‘టీవీకే రాజకీయ పార్టీ కాదు’
మద్రాస్ హైకోర్టుకు తెలిపిన కేంద్ర ఎన్నికల కమిషన్..
తమిళగ వెట్రీ కజగం (TVK) గుర్తింపు పొందిన రాజకీయ పార్టీ కాదని భారత ఎన్నికల సంఘం శుక్రవారం (అక్టోబర్ 17) మద్రాస్ హైకోర్టుకు తెలిపింది. టీవీకే గుర్తింపును రద్దు చేయాలని కోరుతూ సి. సెల్వకుమార్ అనే వ్యక్తి దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం(PIL)పై కోర్టు విచారణ చేపట్టింది. చీఫ్ జస్టిస్ ఎంఎం శ్రీవాస్తవ, జస్టిస్ జి అరుళ్ మురుగన్‌తో కూడిన ధర్మాసనం ముందు ఈసీ తరపు న్యాయవాది నిరంజన్ రాజగోపాల్ తన వాదనలు వినిపించారు.
TVK చీఫ్ విజయ్(Vijay) కరూర్‌లో సెప్టెంబర్ 27న నిర్వహించిన పార్టీ ప్రచార ర్యాలీలో జరిగిన తొక్కిసలాట(Stampede)లో 41 మంది మరణించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టీవీకే గుర్తింపును రద్దు చేయాలని సెల్వకుమార్ డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో తొక్కిసలాటకు సంబంధించిన అన్ని విషయాలను విచారించేందుకు బెంచ్ ఏర్పాటు చేయాలని రిజిస్ట్రీని ఆదేశించింది హైకోర్టు.
ఫిబ్రవరి 5, 2024 నాటి ఆదేశాలను ఖచ్చితంగా పాటించాలని, రాష్ట్రవ్యాప్తంగా జరిగే రాజకీయ ర్యాలీలు, ఊరేగింపులు, ఎన్నికల ప్రచారాలలో పిల్లలు, మహిళలు హాజరుకాకుండా చూడాలని సెల్వకుమార్ తన పిటిషన్‌లో ECIని కోరారు. మృతుల కుటుంబాలకు రూ. కోటి నష్టపరిహారం, క్షతగాత్రులకు తగిన పరిహారం చెల్లించేలా టీవీకేను ఆదేశించాలని కూడా పిల్‌లో కోరారు.