‘పరువు హత్యల నివారణకు త్వరలో చట్టం’
తమిళనాడు సీఎం స్టాలిన్..
కులాంతర, మతాంతర వివాహాలతో తమ కుటుంబ పరువు పోతుందని భావించిన యువతి, యువకుల తల్లిదండ్రులు పరువు హత్యల(Honour Killings)కు పాల్పడుతున్నారు. ఈ తరహా ఘటనలు తమిళనాడు(Tamil Nadu)లో ఇటీవల బాగా పెరిగిపోయాయి. ఈ నేపథ్యంలో వీటి నివారణకు కొత్త చట్టం తీసుకువస్తామని తమిళనాడు సీఎం స్టాలిన్ (CM Stalin) చెప్పారు. పరువు హత్యలపై అధ్యయనం చేసేందుకు రిటైర్డ్ జడ్జి కేఎన్ బాషా నేతృత్వంలోని కమిషన్‌ను కూడా ఏర్పాటు చేస్తున్నామని ఆయన తెలిపారు. కమిషన్ తొలుత సమాజంలోని వివిధ వర్గాల నుంచి అభిప్రాయాలను సేకరిస్తుంది. ఆ తర్వాత తన సిఫార్సులను ప్రభుత్వానికి సమర్పించనుంది. ప్రభుత్వ చర్యపై పలువురు సామాజిక పరిశీలకులు స్పందించారు. ఇది ఎప్పుడో చేసి ఉండాల్సిందని, ఆలస్యంగానయినా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం శుభపరిణామని వారు పేర్కొన్నారు.
ஆணவப் படுகொலைகளை தடுக்க ஓய்வு பெற்ற உயர் நீதிமன்ற நீதிபதி கே.என்.பாஷா தலைமையில் ஆணையம்!
— DMK (@arivalayam) October 17, 2025
அனைத்து விதமான ஆதிக்கத்துக்கும் முற்றுப்புள்ளி வைத்தாக வேண்டும். ஆதிக்க எதிர்ப்பும், சமத்துவச் சிந்தனையும் கொண்ட - சுயமரியாதையும், அன்பும் சூழ்ந்த மானுடத்தை உருவாக்குவதற்கான பரப்புரையை ஓர்… pic.twitter.com/OgwTK34Skk
‘ప్రభుత్వం మౌనంగా ఉండబోదు..’
"కులం లేదా కుటుంబ గౌరవం పేరుతో యువతను చంపడానికి మేం అనుమతించం. ప్రభుత్వం మౌనంగా ఉండదు. పరువు హత్యలకు వ్యతిరేకంగా అవగాహన కల్పించాల్సిన సమయం వచ్చింది. రిటైర్డ్ జడ్జి కేఎన్ బాషా కమిషన్ వాటిపై సమగ్రంగా అధ్యయనం చేస్తుంది. బాధిత కుటుంబాలను, సామాజిక కార్యకర్తలను, న్యాయ నిపుణులను సంప్రదిస్తుంది. కమిషన్ సిఫార్సులను ప్రభుత్వం పరిశీలిస్తుంది. ప్రత్యేక చట్టాన్ని తీసుకురావడానికి తమిళనాడు ముందుంటుంది, ’’ అని స్టాలిన్ చెప్పారు.
తమిళనాడులో ఇటీవలే అత్యంత వెనుకబడిన తరగతి (MBC)కి చెందిన యువ దళిత టెక్నీషియన్ కవిన్‌ను ప్రేమించిన యువతి సోదరుడు హత్య చేశాడు. ప్రేమించి పెళ్లి చేసుకున్న కులాంతర, మతాంతర జంటలకు రక్షణ కల్పించాలన్న డిమాండ్లు కూడా తమిళనాడులో ఎక్కువయ్యాయి.
విదుతలై చిరుతైగల్ కచ్చి (VCK) నాయకుడు, పార్లమెంటు సభ్యుడు తోల్ తిరుమావళవన్ తమిళనాడు, ఇతర రాష్ట్రాలలో పెరుగుతోన్న "పరువు హత్యల" సంఖ్యను నిరోధించడానికి ప్రత్యేక చట్టం అవసరాన్ని పునరుద్ఘాటించారు .
మహిళా హక్కుల కార్యకర్త, ఆల్ ఇండియా డెమోక్రటిక్ ఉమెన్స్ అసోసియేషన్ (AIDWA) నాయకురాలు పి. సుగంధి ది ఫెడరల్‌తో మాట్లాడుతూ.. 2015లో సీపీఐ(ఎం) ప్రైవేట్ బిల్లును ప్రవేశపెట్టినప్పుడు.. అప్పటి ఏఐఏడీఎంకే ప్రభుత్వం ఎస్సీ/ఎస్టీ చట్టం సరిపోతుందని చెబుతూ దానిని తోసిపుచ్చిందని చెప్పారు.
"అయితే స్టాలిన్ చర్యను స్వాగతిస్తున్నాం. కానీ అది కాగితాలకే పరిమితం కాకుండా చూడాలి." అని తాను కోరుకుంటున్నానని చెప్పారు సుగంధి.