జయలలిత తెగింపు రేవంత్ లో ఉందా ?

బీసీ రిజర్వేషన్ బిల్లుపై అఖిల పక్షంతో ఢిల్లీలో పోరాటం చేసిన జయలలిత;

Update: 2025-05-03 10:43 GMT
Jayalalithaa and Revanth

బీసీ రిజర్వేషన్లు 42 శాతానికి పెంచుతు తెలంగాణ ప్రభుత్వం పంపిన బిల్లు చాలారోజులుగా రాష్ట్రపతి ధ్రౌపధి ముర్ము దగ్గరే ఉండిపోయింది. మరీ బిల్లుకు రాష్ట్రపతి సంతకం అయ్యేదెన్నడు ? ప్రస్తుత రాజకీయ పరిణామాలను గమనిస్తే బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం దొరుకుతుందని అనుకునేందుకులేదు. ఎందుకంటే కేంద్రంలో ఉన్నదేమో బీజేపీ నాయకత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం. బీసీబిల్లును రాష్ట్రపతికి పంపిందేమో ఎ రేవంత్ రెడ్డి(A Revanth Reddy) నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం. ఈనేపధ్యంలో కాంగ్రెస్ పంపిన బిల్లుకు రాష్ట్రపతి ఆమోదించి ఎపుడు సంతకం పెడతారో చెప్పడం కష్టం. రాష్ట్రపతి ఆమోదముద్ర వేయడం ఆలస్యమయితే రేవంత్ రెడ్డి ఏమి చేస్తారు? ఇక్కడే చాలామంది తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జే జయలలిత (J Jayalalithaa)ను గుర్తు చేసుకుంటున్నారు. తెలంగాణ ప్రభుత్వం పంపిన బిల్లుకు రాష్ట్రపతి సంతకం చేయాలంటే అప్పట్లో జయలలిత చూపించిన తెగింపే ఇపుడు రేవంత్ కూడా చూపించాలి.

అప్పట్లో ఏమిజరిగిందో తెలియాలంటే కాస్త చరిత్రలోకి వెళ్ళాలి. 1991-96లో మొదటిసారిగా జయలలిత తమిళనాడుకు ముఖ్యమంత్రయ్యారు. 1993, నవంబర్లో జయలలిత నేతృత్వంలో విద్య, ఉద్యోగాల్లో బీసీల రిజర్వేషన్ను (BC Reservations) 69శాతానికి పెంచుతు తమిళనాడు అసెంబ్లీ తీర్మానంచేసి ఆమోదంకోసం ఢిల్లీకి పంపింది. అంతకుముందు రిజర్వేషన్లు 50శాతం మాత్రమే ఉండేది. ఓబీసీలకు 30 శాతం, ఎంబీసీలకు(డీ నోటిఫైడ్ కమ్యూనిటీస్)కు 20 శాతం రిజర్వేషన్లు ఉండేవి. తమిళనాడులో బీసీల రిజర్వేషన్ శాతం పెంచాలన్న డిమాండుకు అనుగుణంగా అక్కడ కూడా అధ్యయనం కోసం డెడికేటెడ్ కమిషన్ ను నియమించారు. ఆ కమిషన్ రాష్ట్రవ్యాప్తంగా పర్యటించి, పబ్లిక్ హియంరింగ్ నోటిఫికేషన్లు ఇచ్చి, ప్రజలు, ప్రజాసంఘాలు, రాజకీయపార్టీలు, కులసంఘాలు, మేథావుల నుండి అనేక సూచనలు, సలహాలు తీసుకున్నది.

వివిధ వర్గాల నుండి అందిన సలహాలు, సూచనలు, అభ్యంతరాలన్నింటినీ పరిశీలించి నివేదిక తయారుచేసి బీసీలకు విద్య, ఉద్యోగ, స్ధానికసంస్ధల్లో రిజర్వేషన్లను 69 శాతానికి పెంచాల్సిన అవసరం ఉందని రిపోర్టిచ్చింది. ఆ రిపోర్టుపై జయలలిత మంత్రివర్గం అధ్యయనంచేసి క్యాబినెట్లో చర్చించి ఆమోదంతెలిపి, అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టి ఏకగ్రీవ తీర్మానంచేసింది. ఆతీర్మానాన్ని గవర్నర్ కు పంపి ఆమోదం తీసుకున్నది. గవర్నర్ ఆమోదంపొందిన బిల్లును రాష్ట్రపతి శంకర్ దయాళ్ శర్మకు పంపింది. తమిళనాడు నుండి వచ్చిన బిల్లుకు రాష్ట్రపతి సంతకం పెట్టలేదు. అందుకనే జయలలిత ఏమిచేశారంటే చెన్నైలో అఖిలపక్ష సమావేశం ఏర్పాటుచేసి పరిస్ధితిని వివరించారు. అన్నీపార్టీల ఎంపీలను తీసుకుని తానేస్వయంగా ఢిల్లీకి వెళ్ళారు. ఎంపీలతో కలిసి కేంద్రమంత్రులు, అప్పటి ప్రధానమంత్రి పీవీ నరసింహారావుతో భేటీ అయ్యారు.

బిల్లుకు ఆమోదంతెలిపేట్లుగా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావటంలో జయలలిత ఉద్దేశ్యాలు రెండున్నాయి. అవేమిటంటే మొదటిది 69 శాతం రిజర్వేషన్ బిల్లుకు రాష్ట్రపతి సంతకం చేయటం. రెండోది ఏమిటంటే 69 శాతం బీసీ బిల్లును షెడ్యూల్ 9 (Schedule 9) లో చేర్పించటం. 69 శాతం బీసీ బిల్లును షెడ్యూల్ 9లో ఎందుకు చేర్పించాలి? ఎందుకంటే అంతకుముందు సుప్రింకోర్టు తీర్పుప్రకారం రిజర్వేషన్ల శాతం 50కి మించకూడదు. ఏ రాష్ట్రంలో అయినా రిజర్వేషన్లు 50 శాతానికి మించితే న్యాయసమీక్ష ముందు నిలబడాలి. న్యాయసమీక్ష ముందు నిలబడాలంటే సదరు రిజర్వేషన్లు 50 శాతం మించిన బిల్లును షెడ్యూల్ 9లో చేర్చాలి. షెడ్యూల్ 9లో చేర్చిన తర్వాత సదరు రిజర్వేషన్ల పెంపును న్యాయస్ధానాలు సమీక్షించేందుకు లేదు. అందుకనే జయలలిత 69 శాతం బీసీ రిజర్వేషన్ల పెంపు బిల్లును షెడ్యూల్ 9లో చేర్చేట్లుగా గట్టిగా పట్టుబట్టారు.

1994, జూన్లో తమిళనాడు ఎంపీలు కేంద్రమంత్రులను కలిసినా, ప్రధానమంత్రితో మాట్లాడినా పెద్దగా ఉపయోగం కనబడలేదు. అందుకని జయలలిత ఏమిచేశారంటే బీసీ బిల్లును షెడ్యూల్ 9 లో చేర్పించేందుకు తానే స్వయంగా ఢిల్లీకి బయలుదేరారు. ప్రధానమంత్రిని, సంబంధిత కేంద్రమంత్రులను కలిశారు. అయినా పెద్దగా ఉపయోగం కనబడలేదు. అందుకనే తమప్రభుత్వంపంపిన బిల్లును షెడ్యూల్ 9లో చేర్చేంతవరకు తాను తమిళనాడుకు తిరిగి వెళ్ళేదిలేదని జూలైలో బహిరంగంగా ప్రకటించారు. అప్పట్లో జయలలిత చేసిన ప్రకటన దేశంలో పెద్ద సంచలనం సృష్టించింది. ప్రతిరోజు కేంద్రమంత్రులను కలిసి ఒత్తిడి తీసుకురావటం, కుదిరినపుడల్లా ప్రధానమంత్రిని కలవటంతో పాటు ఎంపీలద్వారా అందరిపైనా ఒత్తిడిపెంచేశారు. ఢిల్లీలో జయలలిత ప్రకటన తర్వాత తమిళనాడులో కూడా కేంద్రప్రభుత్వానికి వ్యతిరేకంగా అలజడులు, ఆందోళనలు మొదలయ్యాయి.

అన్నీవైపుల నుండి ఒత్తిడిపెరిగిపోతుండటంతో వేరేదారిలేక పీవీ నరసింహారావు ప్రభుత్వం చివరకు జయలలిత డిమాండుకు తలొంచి రాష్ట్రపతి సంతకం అయిన తమిళనాడు 69 శాతం బీసీ బిల్లును 1994, ఆగష్టులో షెడ్యూల్ 9లో చేర్చింది. ఆ తర్వాతే జయలలిత ఢిల్లీ నుండి తమిళనాడుకు తిరిగెళ్ళారు. తమిళనాడులో అమల్లోకి వచ్చిన బీసీ 69 శాతం రిజర్వేషన్లకు వ్యతిరేకంగా న్యాయస్ధానాల్లో కేసులు దాఖలైనా ఇంకా విచారణలు సాగుతునే ఉన్నాయి. కోర్టులో కేసులున్నా రాజ్యాంగంలోని షెడ్యూల్ 9 కల్పించిన రక్షణ కారణంగా బీసీలకు 69 శాతం రిజర్వేషన్లు అమలవుతునే ఉన్నాయి. ఈ 69 శాతంలో బీసీలకు 26.5 శాతం, ఎంబీసీలకు 20 శాతం, బీసీ ముస్లింలకు 3.5 శాతం, షెడ్యూల్డ్ కులాలకు 20 శాతం, షెడ్యూల్డ్ తెగలకు 1 శాతం రిజర్వేషన్ అమలవుతోంది.

రిజర్వేషన్లు ఇలా పెరిగాయి

తమిళనాడులో రిజర్వేషన్లు ఒక క్రమపద్దతిలో పెరిగాయి. స్వాంతంత్ర్యం తర్వాత తమిళనాడులో బీసీ కమిషన్ కు ఛైర్మన్ గా వ్యవహరించింది ఏఎం సత్తనాధన్. రాష్ట్రమంతా పర్యటించి అనేక వర్గాలతో చర్చలు జరిపి రిజర్వేషన్లపై 1970లో రిపోర్టిచ్చారు. సత్తనాధన్ రిపోర్టు ఆధారంగా బీసీల రిజర్వేషన్ 25 నుండి 31 శాతానికి, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ 16 నుండి 18 శాతానికి పెరిగిన కారణంగా రాష్ట్రంలో రిజర్వేషన్లు 49 శాతానికి చేరుకుంది. 1992లో సుప్రింకోర్టు ఆదేశాల ప్రకారం రెండో బీసీ కమిషన్ ఏర్పాటైంది. రెండో కమిషన్ రిపోర్టు ప్రకారం బీసీల రిజర్వేషన్ 31 శాతం నుండి 50కు పెరగటంతో మొత్తం రిజర్వేషన్లు 49 నుండి 68 శాతానికి పెరిగాయి. అప్పటికే అంటే 1990లోనే మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పుప్రకారం ఎస్టీలకు 1 శాతం రిజర్వేషన్ కల్పించాల్సొచ్చింది. దీంతో మొత్తం రిజర్వేషన్లు 69 శాతానికి చేరుకుంది. నిజానికి రిజర్వేషన్లను 69 శాతం కల్పించింది నాటి ముఖ్యమంత్రి ఎం. కరుణానిధే. అప్పట్లో రిజర్వేషన్లు ఇంతశాతమే ఉండాలన్న నిబంధనలేదు కాబట్టి కరుణానిధి రిజర్వేషన్లను పెంచుకోగలిగారు.

50 శాతం సీలింగ్ ఎప్పుడొచ్చింది

వీపీ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్నపుడు రిజర్వేషన్లపై దేశవ్యాప్తంగా పెద్ద ఆందోళనలు జరిగాయి. ఇంద్రా సహానే అనే విద్యార్ధిని వేసిన పిటీషన్ (Indra Sawhney v. Union of India case: 1992) పై సుప్రింకోర్టు విచారణ జరిపింది. ఆకేసు ఫలితంగా రాజ్యాంగంలోని ఆర్టికల్ 16(4) ప్రకారం మొత్తం రిజర్వేషన్లు 50 శాతానికి మించకూడదని అప్పట్లో సుప్రింకోర్టులోని తొమ్మిదిమంది జడ్జీల ధర్మాసనం తీర్పిచ్చింది. ఆ తీర్పును దృష్టిలో పెట్టుకున్న తమిళనాడు ప్రభుత్వం 1993-94 విద్యాసంవత్సరం వరకు 69 శాతం రిజర్వేషన్లే అమల్లో ఉండేట్లుగా మద్రాస్ హైకోర్టులో కేసువేసి ఆర్డర్ తెచ్చుకుంది. అయితే అదే సమయంలో రిజర్వేషన్లు 69 శాతం నుండి మళ్ళీ 50 శాతంకు తగ్గిపోతుందని ఆలోచించిన జయలలిత 69 శాతం రిజర్వేషన్లు ఎప్పటికీ అమల్లోనే ఉండాలంటే షెడ్యూల్ 9లో చేర్చక తప్పదన్న నిర్ణయానికి వచ్చి దానికి తగ్గట్లే కేంద్రంపై బాగా ఒత్తిడితెచ్చి సాధించుకున్నారు.

బీసీలకు 69 శాతం రిజర్వేషన్ల పెంపును షెడ్యూల్ 9 లో చేర్చాలన్న జయలలిత దూరాలోచన కారణంగానే తమిళనాడులో బీసీల రిజర్వేషన్లు ఇప్పటికీ అమలవుతునే ఉన్నాయి. షెడ్యూల్ 9లో చేర్పించకపోతే న్యాయస్ధానాలు ఎప్పుడో ప్రభుత్వ నిర్ణయాన్ని కొట్టేసేవి అనటంలో సందేహంలేదు. ఎందుకంటే ఈమధ్యనే మహారాష్ట్ర, బీహార్ రాష్ట్రాలు కూడా బీసీలకు రిజర్వేషన్లు పెంచుతు నిర్ణయం తీసుకున్నాయి. అయితే ఈ నిర్ణయాలను కోర్టులో సవాలుచేయగానే ప్రభుత్వ నిర్ణయాలను కోర్టులు కొట్టేశాయి.

మహారాష్ట్రలో ఏం జరిగింది ?

మహారాష్ట్ర(Maharashtra Government)లో మరాఠాలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తు 2024, ఫిబ్రవరి 20వ తేదీన అప్పటి ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే బిల్లును ప్రవేశపెట్టారు. అసెంబ్లీ బిల్లును ఆమోదించి సంతకం కోసం గవర్నర్ కు పంపింది. తర్వాత సదరు బిల్లుకు గవర్నర్ ఆమోదించారు. అయితే కొంతమంది రిజర్వేషన్ల పెంపును వ్యతిరేకిస్తు కోర్టులో పిటీషన్లు వేశారు. మహారాష్ట్ర ప్రభుత్వం పెంచిన మరాఠా రిజర్వేషన్లపై విచారణ చేసిన ముంబాయ్ హైకోర్టు ప్రభుత్వ నిర్ణయాన్ని కొట్టేసింది. అంతుకుముందు కూడా అంటే 2018లో రూపొందించిన మరాఠా రిజర్వేషన్ బిల్లును 2021, మే 5వ తేదీన ఐదుగురు జడ్జీల ధర్మాసనం కొట్టేసింది. జస్టిస్ అషోక్ భూషణ్ నేతృత్వంలో జడ్జీలు ఎల్ నాగేశ్వరరావు, ఎస్ అబ్దుల్ నజీర్, హేమంత్ గుప్తా, ఎస్ రవీంద్రభట్ ధర్మాసనం రిజర్వేషన్ల బిల్లును కొట్టేసింది. మొత్తం రిజర్వేషన్లు 50 శాతంకు మించేందుకులేదని ఐదుగురు జడ్జీల ధర్మాసనం స్పష్టంగా ఆదేశించింది.

బీహార్లో జరిగిందేమిటి ?

నితీష్ కుమార్ ( Nitish Kumar) నాయకత్వంలోని బీహార్ అసెంబ్లీ(Bihar Assembly) 2024, జూన్ లో బీసీలకు విద్య, ఉద్యోగాల్లో 65 శాతం రిజర్వేషన్లు కల్పిస్తు నిర్ణయం తీసుకున్నది. 2023, నవంబర్ 9వ తేదీన ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లును అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదంతెలిపింది. అంతకుముందు బీహార్లో మొత్తం రిజర్వేషన్లు 50 శాతం ఉండేది. ఎప్పుడైతే రిజర్వేషన్ల శాతాన్ని 15శాతం పెంచిందో వెంటనే కొందరు పాట్నా హైకోర్టులో కేసులు వేశారు. పిటీషనర్లు, ప్రభుత్వ వాదనలను విన్న తర్వాత 2024, జూలై 28వ తేదీన హైకోర్టు ప్రభుత్వ నిర్ణయం రాజ్యాంగ విరుద్ధమని కొట్టేసింది. 2022 జూన్-2023, ఆగస్టు మధ్యలో రాష్ట్రంలో కులగణనపై సర్వే నిర్వహించినట్లు ప్రభుత్వం చెప్పింది. కులగణన ఆధారంగానే అదర్ బ్యాక్ వర్డ్ క్లాసెస్, ఎక్స్ ట్రీమ్లీ బ్యాక్ వర్డ్ క్లాసెస్, ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు పెంచినట్లు ప్రభుత్వం కోర్టులో చేసిన వాదన నిలబడలేదు.

రేవంత్ ముందుచూపు

తెలంగాణలో బీసీల రిజర్వేషన్లను పెంచే విషయంలో రేవంత్ ముందుచూపుతో వ్యవహరించినట్లు అర్ధమవుతోంది. మహారాష్ట్ర, బీహార్ రాష్ట్రాల్లోలాగే తెలంగాణ ప్రభుత్వమే బీసీలకు 42 శాతం రిజర్వేషన్ పెంపును అమలుచేసేయచ్చు. అయితే ఎవరైనా కోర్టులో కేసులు వేస్తే పెంచిన రిజర్వేషన్ నిర్ణయాన్ని కోర్టు కొట్టేయటం ఖాయం. ఎందుకంటే షెడ్యూల్ 9 రక్షణ లేకపోతే ప్రభుత్వాలు పెంచిన రిజర్వేషన్లను కోర్టులు కొట్టేస్తాయి. ఇప్పుడు షెడ్యూల్ 9 రక్షణలో ఉన్నప్పటికీ రిజర్వేషన్లపెంపు రాజ్యాంగబద్దంగా లేకపోతే న్యాయసమీక్ష చేయవచ్చని ఈమధ్యనే సుప్రింకోర్టు స్పష్టంగా చెప్పింది. షెడ్యూల్ 9లో చేర్చినా న్యాయసమీక్ష చేయవచ్చని సుప్రింకోర్టు చెప్పినపుడు షెడ్యూల్ 9లో చేర్చకుండానే రిజర్వేషన్లు పెంచేస్తే కోర్టు కొట్టేయకుండా ఉంటుందా ? అందుకనే రేవంత్ ముందుజాగ్రత్తగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్ బిల్లును షెడ్యూల్ 9లో చేర్చాలని పట్టుబడుతున్నది.

జయలలితే రేవంత్ కు మార్గదర్శనమా ?

ఉత్తినే అసెంబ్లీ తీర్మానం, గవర్నర్ ఆమోదాన్ని పంపితే కేంద్రప్రభుత్వం సదరు బిల్లును ఆమోదించదు, షెడ్యూల్ 9లో చేర్చదు. అందుకనే రేవంత్ కూడా గతంలో జయలలిత ఎన్నుకున్న మార్గానే అనుసరించాలి. బిల్లుకు రాజ్యాంగరక్షణ, చట్టబద్దత దక్కాలంటే రేవంత్ వెళ్ళి ఢిల్లీలో కూర్చుంటేకాని కేంద్రంలో చలనంరాదు. ఒకపుడు జయలలిత మార్గాన్నే ఎన్నుకుంటారా ? లేకపోతే ఇప్పటి పరిస్ధితులకు తగ్గట్లుగా వ్యూహం పన్నుతారా అన్నది రేవంత్ ఇష్టం. రాజకీయాల్లో ఒక్కోసారి తీసుకునే నిర్ణయం జీవితాన్నే మలుపుతిప్పేస్తుంది. తెలంగాణ రాజకీయాల్లో రేవంత్ హీరోగా మిగిలిపోవాలని అనుకుంటే బిసీ రిజర్వేషన్ల బిల్లుపై గట్టి నిర్ణయం తీసుకోక తప్పదు.

9వ షెడ్యూల్లో చేరిస్తేనే భద్రత : చిరంజీవులు

ఇదే విషయమై రిటైర్డ్ ఐఏఎస్ అధికారి, బీసీ మేథావుల ఫోరం అధ్యక్షుడు తొగరాల చిరంజీవులు తెలంగాణ ఫెడరల్ తో మాట్లాడుతు బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు కావాలంటే షెడ్యూల్ 9 రక్షణ చాలా అవసరమన్నారు. రిజర్వేషన్ల పెంపు నిర్ణయాన్ని రాష్ట్రప్రభుత్వాలే తీసుకోవచ్చని చెప్పారు. అయితే రిజర్వేషన్ల పెంపు నిర్ణయాన్ని కోర్టులు కొట్టేస్తాయనటంలో సందేహంలేదన్నారు. మహరాష్ట్ర, బీహార్ ప్రభుత్వాలు పెంచిన రిజర్వేషన్లను ముంబాయ్, పాట్నా హైకోర్టులు కొట్టేసిన విషయాన్ని గుర్తుచేశారు. తెలంగాణ ప్రభుత్వం పెంచిన బీసీల రిజర్వేషన్ను కోర్టు కొట్టేయకూడదంటే షెడ్యూల్ 9 రక్షణ చాలా అవసరమన్నారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు రిజర్వేషన్ పెంచుతు పంపిన బిల్లుకు నరేంద్రమోడి నాయకత్వంలోని కేంద్రప్రభుత్వం ఎందుకు ఆమోదం తెలుపుతుందని కూడా ఎదురు ప్రశ్నించారు. మోడీ అనుకుంటేనే తెలంగాణ పంపిన బిల్లుకు మోక్షం లభిస్తుందని చిరంజీవులు అభిప్రాయపడ్డారు. గతంలో తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ప్రభుత్వం పెంచిన బీసీల రిజర్వేషన్లు అమల్లో ఉన్నదంటే అందుకు రాజ్యంగం షెడ్యూల్ 9 కల్పించిన రక్షణే కారణమన్నారు.

రాష్ట్రప్రభుత్వమే నిర్ణయం తీసుకోవచ్చు : వకుళాభరణం

బీసీ కమిషన్ మాజీ ఛైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్ మాట్లాడుతు రాజ్యాంగంలోని ఆర్టికల్ 243డీ6, టీ6 ప్రకారం స్ధానికసంస్ధల్లో బీసీల రిజర్వేషన్ పెంచుకునే నిర్ణయం రాష్ట్రప్రభుత్వాలదే అని చెప్పారు. స్ధానికసంస్ధల్లో రిజర్వేషన్లు పెంచుకునే అధికారం రాష్ట్రప్రభుత్వాలకు ఉందన్నారు. దీనికి కేంద్రప్రభుత్వం ఆమోదం అవసరమే లేదని చెప్పారు. అయితే రేవంత్ ప్రభుత్వమే రిజర్వేషన్ల పెంపును అమల్లోకి తీసుకురాకుండా అనవసరంగా షెడ్యూల్ 9లో చేర్చాలని చెప్పటంతోనే కేంద్రం ఆమోదం అవసరమైందని అభిప్రాయపడ్డారు. తెలంగాణ ప్రభుత్వం పంపిన బిల్లును కేంద్రం ఆమోదిస్తే కాని చట్టంరూపంలోకి రాదన్నారు. అంతవరకు బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలయ్యేందుకు లేదని చెప్పారు. బూసాని వెంకటేశ్వరరావు నేతృత్వంలో పనిచేసిన డెడికేటెడ్ కమిషన్ కూడా ప్రొసీజర్ ఫాలో అవలేదని ఆరోపించారు. పబ్లిక్ హియరింగ్ చేపట్టలేదు, జిల్లాల్లో తిరిగి ప్రజలు, ప్రజాసంఘాలు, కులసంఘాలు, రాజకీయపార్టీల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించలేదన్నారు. బూసాని డెడికేటెడ్ కమిషన్ స్ధానికసంస్ధల్లో బీసీల రిజర్వేషన్ పెంపుకోసమే కాని విద్యా, ఉద్యోగాల్లో రిజర్వేషన్ పెంపుకోసం కాదని వకుళాభరణం స్పష్టంగా చెప్పారు.

Tags:    

Similar News