కప్పట్రాళ్లలో ‘యురేనియం’ చిచ్చు..
కప్పట్రాళ్ల.. మొన్నటి వరకూ ఫ్యాక్షన్ విలేజీగా పేరున్న కర్నూలు జిల్లాలోని ఈ గ్రామ ప్రజలు ఒక్కసారిగా ఆందోళన బాట పట్టారు. అసలు వారి భయాందోళనకు కారణమేంటి?
కప్పట్రాళ్ల.. మొన్నటి వరకూ ఫ్యాక్షన్ విలేజీగా పేరున్న కర్నూలు జిల్లాలోని ఈ గ్రామ ప్రజలు ఒక్కసారిగా ఆందోళన బాట పట్టారు. యురేనియం మైనింగ్ వార్తలతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు హడలెత్తిపోతున్నారు.
రేడియో ధార్మిక మూలకమైన ‘యురేనియం’ uraniumమైనింగ్ జరిపితే తమ పొలాలు నిర్జీవమవుతాయని, ఆరోగ్యం దెబ్బతింటుందని, పీల్చేగాలి, తాగేనీరు, తినే తిండి కలుషితమై జీవితాలు నాశనమవుతాయని భయాందోళన చెందుతున్నారు.
నిక్షేపాలను బయటపెట్టిన ఏఎండీ..
అటామిక్ మినరల్స్ డైరెక్టరేట్ (ఏఎండీ) కేంద్ర ప్రభుత్వ సంస్థ. ఇది దేశంలోని అణు, రేడియో ధార్మిక ఖనిజ నిక్షేపాలను అన్వేషించి, పరిశోధనలు జరిపి మైనింగ్ చేపడుతుంది. అందులో భాగంగానే ఏపీలోని నాలుగు జిల్లాల్లో (కడప, అన్నమయ్య, కర్నూలు, పల్నాడు) యురేనియం నిక్షేపాలు ఉన్నట్లు గుర్తించింది. ఏపీ, తెలంగాణ సహా 11 రాష్ట్రాల్లో సుమారు 4.10 లక్షల టన్నుల యురేనియం నిల్వలు ఉన్నట్లు ఏఎండీ అన్వేషణలో బయటపడింది.
ఏపీలో ఎక్కడెక్కడున్నాయి?
కడప జిల్లాలోని నల్లగొండవారిపల్లె, అంబకాపల్లె, బక్కన్నగారిపల్లె, శివారంపురం, పించ, కుమరంపల్లె, నాగాయపల్లెలో, పల్నాడు జిల్లాలో సారంగపల్లె, మదినపాడు, తంగెడ గ్రామాల్లో, కర్నూలు జిల్లాలో బొమ్మరాజుపల్లె, మినకహల్‌పాడు, కప్పట్రాళ్లలో, అన్నమయ్య జిల్లాలో కాటమయకుంట, వరికుంటపల్లెల్లో యూరేనియం నిక్షేపాలు ఉన్నట్లు ఏఎండీ అధికారులు గుర్తించారు.
తవ్వకాలకు రెండోసారి అనుమతి..
ఆదోని రేంజ్ పత్తికొండ సెక్షన్ పరిధిలోని కప్పట్రాళ్ల రిజర్వు ఫారెస్ట్ పరిధిలో 468.25 హెక్టార్లలో అటవీ భూములు ఉన్నాయి. ఇక్కడ యురేనియం నిల్వలు ఉన్నాయని ఏఎండీ కేంద్రానికి నివేదిక పంపింది. దీంతో 6.8 హెక్టార్ల విస్తీర్ణంలో తవ్వకాలకు 2017లో కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్‌లోని అటామిక్ మినరల్స్ డైరెక్టరేట్ రీజినల్ ఆఫీసుకు రెండు దఫాలుగా అనుమతులిచ్చింది. అప్పట్లో 20 బోర్లు వేశారు. మట్టి నమూనాలూ సేకరించారు. అనంతరం ఎక్కడా యురేనియం ప్రస్తావనలేదు. ఆ తర్వాత విజయవాడలోని కేంద్ర అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వశాఖ ఉప కార్యాలయం మరోసారి 50 మీటర్ల వరకూ 68 బోర్లు తవ్వేందుకు 2023 జూన్ 26న అనుమతులిచ్చింది.
పెల్లుబికిన ఆగ్రహం..
యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా కప్పట్రాళ్లతో పాటు దేవనకొండ మండలంలోని పి. కోటకొండ, జిల్లేడు, గుండ్లకొండ, దుప్పనగుర్తి, బంటుపల్లి, ఈదులదేవరబండ, నెల్లిబండ, మాదాపురం, నేలతలమరి, చెల్లెల చెలిమల, బేతపల్లితో పాటు పలు గ్రామాల ప్రజలు ఏకమయ్యారు. మైనింగ్ జరపరాదంటూ గత 10 రోజులుగా ఆందోళన చేస్తున్నారు. కర్నూలు కలెక్టరేట్ ముందు ధర్నా చేపట్టారు.తవ్వకాలు జరిపితే ఆత్మహత్యలకు తెగిస్తామని తేల్చిచెబుతున్నారు.
ఇటు కప్పట్రాళ్ల గ్రామ స్టేజీ కర్నూలు-బళ్లారి రహదారిపై సుమారు నాలుగు వేల మంది మూడు గంటల పాటు రోడ్డుపై బైఠాయించారు. కొందరు మహిళలు పురుగు మందు డబ్బాలు, పెట్రోలు సీసాలతో నిరసన తెలిపారు. పత్తికొండ ఆర్డీవో భరత్ నాయక్ కప్పట్రాళ్ల చేరుకుని, సమస్యపై ఉన్నతాధికారులతో మాట్లాడతామని హామీ ఇవ్వడంతో రాస్తారోకో విరమించారు. కప్పట్రాళ్లతో పాటు కర్నూలు కలెక్టరేట్ ముందు ధర్నా చేశారు. ఆందోళన నేపథ్యంలో.. తవ్వకాలపై ప్రజలకు సరైన అవగాహన కల్పించిన తర్వాతే పనులు చేయాలని, అంతవరకూ తవ్వకాలు జరపొద్దని కలెక్టర్ రంజిత్ బాషా ఏఎండీని ఆదేశించారు.
పంటలకూ దెబ్బ..
చీని, మిర్చి, పత్తితో పాటు వ్యవసాయ, ఉద్యాన పంటలను ఈ ప్రాంత రైతులు సాగుచేస్తారు. యురేనియం తవ్వకాలు జరిపితే పంటలు పండక ఉపాధి కోసం గ్రామాలను వీడాల్సి వస్తుందని ఆందోళన చెందుతున్నారు.
అవసరమైతే కోర్టుకెళ్తాం..
‘కప్పట్రాళ్లతో పాటు చుట్టుపక్కల 15 గ్రామాలు ఉన్నాయి. దాదాపు 35వేల జనాభా ఉంటుంది. జిల్లా, రాష్ట్ర స్థాయి నాయకులు, అధికారులను కలిసి తవ్వకాలు జరపకూడదని కోరుతున్నాం. శాంతియుతంగానే మా పోరాటం జరుగుతుంది. అవసరమైతే కోర్టు మెట్లెక్కడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. ఛలో ఢిల్లీ కార్యక్రమం చేపట్టి కేంద్ర ప్రభుత్వ పెద్దలను కలిసే యోచన కూడా ఉంది.’’ అని కప్పట్రాళ్ల సర్పంచ్ చెన్నమనాయుడు పేర్కొన్నారు.
‘స్పష్టమైన ప్రకటన చేయాలి’
‘‘గ్రామస్థుల్లో గూడుకట్టుకున్న భయాన్ని పొగొట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలి. గతంలో పులివెందుల, ఆళ్లగడ్డలో యురేనియం తవ్వకాలను అడ్డుకునేందుకు ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ నాయకులతో కలిసి ఆందోళన చేశాం. ప్రస్తుతం అధికారంలో ఉన్న టీడీపీ ఈ విషయంలో నోరువిప్పాలి. ’’ అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ డిమాండ్ చేశారు.
అనుమతులపై మాటల యుద్ధం..
యూరేనియం తవ్వకాలకు అనుమతులు ఇవ్వడంపై టీడీపీ, వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. 2017లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తొలుత అనుమతులు ఇచ్చారని ఆలూరు వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షి ఆరోపించారు. అయితే వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో 2023లో అనుమతులు ఇచ్చారని మంత్రి రామానాయుడు చెప్పారు.
కప్పట్రాళ్లలో నిజనిర్ధారణ కమిటీ పర్యటన..
యురేనియం తవ్వకాలపై అసత్య ప్రచారాలు నమ్మవద్దని తెలుగుదేశం నిజనిర్ధారణ కమిటీ సభ్యులు గ్రామస్థులను కోరారు. కమిటీ సభ్యులు టీడీపీ జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి, కోడుమూరు, పత్తికొండ ఎమ్మెల్యేలు దస్తగిరి, శ్యామ్ బాబు కప్పట్రాళ్లలో ఇటీవల పర్యటించి గ్రామస్థులకు ధైర్యం చెప్పారు. విషయాన్ని సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లి తవ్వకాలను ఆపేయిస్తామని హామీ ఇచ్చారు.
‘యురేనియం తవ్వకాలు జరపడం లేదు’
జిల్లాలో యురేనియం తవ్వకాలు జరుపుతున్నారన్న ప్రచారంపై పోలీసులు స్పందించారు. కప్పట్రాళ్ల రిజర్వ్ ఫారెస్ట్‌లో ఏ తవ్వకాలు జరగడం లేదని, వదంతులు, అసత్య ప్రచారాలను ప్రజలు నమ్మవద్దని కర్నూలు జిల్లా ఎస్పీ బిందు మాధవ్ ప్రజలకు సూచించారు. ప్రజలు భయాందోళన చెందవద్దని, సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేసే వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటాం హెచ్చరించారు.
గతంలోనూ వ్యతిరేకత..
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ, మహానంది, రుద్రవరం మండలాల్లోని అడవుల్లో యురేనియం అన్వేషణ కోసం 2019లో బోర్లు వేయబోతే అప్పట్లో స్థానికులు అడ్డుకున్నారు. మాజీ మంత్రి అఖిలప్రియ ఆధ్వరంలో ఓబులంపల్లెలో అఖిలపక్ష పార్టీల సమావేశాలుపెట్టి తీవ్రంగా వ్యతిరేకించారు. తెలంగాణ రాష్ట్రం అమ్రాబాద్ మండలం పరిధిలోని నల్లమలలో యురేనియం తవ్వకాలకు శ్రీకారం చుడితే పెద్దఎత్తున ప్రజాగ్రహం పెల్లుబుకింది.
అసలు యురేనియంతో అవసరమేంటి?
'యురేనియం' ఓ రేడియో ధార్మిక పదార్థం. అణు విద్యుత్ ఉత్పత్తిలో, అణ్వాయుధాల తయారీలో దీన్ని వాడతారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న రేడియో ధార్మిక పదార్థాల్లోకెల్లా యురేనియం వాడకం ఎక్కువ. బొగ్గు, నీరు, గాలి, సూర్యుడి నుంచి కరెంటు తీసినట్టే అణు పదార్థాల నుంచి కూడా కరెంటు తయారు చేస్తారు. అణు ధార్మిక పదార్థాల నుంచి మిగిలిన వాటి కంటే ఎక్కువ మొత్తంలో కరెంటు వస్తుంది. యురేనియం శక్తిమంతమైన ఖనిజం. ఒక కేజీ యురేనియం సుమారు 1500 టన్నుల బొగ్గుతో సమానం.
పెరుగుతున్న అవసరాలకు అనుగుణంగా విద్యుత్ ఉత్పత్తిని పెంచాల్సి ఉంటుంది. ఆ లక్ష్యం చేరుకోవాలంటే చాలా యురేనియం కావాలి. ఇప్పుడు కెనడాతోపాటు పలు దేశాల నుంచి భారత్ యురేనియం దిగుమతి చేసుకుంటోంది. దిగుమతులపై ఆధారపడకుండా మన దేశంలో ఉన్న యూరేనియం నిక్షేపాలపై కేంద్రం దృష్టి సారించింది.
యురేనియం తవ్వకాల వల్ల నష్టాలేంటి?
యురేనియం కోసం మైనింగ్ జరపాలంటే భూమిపై పొరలను భారీ యంత్రాలతో తవ్వాల్సి ఉంటుంది. మధ్యలో ఎదురయ్యే రాళ్లు, శిలలను పగలగొట్టేందుకు పెద్ద పెద్ద బాంబులు పెట్టి పేల్చాల్సి ఉంటుంది. ఫలితంగా పెద్ద సంఖ్యలో రేడియేషన్ విడుదలవుతుంది. చుట్టుపక్కల భూగర్భ జలాలు కూడా కలుషితమవుతాయి. యురేనియంను సేకరించిన తర్వాత దాన్ని అత్యంత జాగ్రత్తగా విద్యుత్ ప్లాంట్లకు తరలించాల్సి ఉంటుంది. లేదంటే గాలిలో కలిసే విషపూరిత అణువులు పర్యావరణాన్ని దెబ్బతీస్తాయి.
భూమి నుంచి సేకరించిన యురేనియంను ప్రాసెస్ చేసిన తర్వాత వ్యర్థాలను డంప్ చేసే ప్రక్రియ చాలా కీలకం. డంపింగ్ సరిగా చెయ్యకపోతే కాన్సర్ బారినపడే ప్రమాదం ఉంటుంది. యురేనియం డంపింగ్ సమయంలో రాడన్ (radon) వంటి ప్రత్యేక వాయువులు గాలిలో కలిసిపోతాయి. ఇవి కూడా మానవాళికీ, జీవజాలానికీ ప్రమాదకరమైనవే. యురేనియం తవ్వకాల్లో ఆర్సెనిక్ అనే ప్రమాదకర లోహం భూగర్భ జలాల్లో కలిసిందంటే చాలా ప్రమాదకరం. ఆ లోహం కలిసిన నీరు తాగితే మనుషులైనా, జంతువులైనా క్షణాల్లో చనిపోతారు. అందుకే యురేనియం తవ్వకాల్ని మేధావులు వ్యతిరేకిస్తున్నా.. కేంద్ర ప్రభుత్వం మాత్రం వెనక్కు తగ్గడం లేదు.