మరో మూడు ప్రాంతాలను టార్గెట్ చేసిన టెర్రరిస్టులు..

పహెల్గామ్ బైసరన్‌లోయలో పర్యాటకులపై కాల్పులకు తెగబడ్డ ఉగ్రమూకలు.. మరో మూడు ప్రదేశాలను ఎంచుకున్నాయి. కాని భద్రత ఎక్కువగా ఉండడంతో తమ ప్రయత్నాన్ని విరమించుకున్నాయి.;

Update: 2025-05-01 09:32 GMT
Click the Play button to listen to article

పహల్గామ్‌(Pahalgam) ఉగ్రదాడి కేసు దర్యాప్తును కేంద్రం జాతీయ దర్యాప్తు సంస్థ (NIA)కు అప్పగించిన విషయం తెలిసిందే. దర్యాపులో భాగంగా కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఏప్రిల్ 22న పహల్గామ్‌లో దాడి చేసిన ఉగ్రవాదులు..అదే ప్రాంతంలోని వినోద ఉద్యానవనం, అరు వ్యాలీ బేతాబ్ వ్యాలీలో కూడా దాడులు చేయాలనుకున్నారని, అయితే ఆ ప్రాంతాల్లో భారీ భద్రత ఉండడం వల్ల దాడి ఆలోచన విరమించుకున్నారని కేసు దర్యాప్తు చేస్తున్న ఓ సీనియర్ అధికారి తెలిపారు.

సంభాషణలకు సాటిలైట్ ఫోన్లు?

ఉగ్రవాదులకు మద్దతు ఇస్తున్నారన్న అనుమానంతో దాదాపు 20 మందిని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో కొందరిని జాతీయ దర్యాప్తు సంస్థ అరెస్టు చేసింది. దాడికి ముందు రోజు దాడి జరిగిన ప్రాంతంలో మూడు ఉపగ్రహ ఫోన్‌లను ఉపయోగించినట్లు ఏజెన్సీ ఆధారాలను సేకరించింది. ఉగ్రవాదులు సిమ్ కార్డు ఉపయోగించకుండానే తమ మధ్య సంభాషణలకు ఈ టెక్నాలజీ ఉపయోగించి ఉండవచ్చని నిఘా వర్గాలు చెబుతున్నాయి.

ఇళ్లలో సోదాలు..

ఇక జమ్మూ కశ్మీర్‌లోని అనంత్‌నాగ్, పుల్వామా, కుప్వారా, హంద్వారా, బండిపోరా, బారాముల్లా, ట్రాల్, సోపోర్‌ సహా పలు ప్రాంతాల్లో నిఘా సంస్థలు విస్తృతంగా దర్యాప్తు చేస్తున్నాయి. జమాతే-ఇ-ఇస్లామి లాంటి నిషేధిత సంస్థల సభ్యులు లేదా సానుభూతిపరుల ఇళ్లలో సోదాలు నిర్వహిస్తున్నారు. నిఘా వర్గాలు, NIA దాదాపు 2,500 మందికి పైగా వ్యక్తులను ప్రశ్నించాయి. వీరిలో దాదాపు 200 మంది తదుపరి విచారణకు కస్టడీలో ఉంచుకున్నారు. 

Tags:    

Similar News