కర్ణాటకలో లింగాయత్‌లు ప్రైవేటు జనగణనకు సిద్ధమవుతున్నారా?
వీరశైవ లింగాయత్(Lingayats)లు ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారా? వారి ప్లాన్ ఏమిటి?;
కర్ణాటక(Karnataka)లోని బలమైన కమ్యూనిటీల్లో వీరశైవ లింగాయత్ ఒకటి. అధికారిక జనాభా లెక్కల్లో వీరి సంఖ్యను తక్కవ చేసి చూపడంపై ఇప్పుడు వారంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. వారి వాస్తవ బలగాన్ని చూపేందుకు ప్రైవేటు జన గణనకు సిద్ధమవుతున్నారు. అన్ని ఉపవర్గాల విద్య, ఉపాధి, ఆర్థిక స్థితి తదితర వివరాల నమోదుకు ఏకంగా ఒక సాఫ్ట్‌వేర్‌ను రూపొందిస్తున్నారు.
సర్వేకు సిద్ధం...
అఖిల భారత వీరశైవ లింగాయత్ మహాసభ (Lingayat Mahasabha) కార్యదర్శి హెచ్‌ఎం రేణుక ప్రసన్న ది ఫెడరల్‌తో మాట్లాడుతూ.. "రాష్ట్రంలో వీరశైవ-లింగాయత్ సమాజ జనాభాను లెక్కకట్టడానికి కుల సర్వే నిర్వహించాలని మహాసభ నిర్ణయించింది. దీని కోసం ఒక సాఫ్ట్‌వేర్ తయారుచేయించాం. తర్వలో డేటా సేకరిస్తాం,’’ అని చెప్పారు.
అధికారిక నివేదిక విడుదల కానప్పటికీ.. కర్ణాటక జనాభాలో దళితులు, వెనుకబడిన తరగతులు, మైనారిటీలు అగ్రస్థానంలో ఉన్నారని, వీరశైవ-లింగాయత్‌లు, వొక్కలిగలు తరువాతి స్థానాల్లో ఉన్నారని సమాచారం. దీంతో లింగాయత్‌లు, వొక్కలిగలు షాక్ అయ్యారు. వెనుకబడిన తరగతుల కమిషన్ కుల గణన నివేదిక నుంచి లీక్ అయిన సమాచారం మేరకు లింగాయతుల జనాభా 17-18 శాతం నుంచి 10 శాతం కంటే తక్కువగా, వొక్కలిగల జనాభా 14 శాతం నుంచి 8 శాతానికి తగ్గిందని తెలుస్తోంది. ఈ తగ్గుదల కర్ణాటక రాజకీయాలను తీవ్ర ప్రభావం చూపే రెండు వర్గాల నాయకులను దిగ్భ్రాంతికి గురిచేసింది. కర్ణాటక జనాభాలో దళితులు ఇప్పుడు 24 శాతంగా ఉండగా.. వెనుకబడిన తరగతులు 55 శాతంగా ఉన్నారు.
రిజర్వేషన్లు పొందాలన్న ఆశతో చాలా మంది వీరశైవ-లింగాయత్‌లు తమను తాము ఉప-శాఖలుగా నమోదు చేసుకున్నందున సంఖ్య తగ్గిందని లింగాయత్ వర్గాలు చెబుతున్నాయి. దీనిని పరిష్కరించడానికి ఒక ప్రైవేటుగా జనాభా గణనను ప్లాన్ చేస్తున్నారు. ఎంపిక చేసిన జిల్లాలో జనాభా లెక్కలతో మహాసభ ప్రారంభమవుతుందని లింగాయత్ నాయకుడు, కర్ణాటక మంత్రి ఈశ్వర ఖండ్రే అన్నారు.
ప్రభుత్వ సర్వే..
2013-18లో సిద్ధరామయ్య తొలిసారి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో.. హెచ్ కాంతరాజ్ కర్ణాటక రాష్ట్ర వెనుకబడిన తరగతుల కమిషన్ చైర్మన్‌గా ఉన్నప్పుడు, సామాజిక-ఆర్థిక విద్యా సర్వే నిర్వహించారు. గత ఎనిమిది సంవత్సరాలుగా మూడు వేర్వేరు ప్రభుత్వాలు రాష్ట్రాన్ని పాలించినా, నివేదికను మాత్రం అధికారికంగా విడుదల కాలేదు.
వివిధ వర్గాలు
కర్ణాటకలోని అన్ని జిల్లాల్లో దాదాపు 150 తాలూకాలలో కమిటీలు ఏర్పడ్డాయి. మహాసభ తాలూకా యూనిట్ల ద్వారా సర్వే నిర్వహిస్తుంది. వీరశైవ లింగాయత్ సమాజంలో దాదాపు 101 ఉప వర్గాలు ఉన్నాయి. వీటిని రిజర్వేషన్ జాబితాలో వివిధ వర్గాల కింద వర్గీకరించారు. ఈ ఉప వర్గాలలో సగానికి పైగా విద్య, ఉపాధి, ఇతర రంగాలలో ప్రభుత్వ ప్రయోజనాలను పొందడానికి కేటగిరీ-1, 2A కిందకు వస్తాయి.
వీటిల్లో చాలా వరకు ప్రభుత్వ రికార్డులలో వీరశైవ లేదా లింగాయత్‌లుగా అధికారికంగా నమోదు కానందున, ఆ సామాజిక వర్గ జనాభాను ఎంత అన్నది తేల్చడం సవాలుగా మారింది.
రిజర్వేషన్ ఆందోళనలు..
ప్రముఖ ఉపవర్గాలైన జంగములు, ఆరాధ్యులు, పంచమసాలీలు, ఆది బణజిగ, బాణజిగ, కుడు వొక్కలిగ, నొళంబ, గణిగ, సాదర, శీలవంత వంటి వారు ప్రభుత్వ రికార్డుల్లో అధికారికంగా వీరశైవ లింగాయత్‌లుగా గుర్తింపు పొందారు.రిజర్వేషన్ ప్రయోజనాలను కోల్పోతామన్న భయంతో 70 శాతం కంటే ఎక్కువ ఉప వర్గాలు వీరశైవ లింగాయత్‌లుగా నమోదు చేసుకోవడానికి దూరంగా ఉన్నాయని లింగాయత్ అయిన నాగరాజ్ పాటిల్ చెప్పారు.
రాష్ట్ర కుల వర్గీకరణలో వీరశైవ లింగాయత్ సమాజాన్ని 3B కింద వర్గీకరించారు. లింగాయత్‌లుగా నమోదు చేసుకోని అనేక ఉప-వర్గాలు వెనుకబడిన తరగతుల జాబితాలో కేటగిరీ 1 మరియు 2A కింద రిజర్వేషన్లు పొందాయి.
రిజర్వేషన్ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని వారు లింగాయత్‌లుగా గుర్తించినట్లయితే, వారిని కేటగిరీ-3Bలో ఉంచుతారు, దీనివల్ల వారు సమాజంలోని సామాజికంగా ఆధిపత్య సమూహాలతో ప్రయోజనాల కోసం పోటీ పడవలసి వస్తుంది. ఇది చిన్న ఉప వర్గాలలో ఆందోళనకు దారితీసిందని పాటిల్ చెప్పారు.
అగస, బోవి, క్షౌరిక, మదర, చమ్మర మరియు కొరమలు వంటి అనేక వీరశైవ లింగాయత్ ఉప-వర్గాలు రిజర్వేషన్ జాబితాలో లింగాయత్ ఉప-వర్గాలుగా కాకుండా షెడ్యూల్డ్ కులాలు లేదా వెనుకబడిన తరగతుల కింద వర్గీకరించబడ్డాయి.
ఫలితంగా, ప్రభుత్వం నిర్వహించిన కుల సర్వేలో, అగ్రవర్ణ వీరశైవ లింగాయతులను మాత్రమే లింగాయతులుగా గుర్తించారు. ఇతర ఉపవర్గాలు లింగాయత్ లేబుల్‌ను ఉపయోగించలేదు. మహాసభ కుల సర్వేలో ఉపవర్గాలు పాల్గొంటాయో లేదో అనిశ్చితంగా ఉందని ఉత్తర కర్ణాటక సంఘాల సమాఖ్య ప్రధాన కార్యదర్శి శంకర్ పగోజీ అన్నారు.
ఒత్తిడి తెస్తారా?
ప్రభుత్వ కుల సర్వే తమ సంఖ్యను తక్కువ చేసి చూయిస్తోందని, ఫలితంగా విద్య, ఉపాధి, రాజకీయ రంగాల్లో తమ సామాజిక వర్గానికి అన్యాయం జరుగుతుందని అఖిల భారత వీరశైవ లింగాయత్ మహాసభ వాదిస్తోంది. మహాసభ తన సర్వే ఫలితాలను విడుదల చేసి, వాటిని ఆమోదించమని ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని యోచిస్తోంది. ఒకే సమాజం నిర్వహించే కుల సర్వేకు ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో వేచి చూడాల్సి ఉంది.