హైదరాబాద్ లో మహిళల భద్రత భేష్, ప్రపంచ సుందరీమణుల ప్రశంసలు
మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొనేందుకు హైదరాబాద్ వచ్చిన ప్రపంచ అందాలభామలు తెలంగాణను, అందులోనూ హైదరాబాద్ నగరాన్ని ప్రశంసించారు.;
By : The Federal
Update: 2025-05-23 13:11 GMT
72వ మిస్ వరల్డ్ ఫెస్టివల్‌లో భాగంగా హైదరాబాద్‌లో నిర్వహించిన హెడ్ టు హెడ్ చాలెంజ్ ఫినాలే సందర్భంగా ప్రపంచంలోని వివిధ ఖండాల నుంచి వచ్చిన అందాలభామలు తెలంగాణ రాష్ట్రాన్ని — ముఖ్యంగా హైదరాబాద్‌ను అభినందనలతో ముంచెత్తారు. ఈ పోటీ సందర్భంగా జడ్జీలు అడిగిన ప్రశ్నలకు తెలంగాణ సంస్కృతి, అభివృద్ధి, మహిళల సాధికారత, భద్రతకు సంబంధించి మిస్ వరల్డ్ పోటీదారులు చేసిన వ్యాఖ్యలు ప్రపంచం దృష్టిని ఆకర్షించాయి.మహిళల భద్రత, సాధికారతకు తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా నిలుస్తుందని వారు పేర్కొన్నారు. “తెలంగాణ అభివృద్ధి, ఆత్మీయత, ఆత్మగౌరవానికి ప్రతీక” అని సుందరీమణులు చెప్పారు.
మహిళల భద్రతపై అభినందనలు
తెలంగాణ రాష్ట్రం మహిళల భద్రతను హక్కుగా గుర్తించి, తగిన చర్యలు తీసుకుంటుందని ప్రపంచ సుందరీమణులు స్పష్టం చేశారు. భద్రత అనేది ఒక హక్కు, దానిని అందించడంలో తెలంగాణ ముందుందన్నారు.హైదరాబాద్ నగర వీధుల్లో మహిళలు రాత్రిపూట కూడా భయపడకుండా స్వేచ్ఛగా తిరగగలగడం ఆశ్చర్యాన్ని కలిగించిందని వారు చెప్పారు. సురక్షిత నగరానికి హైదరాబాద్ ప్రతీక అని వారు అభివర్ణించారు.పోలీస్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌ను సందర్శించి అక్కడ షీ టీమ్స్, హాక్ ఐ, 24x7 పర్యవేక్షణ వంటి సాంకేతిక భద్రతా వ్యవస్థలను పరిశీలించి మహిళల రక్షణ కోసం తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు అందాల భామలను విశేషంగా ఆకర్షించాయి.
తెలంగాణను ప్రపంచానికి ఎలా పరిచయం చేస్తారు?
తెలంగాణ సాంకేతికత, వైద్య రంగాల్లో అభివృద్ధి చెందడమే కాకుండా, మహిళల హక్కులు, విద్య, సాధికారతకు కూడా అత్యున్నత ప్రాధాన్యతనిచ్చే రాష్ట్రంగా పలువురు భామలు వివరించారు. ఇది ప్రపంచానికి శక్తివంతమైన సందేశాన్ని అందిస్తున్నదని వారు అభిప్రాయపడ్డారు.తెలంగాణ ప్రజల ఆత్మీయత, ఆదరణ, ఆతిథ్య భావం ప్రత్యేకంగా నిలిచిందన్నారు.తెలంగాణ అనుబంధాల తాటిపై నిలిచిన భూమి, స్నేహబంధాలకు నిలయం, సంస్కృతికి ప్రతీకగా భావిస్తున్నామని వారు పేర్కొన్నారు.
హెడ్ టు హెడ్ ఛాలెంజ్ ఫినాలేలో విజేతలు
72వ మిస్ వరల్డ్ ఫెస్టివల్ హెడ్ టు హెడ్ ఛాలెంజ్ ఫినాలేలో మిస్ వేల్స్, మిస్ టర్కీ, మిస్ ట్రినిడాడ్ అండ్ టొబాగో,మిస్ జాంబియాలకు కాంటినెంటల్ విజేతలుగా కిరీటాన్ని అలంకరించారు.