క్షమాపణతోనే సరిపెడతారా? డీఎంకేను ప్రశ్నించిన టీవీకే చీఫ్
కేసుల విషయంలో కోర్టులే జోక్యం చేసుకుంటున్నపుడు ఇక ముఖ్యమంత్రి ఎందుకని ప్రశ్నించిన నటుడు విజయ్..;
తమిళనాట (Tamil Nadu) సెక్యూరిటీ గార్డు అజిత్ కుమార్ పోలీసు కస్టడీ మరణం (Custodial Death) సంచలనంగా మారింది. ఈ ఘటనపై నిర్వహించిన భారీ నిరసన కార్యక్రమంలో ‘తమిళగ వెట్రి కళగం (Tamizhaga Vetri Kazhagam)’ పార్టీ అధ్యక్షుడు, నటుడు విజయ్ (Vijay) పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన డీఎంకే ప్రభుత్వాన్ని తూర్పారబట్టారు.
‘‘పోలీసు కస్టడీలో చనిపోయిన అజిత్ కుటుంబానికి ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ (CM Stalin) క్షమాపణ చెప్పారు. అయితే 2021 నుంచి డీఎంకే పాలనలో కస్టడీలో చనిపోయిన 24 మంది బాధిత కుటుంబాలకు క్షమాపణ చెప్పారా? అని ప్రశ్నించారు. ఆ కుటుంబాలకు పరిహారం చెల్లించారా?’’ అని ప్రశ్నించారు
అజిత్ కస్టోడియల్ డెత్‌పై కోర్టు పర్యవేక్షణలో సిట్‌తో దర్యాప్తు చేయించాలని తమ పార్టీ డిమాండ్ చేస్తే.. కేసును సీబీఐకి అప్పగించడాన్ని విజయ్ తప్పుబట్టారు. కేంద్ర దర్యాప్తు సంస్థ ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీ చేతుల్లో కీలుబొమ్మ అని విమర్శించారు.
నిరసన కార్యక్రమంలో నల్ల చొక్కా ధరించిన విజయ్.. రాష్ట్రం నుంచి తమకు కావాల్సింది సారీ కాదని, న్యాయమని వ్యాఖ్యానించారు. ‘ప్రభుత్వం నుంచి మనకు ఎక్కువగా సారీ అనే సమాధానమే వస్తోంది. అన్నా యునివర్సిటీ కేసు నుంచి అజిత్ కుమార్ కేసు వరకు.. మీ పాలనలో ఇంకా ఎన్ని దారుణాలు చూడాలి?. కేసుల్లో కోర్టులే జోక్యం చేసుకుంటున్నపుడు ముఖ్యమంత్రితో అవసరం ఏమిటని ప్రశ్నించారు.
ఇంతకు ఏం జరిగింది?
శివగంగై జిల్లా తిరుప్పువనం సమీపంలోని మడపురంలో భద్రకాళియమ్మన్ ఆలయానికి వచ్చిన ఇద్దరు మహిళా భక్తుల నగలు చోరీ అయ్యాయి. ఆ సమయంలో ఆలయంలో సెక్యూరిటీ గార్డుగా విధులు నిర్వహిస్తున్న అజిత్‌కుమార్‌తో సహా పలువురిని పోలీసులు విచారించారు. ఈ క్రమంలో కస్టడీలో పోలీసులు అజిత్‌ను చిత్రహింసలు పెట్టడంతోనే ప్రాణాలు కోల్పోయాడని మీడియాలో వార్తలొచ్చాయి. అజిత్ ఒంటిపై 44 గాయాలున్నాయని పోస్టు మార్టం రిపోర్టులో ఉంది. కస్టడీలో అజిత్‌ను శారీరకంగా హింసించడం వల్లే గుండె, కాలేయం, మిగతా అంతర్గత అవయవాల్లో తీవ్ర రక్తస్రాం అయినట్లు వైద్యులు రిపోర్టులో పేర్కొన్నారు. సంచలనం రేపిన ఈ కేసును ప్రస్తుతం కేంద్ర దర్యాప్తు సంస్థ (CBI) విచారిస్తోంది.