిన నాలుగు మృతదేహాలను తీయడం అసాధ్యంగా ఉన్నట్లు కూడా రెస్క్యూ టీమ్స్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం. ఇప్పటికే సొరంగం దగ్గర ఎనిమిది అంబులెన్స్‌లను సిద్ధంగా ఉంచారు అధికారులు. మృతదేహాలు లభ్యమైన వెంటనే వాటికి నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్ట్‌మార్టం నిర్వహించి.. అనంతరం స్వస్థలాలకు తరలించే ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు చెప్పారు.