ఢిల్లీలో చెయ్యెత్తి జైకొట్టనున్న.. చాకలి ఐలమ్మ,కొమురం భీం, రాంజీ ...

మూడేళ్ల తెలంగాణ శకటం ఢిల్లీలో కనువిందు చేయనుంది. ఆంధ్రా విద్యాప్రగతి కళ్లకు కట్టనుంది. తెలుగు రాష్ట్రాల శకటాలు అద్భుతంగా ఉండనున్నాయంటున్నారు

Update: 2024-01-23 02:52 GMT
TS Image

భారత్‌ 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు సిద్దం అవుతోంది. ఇప్పటికే ఢిల్లీలో రిపబ్లిక్‌ డే పరేడ్‌కు రిహార్సల్స్‌ జోరుగా జరుగుతున్నాయి. ఈసారి వికసిత్ భారత్', 'భారత్ - లోక్ తంత్ర కీ మాతృక' ప్రధాన ఇతివృత్తాలుగా రిపబ్లిక్ డే పరేడ్ జరగనుంది. ఈ రిపబ్లిక్‌ డే పరేడ్‌కు దేశవ్యాప్తంగా 13 వేల మంది అతిథులకు ఆహ్వానాలు అందాయి.


జనవరి 26న కర్తవ్య పథ్‌లో 90 నిమిషాల పాటు రిపబ్లిక్ డే పరేడ్ సాగనుంది. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం12 గంటల వరకు రిపబ్లిక్ డే పరేడ్ జరగనుంది. ఈసారి రిపబ్లిక్ డే వేడుకలకు చీఫ్‌ గెస్ట్‌గా ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌ హాజరుకానున్నారు. రిపబ్లిక్‌ డే పరేడ్‌లో ఫ్రాన్స్‌ కవాతు బృందాలు, బ్యాండ్‌ బృందాలు, ఫ్రాన్స్ యుద్ధ విమానాలు పాల్గొంటున్నాయి.

తెలుగు రాష్ట్రాల శకటాలు ఇలా..

గణతంత్ర వేడుకలు అంటేనే శకటాల ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ఈసారి పరేడ్‌లో మన దేశంలోని 16 రాష్ట్రాలకు చెందిన శకటాలు, 9 కేంద్ర ప్రభుత్వ శకటాలు కనువిందు చేయనున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో విద్యారంగంలో వచ్చిన మార్పులను ఇతివృతంగా చేసుకొని ఈసారి ఏపీ శకటాన్ని రూపొందించారు. పాఠశాల విద్యను మార్చడం, విద్యార్థులను ప్రపంచవ్యాప్తంగా పోటీపడే విధానం ప్రతిబింబించేలా ఈ శకటాన్ని ఏర్పాటు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యా రంగంలో చేపట్టిన వివిధ సంస్కరణలకు అద్దం పట్టేలా ఏపీ శకటాన్ని రూపకల్పన చేశారు. విద్యార్థులకు ట్యాబ్‌లు, డిజిటల్‌ బోర్డులు, ఇంగ్లీషు మీడియం వంటి మార్పులను ఈ శకటంలో ఉట్టిపడేలా తయారు చేశారు. వికసిత్ భారత్ థీమ్‌లో భాగంగా ఏపీ శకటాన్ని ఢిల్లీలో జరిగే రిపబ్లిక్‌ డే పరేడ్‌లో ప్రదర్శించనున్నారు. ప్రత్యేకంగా ఏపీ శకటాన్ని, ప్రత్యేక థీమ్‌ సాంగ్‌ను సమాచార పౌర సంబంధాల శాఖ రూపొందించింది.

మూడేళ్ల తర్వాత తెలంగాణ శకటం...

ఈసారి ఢిల్లీ గణతంత్ర వేడుకల్లో తెలంగాణ శకటం కూడా ప్రదర్శనకు రానుంది. దాదాపు మూడు సంవత్సరాల తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చొరవతో ఢిల్లీ గణతంత్ర వేడుకల్లో తెలంగాణ శకటం కనబడబోతోంది. 2015, 2020 సంవత్సరాల తర్వాత మూడోసారి తెలంగాణ శకటానికి ఈ అవకాశం దక్కింది.

ఈ సంవత్సరంతో పాటు వచ్చే మరో రెండేళ్ల పాటు తెలంగాణా శకటం ప్రదర్శనకు అనుమతి లభించింది. కొమరం భీం, రాంజీ గోండు, చాకలి ఐలమ్మ ఇలా పలువురు పోరాట యోధులతో తెలంగాణ శకటాన్ని రూపకల్పన చేశారు. నిరంకుశ విధానాలు, రాచరిక వ్యవస్థ, నియంతృత్వ పాలనకు వ్యతిరేకంగా తెలంగాణ ఉద్యమంలో జరిగిన ఎన్నో అద్భుత ఘట్టాలకు సాక్ష్యంగా ఈ శకటం రిపబ్లిక్‌డే వేడుకల్లో ప్రదర్శితం కానుంది. 

Tags:    

Similar News