టీవీకే నాయకులకు కనికరమే లేదు: మద్రాస్ హైకోర్టు
తొక్కిసలాట జరిగితే సాయం చేయకుండా పారిపోయారన్నా న్యాయమూర్తి
By : The Federal
Update: 2025-10-04 06:21 GMT
ప్రమీలా కృష్ణన్
కరూర్ తొక్కిసలాట జరిగిన తరువాత టీవీకే నాయకులు అక్కడి నుంచి పారిపోయారని మద్రాస్ హైకోర్టు ఘాటుగా వ్యాఖ్యానించింది. ‘‘సంఘటన జరిగిన తరువాత ప్రదేశాన్ని విడిచిపెట్టారని, కనీసం పశ్చాత్తాపం కూడా వ్యక్తం చేయలేదని’’ కేసును విచారించిన న్యాయమూర్తి తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
అలాంటి ప్రవర్తన పార్టీ అధినేత సీ. జోసెఫ్ విజయ్ మానసిక స్థితిని తెలియజేస్తుందని అన్నారు. సెప్టెంబర్ 27 న కరూర్ లోని ఎన్నికల ర్యాలీలో జరిగిన తొక్కిసలాటలో పిల్లలు, మహిళలు సహ 41 మంది మరణించారు. దీనితో అక్కడ అధికార డీఎంకే, టీవీకే పార్టీలు పరస్పరం విమర్శలు గుప్పించుకుంటున్నారు.
మహిళలు, పిల్లలు చనిపోయినప్పుడూ కోర్టు ఇటువంటి వాటిని తీవ్రంగా ఖండిస్తుందని న్యాయమూర్తి ఎన్. సెంథిల్ కుమార్ అన్నారు. ఈ సంఘటనను దర్యాప్తు చేయడానికి ఐపీఎస్ అధికారి అస్రా గార్గ్ నేతృత్వంలోని ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) ఏర్పాటు చేస్తూ ఆదేశాలు జారీ చేశారు.
పోలీసుల నిర్లక్ష్యం..
కరూర్ తొక్కిసలాట విచారణ సందర్భంగా అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఇ. రాజ్ తిలక్ సహాయంతో సీనియర్ న్యాయవాదీ ఎన్ ఆర్ ఇళంగో వాదిస్తూ.. పుకార్లు వ్యాపించి ప్రాణాలు కోల్పోయేలా చేస్తారని అన్నారు. శ్రీలంక, నేపాల్ తరహలో తమిళనాడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా యువత తిరుగుబాటు చేయాలని టీవీకే నాయకుడు ఆధవ్ అర్జున్ పై చెన్నై పోలీసులు చర్య తీసుకోకుండా వదిలి పెట్టినందుకు కూడా కోర్టు మందలించింది. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించాలని పోలీసులను ఆదేశించారు. ‘‘ఒక చిన్న నిప్పురవ్వ కూడా విపత్తుకు దారి తీస్తుంది. ఎవరైనా ఏదైనా మాట్లాడవచ్చా? శాంతిభద్రతలు రాష్ట్రంలో లేవా? ’’ అని ప్రశ్నించారు.
ఈ కేసుపై కేవలం ఎఫ్ఐఆర్ చేస్తే సరిపోతుందని టీవీకే చేసిన వాదనలను న్యాయమూర్తి తోసిపుచ్చారు. భావ ప్రకటన స్వేచ్ఛ అపరిమతం కాదని, సహేతుక పరిమితులకు లోబడి ఉంటుందని వ్యాఖ్యానించారు.
సెప్టెంబర్ 27న విజయ్ ప్రచారం సందర్భంగా ఒక ప్రయివేట్ ఆస్పత్రిపై దాడికి పాల్పడిన మూక హింస కేసులో టీవీకే నమక్కల్ కార్యదర్శి ఎన్. సతీష్ కుమార్ ముందస్తు బెయిల్ పిటిషన్ ను కూడా కోర్టు తిరస్కరించింది. ప్రభుత్వం కూడా ఆయన విజ్ఞప్తిని తిరస్కరించింది. ఇటువంటి నేరాలపై ఎటువంటి దయ చూపనవసరం లేదని పేర్కొంది.