నేరచరిత్రలో మగవాళ్ళతో పోటీపడుతున్న మహిళా ప్రజాప్రతినిధులు
అసోసియేషన్ ఆఫ్ డమక్రటిక్ రిఫార్మ్స్ అండ్ ఎలక్షన్ వాచ్ (ఏడీఆర్)(ADR) అనే సంస్ధ విడుదలచేసిన తాజా రిపోర్టు చూస్తే జనాలు నోరెళ్ళబెట్టాల్సిందే;
మామూలుగా నేరాలు, నేరచరిత్ర అనగానే ఎవరికైనా మగవాళ్ళే గుర్తుకొస్తారు. అయితే అసోసియేషన్ ఆఫ్ డమక్రటిక్ రిఫార్మ్స్ అండ్ ఎలక్షన్ వాచ్ (ఏడీఆర్)(ADR) అనే సంస్ధ విడుదలచేసిన తాజా రిపోర్టు చూస్తే జనాలు నోరెళ్ళబెట్టాల్సిందే. ఎందుకంటే నేరచరిత్రలో మగవాళ్ళతో మహిళా ప్రజాప్రతినిధులు(Women Public Representatives) కూడా పోటీపడుతున్న విషయం అర్ధమవుతోంది. ఇంతకీ విషయం ఏమిటంటే ఏడీఆర్ విడుదలచేసిన తాజా రిపోర్టు ప్రకారం దేశంలోని మొత్తం ఎంపీలు, ఎంఎల్ఏల్లో 28 శాతం మంది మహిళా ప్రజాప్రతినిధులకు నేరచరిత్ర ఉంది. మొత్తం 543 లోక్ సభ ఎంపీల్లో మహిళల సంఖ్య 75. వీరిలో 24 మందిపైన తీవ్రమైన నేరారోపణలున్నాయి. అలాగే 238 మంది రాజ్యసభ ఎంపీల్లో 37 మంది మహిళా ఎంపీలున్నారు. వీరిలో 10 మంది మహిళా ఎంపీలకు(Lady Criminal representatives) నేరచరిత్రుంది.
ఇదికాకుండా దేశంలోని వివిధ రాష్ట్రాల్లోని అసెంబ్లీల్లో 400 మంది మహిళా ఎంఎల్ఏలున్నారు. వీరిలో 109 మంది మీద రకరకాల కేసులున్నాయి. ఇందులో కూడా 14 మంది లోక్ సభ ఎంపీలు, ఏడుగురు రాజ్యసభ ఎంపీలు, 57 మంది ఎంఎల్ఏలతో కలిపి 78 మంది మహిళా ప్రజాప్రతినిధులపైన హత్యాయత్నం, హత్యలు, కిడ్నాపుల్లాంటి తీవ్రమైన కేసులున్నాయంటే వీళ్ళు మామూలోళ్ళు కాదని అర్ధమవుతోంది. కొన్నిసినిమాల్లో లేడీ డాన్లు, లేడి విలన్లను చూస్తునే ఉంటాము. అయితే సినిమాల్లో చూసే లేడిడాన్లు, విలన్లు నిజజీవితంలోని మహిళా ప్రజాప్రతినిధుల ముందు ఎందుకూ పనికిరారన్న విషయం అర్ధమైపోతోంది.
రాష్ట్రాల వారీగా పరిశీలిస్తే గోవా(Goa)లో ముగ్గురు ఎంపీలు, ఇద్దరు ఎంఎల్ఏలు, తెలంగాణ(Telangana)లో 8 మంది ఎంఎల్ఏలు, ఏపీలో 14 మంది, పంజాబ్(Punjab) కు చెందిన ఏడుగురు, కేరళ(Kerala)లోని ఏడుగురు, బీహార్ లోని15 మందిపైన క్రిమినల్ కేసులు నమోదై ఉన్నాయి. ఇక పార్టీలపరంగా చూస్తే అత్యధిక షేర్ బీజేపీదనే చెప్పాలి. బీజేపీ(BJP) ప్రజాప్రతినిధుల్లో 217, కాంగ్రెస్ లో 83, టీడీపీ(TDP)లో 20మంది, ఆమ్ ఆద్మీపార్టీకి చెందిన 13 మంది ప్రజాప్రతినిధులపైన క్రిమినల్ కేసులు దర్యాప్తులో ఉన్నాయి. ఈలెక్కలుచూస్తుంటే నేరచరిత్రలో మగవాళ్ళకి ఎందులోనూ తీసిపోమని మహిళా ప్రజాప్రతినిధులు చాటిచెప్పినట్లయ్యింది.