తెలంగాణ-ఏపీ తిరుమల పంచాయితి ఎప్పటికైనా తెగుతుందా ?
తెలంగాణ ప్రజాప్రతినిధుల తిరుమల పంచాయితీ పోయిన ఏడాది డిసెంబర్ నుండి ఇప్పటికీ కొనసాగుతునే ఉంది.;
తెలంగాణ ప్రజాప్రతినిధుల తిరుమల పంచాయితీ పోయిన ఏడాది డిసెంబర్ నుండి ఇప్పటికీ కొనసాగుతునే ఉంది. శ్రీవారి దర్శనార్ధం(Tirumala Darsan) తెలంగాణ(Telangana) నుండి తిరుమలకు చేరుకుంటున్న భక్తులకు ప్రజాప్రతినిధులు సిఫారసు లేఖలు ఇస్తుంటారు. ప్రజాప్రతినిధులంటే ఎంఎల్ఏ, ఎంఎల్సీ, ఎంపీలు మాత్రమే. శ్రీవారి దర్శనార్ధం తిరుమల చేరుకుంటున్న భక్తులకు ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖలపై టీటీడీ అధికారులు కాటేజీలు, దర్శనాలను వీఐపీ కోటాలో(VVIP Quota) కేటాయించాలని తెలంగాణ ప్రజాప్రతినిధులు కోరుకుంటున్నారు. తమలేఖలకు తిరుమలలో టీటీడీ అధికారులు ఏమాత్రం విలువివ్వటంలేదని చాలాకాలంగా మండిపడుతున్నారు. మహబూబ్ నగర్ ఎంఎల్ఏ యెన్నం శ్రీనివాసులరెడ్డి, జడ్చర్ల ఎంఎల్ఏ జనపల్లి అనిరుధ్ రెడ్డి, ఎంఎల్సీ బల్మూర్ వెంకట్ తదితరులు రేవంత్ రెడ్డి(Revanth)కి ఫిర్యాదుచేశారు.
ఎంఎల్ఏలు, ఎంఎల్సీల పిర్యాదుతో రేవంత్ కూడా చంద్రబాబునాయుడు(Chandrababu Naidu)తో ఈవిషయాన్ని గట్టిగానే మాట్లాడారు. ఎందుకంటే తమ సిఫారసులేఖలకు తిరుమలలో అధికారులు విలువ ఇవ్వటంలేదన్న కోపంతో అనిరుధ్, యెన్నం డైరెక్టుగా చంద్రబాబు మీదే మండిపడ్డారు. అనిరుధ్ అయితే ఇదే విషయంలో చంద్రబాబుకు రెండుసార్లు వార్నింగులు కూడా ఇచ్చారు. దాంతో చంద్రబాబుతో రేవంత్ గట్టిగా మాట్లాడాల్సొచ్చింది. రేవంత్ మాట్లాడిన విషయాన్ని చంద్రబాబు కూడా సీరియస్ గానే తీసుకున్నారు. టీటీడీ ఛైర్మన్(TTD Chairman BR Naidu) బీఆర్ఎస్ నాయుడు, ఈవో శ్యామలరావు తదితరులతో ఈ విషయాన్ని చర్చించారు. తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖలను తిరుమలలో వారంలో రెండురోజులు కచ్చితంగా ఆమోదించాల్సిందే అని చంద్రబాబు ఆదేశించారు.
అయితే చంద్రబాబు ఆదేశించి మూడు నెలలైనా టీటీడీ(TTD) అధికారులు మాత్రం ఇప్పటివరకు పెద్దగా పట్టించుకోవటంలేదు. దానికి కారణంఏమిటంటే ఇప్పటికే తమకు అందుతున్న సిఫారసులేఖల ప్రకారం బ్రేక్ దర్శనాలు(Break Darsan), వివీఐపీ దర్శనాలు పూర్తయ్యేటప్పటికే మధ్యాహ్నం అయిపోతోంది. ఉదయం 3.30 గంటలకు శ్రీవారి దర్శనాలు మొదలైతే వీవీఐపీ, బ్రేక్ దర్శనాలు పూర్తయ్యేటప్పటికి ఇపుడు మధ్యాహ్నం సుమారు 1 గంట అయిపోతోంది. అలాంటిది తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖల ప్రకారం బ్రేక్, వివీఐపీ దర్శనాల టోకెన్లు, టికెట్లు కేటాయిస్తే దర్శనాలు పూర్తయ్యేందుకు ఇంకెంత సమయం పడుతుందో అని టీటీడీ ఉన్నతాధికారుల్లో టెన్షన్ పెరిగిపోతోంది. రోజురోజుకు పెరిగిపోతున్న వీవీఐపీ, బ్రేక్ దర్శన టికెట్లను తగ్గించాలని టీటీడీ అధికారులు ప్రయత్నిస్తుంటే అందుకు విరుద్ధంగా పెరిగిపోతున్నాయి.
ఇపుడు టోకెన్ రహిత దర్శనాలతో పాటు స్లాటెడ్ సర్వదర్శనం, రు. 300 దర్శనం, దివ్యదర్శనం, టూరిజం, ఎన్ఆర్ఐ, డిఫెన్స్, చంటిబిడ్డ-తల్లి దండ్రుల దర్శనం, వయోవృద్ధుల దర్శనంతో పాటు రకరకాల ఆర్జిత సేవల దర్శనాలు, కల్యాణం దర్శనం రూపంలో రోజుకు సుమారు 70 వేలమంది భక్తులు దర్శనాలు చేసుకుంటున్నారు. వారాంతాల్లో, విశేష పండుగల్లోను, డిసెంబర్ 30,31, జనవరి 1,2 తేదీల్లో భక్తుల సంఖ్య లక్షకూడా దాటిపోతోంది. ఏపీలోని ప్రజాప్రతినిధులు, మంత్రులు ఇస్తున్న సిఫారసు లేఖలే రోజుకు సుమారు 2 వేలుంటున్నాయి. పోలీసు, మీడియా, జ్యూడీషియరీ, ఇన్ కమ్ ట్యాక్స్, ఐఏఎస్, టీటీడీ ఉద్యోగులు, కేంద్రమంత్రులు, కేంద్రప్రభుత్వంలోని ఉన్నతస్ధాయి అధికారులు, వ్యక్తులు, సీఎంవో సిఫారసులు సుమారు మరో 1500 వరకూ ఉంటాయి.
ఇక టీటీడీ బోర్డు ఛైర్మన్, సభ్యులకు సుమారు 600 టెకెట్లు కేటాయిస్తున్నారు. వీళ్ళు కాకుండా ఇతర రంగాల్లోని వీవీఐపీలు, దాతలు కలిపి మరో 500 వరకు దర్శనాలకు వస్తుంటారు. శ్రీవాణి ట్రస్టు(Srivani Trust)కు విరాళాలు ఇచ్చే భక్తులకు 1500 బ్రేక్ దర్శనాల టికెట్లు కేటాయిస్తున్నారు. రకరకాల మార్గాల్లో ప్రజాప్రతినిధులు ఒత్తిళ్ళు తెచ్చి మరికొన్ని వీవీఐపీ, బ్రేక్ దర్శనాల టికెట్లు తీసుకుంటున్నారు. ఇలా వివిధ రకాల్లో వీవీఐపీ, బ్రేక్ దర్శనాల టికెట్లు రోజుకు సుమారు 7500 వరకు జారీ అవుతున్నాయి. ప్రతిరోజు ఉదయం 3.30 గంటల ప్రాంతంలో శ్రీవారి దర్శనం మొదలైతే వీవీఐపీ, బ్రేక్ దర్శనాలు పూర్తయ్యేసరికి మధ్యాహ్నం సుమారు 1.30 అయిపోతోంది.
ఇపుడున్నదానికి అదనంగా తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలకు కూడా వీవీఐపీ, బ్రేక్ దర్శనాల టికెట్లను ఇష్యూ చేస్తే దర్శనాలు మరో గంట లేకపోతే రెండు గంటలు ఆలస్యమవుతుందని టీటీడీ ఉన్నతాధికారుల్లో టెన్షన్ పెరిగిపోతోంది. తెలంగాణలో ఎంఎల్ఏలు 119 మంది, ఎంఎల్సీలు 40, లోక్ సభ ఎంపీలు 17 మంది, 7గురు రాజ్యసభ ఎంపీలున్నారు. మొత్తం 183 మంది ప్రతిరోజు తలా ఐదు సిఫారసు లేఖలు ఇచ్చినా మొత్తం 4వేల మందికి పైగా దర్శనాలకు వస్తారని టీటీడీ అంచనా వేస్తోంది. ఇప్పుడున్న సమస్యకే పరిష్కారం తేలకుండా తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖలను వచ్చినవి వచ్చినట్లు ఆమోదించటం సాధ్యంకాదని టీటీడీ ఉన్నతాధికారులు తేల్చారు. దాంతో తెలంగాణ-ఏపీ మధ్య తిరుమల శ్రీవారి దర్శనం పంచాయితీ ఇప్పటికీ కంటిన్యు అవుతునే ఉంది.
లేఖలను పట్టించుకోవటంలేదు
ఇదే విషయమై తెలంగాణ ఫెడరల్ తో మహబూబ్ నగర్ ఎంఎల్ఏ యెన్నం శ్రీనివాసరెడ్డి(MLA Yennam Srinivasula Reddy) మాట్లాడుతు తమ సిఫారసు లేఖలను తిరుమలలో అధికారులు పట్టించుకోవటంలేదన్నారు. తమనియోజకవర్గాల నుండి తిరుమలకు వెళుతున్నాం దర్శనానికి, కాటేజీలకు సిఫారసులేఖలు కావాలని అడిగినపుడు ఇవ్వకుండా ఎలాగుంటామని యెన్నం ఆవేధన వ్యక్తంచేశారు. తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖలు ఆమోదం పొందేందుకు టీటీడీ అధికారులు ఏవిధంగా వర్కవుట్ చేస్తున్నారో తెలీదని ఎంఎల్ఏ అన్నారు. అడిగిన వారికి తాను సిఫారసు లేఖలు ఇస్తున్నట్లు యెన్నం శ్రీనివాసులరెడ్డి చెప్పారు.