ఆ విషయంలో హైకమాండ్ నిర్ణయమే ఫైనల్: సీఎం
కర్నాటకలో గత కొన్ని రోజులుగా డిప్యూటీ సీఎం విషయంలో జరుగుతున్న డిమాండ్లపై సీఎం సిద్ధరామయ్య స్పందించారు.
By : The Federal
Update: 2024-06-26 12:45 GMT
కర్నాటకలో డిప్యూటీ సీఎం ల విషయంలో జరుగుతున్న చర్చలపై సీఎం సిద్ధరామయ్య స్పందించారు. ఈ విషయంలో హై కమాండ్ నిర్ణయమే ఫైనల్ అని పేర్కొన్నారు. కర్నాటకలో కాంగ్రెస్ సర్కార్ గత సంవత్సరం కొలువుదీరింది. అక్కడ ప్రస్తుతం ఒక్కలిగ వర్గానికి చెందిన పీసీసీ చీఫ్ డీకే శివకుమార్ ఉపముఖ్యమంత్రిగా విధులు నిర్వహిస్తున్నారు.
అయితే రాష్ట్రానికి మరో ముగ్గురు ఉపముఖ్యమంత్రులు కావాలని కొన్నివర్గాలు డిమాండ్ చేస్తున్నాయి. ముఖ్యంగా వీరశైవ-లింగాయత్, ఎస్సీ/ఎస్టీ, మైనారిటీ వర్గాలకు చెందిన నేతలకు డిప్యూటీ సీఎం పదవులు ఇవ్వాలని కొందరు మంత్రులు బహిరంగంగా ప్రకటనలు చేస్తున్నారు. ఈ విషయం పై సీఎం మాట్లాడుతూ.. హైకమాండ్ ఏం నిర్ణయం తీసుకుంటుందో అది ఫైనల్ అని విలేకరులు అడిగిన ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.
మరో ముగ్గురు డిప్యూటీ సీఎంలను కావాలని కొంతమంది మంత్రులు కోరడం, డీకే ప్రాధాన్యం తగ్గించడానికే సీఎం వేసిన ఎత్తుగడగా డీకే వర్గం నాయకులు భావిస్తున్నారు. ప్రస్తుతం సీఎం పీఠంపై ఉన్న సిద్ధరామయ్యను సగం పదవీకాలం పూర్తికాగానే తొలగించి, డీకే కు ప్రభుత్వ పగ్గాలు అప్పగిస్తారని, పార్టీ పగ్గాలు కూడా ఆయన చేతిలోనే ఉంటాయని భావిస్తున్నారు. దీనితోనే సీఎం వర్గం అప్రమత్తమై ఈ విధంగా బహిరంగంగా ప్రకటనలు చేస్తున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు.
సహకార శాఖ మంత్రి కెఎన్ రాజన్న, గృహనిర్మాణ శాఖ మంత్రి బిజెడ్ జమీర్ అహ్మద్ ఖాన్, పబ్లిక్ వర్క్స్ మంత్రి సతీష్ జార్కిహోళి మరికొందరు -- సిద్ధరామయ్యకు సన్నిహితులుగా ముద్రపడ్డారు. ఈ వారం ప్రారంభంలో వీరంతా మరో ముగ్గురు డిప్యూటీ సిఎంలు రాష్ట్రానికి కావాలని కోరుతున్నారు.
గత ఏడాది మేలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత ముఖ్యమంత్రి పదవికి సిద్ధరామయ్యకు, శివకుమార్‌కు మధ్య గట్టి పోటీ నెలకొనడంతో శివకుమార్‌కు "ఒకే" డిప్యూటీ సీఎం అని కాంగ్రెస్ నిర్ణయించింది.
సిఎం పదవి కోసం తన వాదనను వదులుకోవాలని, ఉప ముఖ్యమంత్రి పాత్రను చేపట్టాలని శివకుమార్‌ను పార్టీ ఒప్పించింది. తన ప్రాధాన్యం పార్టీలో తగ్గదని కూడా నచ్చచెప్పింది. అయితే తాజాగా మంత్రుల డిమాండ్ పై తన అసంతృప్తిని వ్యక్తం చేసిన రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ డీకే, ఈ విషయంలో పార్టీ తగిన విధంగా స్పందిస్తుందని అన్నారు.
"ఎవరైనా ఏదైనా చెబితే మీరు (మీడియా) వార్తలు పెడతారు. సంతోషించే వ్యక్తులకు (వార్తల్లో కనిపించడం ద్వారా) నేను ఎందుకు నో చెప్పాలి... ఎవరైనా ఏ డిమాండ్ చేసినా పార్టీ వారికి తగిన విధంగా స్పందిస్తుంది. సింపుల్" అని శివకుమార్ అన్నారు.
పార్టీలో మరికొంతమంది డిప్యూటీ సీఎంలు ఉండే యోచన ఉందా అని అడగ్గా, “దయచేసి మల్లికార్జున్ ఖర్గే (ఏఐసీసీ అధ్యక్షుడు), మా ఇన్‌ఛార్జ్ జనరల్ సెక్రటరీని కలవండి లేదా ముఖ్యమంత్రిని అడగండి” అని అన్నారు.