‘వైద్యం సరిగా చేయడంలేదనే అనుమానంతో ఏడుసార్లు కత్తితో పొడిచాడు’
వైద్యులపై దాడులు జరుగుతూనే ఉన్నాయి. బెంగాల్ ఆర్జీకర్ ఆస్పత్రిలో జరిగిన దారుణ ఉదంతం మరువక ముందే తాజాగా చెన్నైలోని ఓ ప్రభుత్వ ఆస్పత్రి వైద్యుడిపై..
By : The Federal
Update: 2024-11-13 12:04 GMT
బెంగాల్ లోని ఆర్జీకర్ ఆస్పత్రిలో జూనియర్ వైద్యురాలిపై జరిగిన క్రూరమైన అత్యాచారం, హత్య సంఘటన మరువక ముందే చెన్నైలో ఓ వైద్యుడిపై దాడి జరిగింది. క్యాన్సర్ తో బాధపడుతున్న తన తల్లికి వైద్యులు సరైన చికిత్స అందించడం లేదని మనస్తాపానికి గురైన ఓ రోగి కుమారుడు ప్రభుత్వ ఆస్పత్రిలోని వైద్యుడిని ఏడుసార్లు కత్తితో పొడిచినట్లు పోలీసులు తెలిపారు.
నిందితుడు కూడా ఇదే ఆస్పత్రిలో అటెండర్ గా పని చేస్తున్నాడని, ప్రస్తుతం అతడిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. దాడికి గురైన వైద్యుడికి చికిత్స జరుగుతోందని, ప్రస్తుతం అతడి ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు ఆస్పత్రి అధికారులు తెలిపారు.
కత్తిపోట్లు
డాక్టర్, ఆంకాలజిస్ట్, గుండె రోగి కూడా.. అతని ఛాతీ పైభాగం, తలపై గాయాలయ్యాయి. ఆయన ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో ఉన్నారని, అయితే ఆయన పరిస్థితి నిలకడగా ఉందని ఆరోగ్య మంత్రి సుబ్రమణియన్ మీడియాకు తెలిపారు.
చెన్నైలోని గిండీలోని కలైంజ్ఞర్ సెంటినరీ హాస్పిటల్ ఔట్ పేషెంట్ విభాగంలో ఈ దాడి జరిగింది. క్యాన్సర్ పేషెంట్ అయిన తన తల్లికి డాక్టర్ తప్పుగా మందులు రాశాడని యువకుడు అనుమానించాడు. డాక్టర్‌పై చిన్న కత్తితో దాడి చేసి పారిపోయేందుకు ప్రయత్నించగా అతడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు.
విచారణకు ఆదేశించిన సీఎం..
కత్తిపోటు ఘటనపై విచారణకు ఆదేశించిన ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్.. వైద్యుడికి వైద్య సాయం అందజేస్తామని హామీ ఇచ్చారు. ఇకపై ఇలాంటి దాడులు జరగవని కూడా వైద్యులకు హామీ ఇచ్చారు. "వైద్యుల సేవ ప్రశంసనీయం. వారి భద్రతను నిర్ధారించడం మా బాధ్యత" అని చెప్పారు.
ఈ విషయంపై ముఖ్యమంత్రి ఎక్స్ లో సుదీర్ఘ సందేశం ఇచ్చారు.. “సమయంతో సంబంధం లేకుండా రోగులకు చికిత్స అందించడంలో మన ప్రభుత్వ వైద్యుల నిస్వార్థ కృషి ఎనలేనిది. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది." అని హామీ ఇచ్చారు.