జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో విష్ణు ఎందుకు నామినేషన్ వేశాడు ?
అభ్యర్ధి నామినేషన్ తిరస్కరణకు గురైనా పార్టీ తరపున పోటీలో ఎవరో ఒకరుండాలనే ఈ జాగ్రత్తలు తీసుకుంటారు.
జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉపఎన్నికకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీలో ఒక ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్ జరిగింది. అదేమిటంటే ఖైరతాబాద్ మాజీ ఎంఎల్ఏ పి. విష్ణువర్ధనరెడ్డి శనివారం నామినేషన్ దాఖలుచేశాడు. జూబ్లీహిల్స్ ఉపఎన్నిక(Jubilee Hills by poll)లో విష్ణు పోటీచేయాలని గట్టిగానే ప్రయత్నాలుచేసుకున్నాడు. అయితే బీఆర్ఎస్(BRS) అధినేత కేసీఆర్(KCR) అంగీకరించలేదు. కారణం ఏమిటంటే దివంగత ఎంఎల్ఏ మాగంటి గోపీనాధ్(Maganti Gopinath) భార్య మాగంటి సునీతను పోటీచేయిస్తే గెలుపు గ్యారెంటీ అని భావించారు. గోపీ మరణం తాలూకు సానుభూతి ఓట్లు+కాంగ్రెస్ వ్యతిరేక ఓట్లు కలిసొచ్చి సునీత(Maganti Sunitha) ఈజీగా గెలుస్తుందని కేసీఆర్ అనుకుంటున్నారు.
ఎందుకైనా మంచిదని సునీతతో పాటు చివరినిముషంలో మాజీమంత్రి సబితారెడ్డి, ఎంఎల్ఏలు సుధీర్ రెడ్డి, కేపీ వివేకానందతో కూడా నామినేషన్లు వేయించారు. ఏకారణంగా అయినా సునీత నామినేషన్ తిరస్కరణకు గురైతే అప్పుడు పార్టీ తరపున సబిత, సుధీర్ లేదా కేపీ ఎవరో ఒకళ్ళు పోటీలో ఉండాల్సుంటుంది. నిజానికి వీళ్ళముగ్గరూ కూడా ఇపుడు ఎంఎల్ఏలుగానే ఉన్నారు కాబట్టి జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో పోటీచేయటంలో అర్ధంలేదు. మామూలుగా ఏపార్టీకూడా అభ్యర్ధితో పాటు అదనంగా ఎంఎల్ఏలు, ఎంపీలు, ఎంఎల్సీలతో నామినేషన్లు వేయించరు. ఎందుకంటే ఏ కారణంగా అభ్యర్ధి నామినేషన్ తిరస్కరణకు గురైనా పార్టీ తరపున పోటీలో ఎవరో ఒకరుండాలనే ఈ జాగ్రత్తలు తీసుకుంటారు. అయితే అభ్యర్ధితో పాటు నామినేషన్లు వేసేవారిలో ఎక్కువమంది అభ్యర్ధి కుటుంబసభ్యులే ఉంటారు. లేకపోతే సీనియర్ నేతల్లో ఎవరో ఒకరితో ముందుజాగ్రత్తగా అదనపు నామినేషన్ వేయిచంటం చాలాసహజం.
అందుకనే చివరినిముషంలో విష్ణుతో బీఆర్ఎస్ అధినేత నామినేషన్ వేయించుంటారు. సునీత నామినేషన్ చెల్లకపోయినా ఇప్పటికే నామినేషన్లు వేసిన ఎంఎల్ఏలు సబిత, సుదీర్, కేపీలు రంగంలో నుండి తప్పుకుని విష్ణు పోటీలో ఉంటాడు. అప్పుడు పార్టీ తరపున అభ్యర్ధి పోటీలో ఉన్నట్లవుతుంది. అలాకాకుండా ఎంఎల్ఏలతో నామినేషన్లు వేయిస్తే ఇబ్బందులు తప్పవని అధినేతకు చివరినిముషంలో ఆలోచన వచ్చుంటుంది. అందుకనే అప్పటికప్పుడు విష్ణుతో కూడా నామినేషన్ వేయించింది.
జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉపఎన్నికలో శనివారం నాటికి ఉపఎన్నికలో నామినేషన్లు దాఖలుచేసిన అభ్యర్ధుల సంఖ్య 96కి చేరింది. ఈనెల 21వ తేదీ నామినేషన్ల దాఖలుకు ఆఖరుతేది. ఇపుడు జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో 96మంది నామినేషన్లు దాఖలుచేయగా మరో 20 మంది నామినేషన్లు వేయటానికి రెడీగా ఉన్నారు. నామినేషన్లు వేయటానికి వచ్చిన 20మందికి అధికారులు టోకెన్లు ఇచ్చి 21వ తేదీన వచ్చి నామినేషన్లు దాఖలుచేయాలని రిక్వెస్టుచేశారు. కారణం ఏమిటంటే నామినేషన్లు తీసుకునేందుకు శనివారం సాయంత్రం సమయం అయిపోయింది. కాబట్టి పైన చెప్పిన 20 మంది 21వ తేదీన నామినేషన్లు వేయటం ఖాయం. అప్పటికి నామినేషన్లు దాఖలుచేయబోయే వారిసంఖ్య 114కు చేరుకుంటుంది. చివరిరోజు కాబట్టి పైనచెప్పిన 20 మంది కాకుండా ఇంకా ఎంతమంది వస్తారో తెలీదు. ఇవన్నీ నామినేషన్లు దాఖలుచేసిన, చేయబోయే వారిసంఖ్య మాత్రమే. నామినేషన్ల తేదీ తర్వాత పరిశీలనలో అధికారులు ఎంతమంది నామినేషన్లను తిరస్కరిస్తారో తెలీదు. అలాగే ఉపసంహరణల్లో ఎంతమంది నామినేషన్లను వాపసు తీసుకుంటారో చూడాలి.
ఏది ఎలాచూసుకున్నా పోటీలో వందమందికి పైగానే ఉండే అవకాశాలైతే కనబడుతున్నాయి. బీజేపీ అభ్యర్ధి లంకల దీపక్ రెడ్డి తరపున ఆయన భార్య ఒక నామినేషన్ వేశారు. గ్రూప్-1 నిరుద్యోగ జేఏసీ నుంచి అస్మాబేగం నామినేషన్ వేశారు. ఆర్ఆర్ఆర్ భూనిర్వాసిత బాధితుల్లో ముగ్గురు రైతులు, మాల జేఏసీ నుండి 30 మంది నామినేషన్లు వేశారు. తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ తరపున కొంతమంది నామినేషన్లు వేయటానికి రెడీ అవుతున్నారు. వీరంతా చివరిరోజైన 21వ తేదీ నామినేషన్లు దాఖలుచేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.