ప్రొఫెసర్‌పై జీవితకాల నిషేధం..
వివాదస్పద ప్రశ్నపై ABVP నుంచి తీవ్ర నిరసన.. జీవితకాల నిషేధం విధించిన యూపీలోని చౌదరి చరణ్ సింగ్ యూనివర్సిటీ అధికారులు..;
వివాదాస్పద ప్రశ్నపత్రం రూపొందించారన్న కారణంతో ఓ ప్రొఫెసర్(Professor)పై యూనివర్సిటీ అధికారులు జీవితకాల నిషేధం విధించారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్(Uttar Pradesh)లో జరిగింది.
ఇంతకు ఏం జరిగిందంటే..
ఏప్రిల్ 2న జరిగిన రెండో సెమిస్టర్ పొలిటికల్ సైన్స్ క్వశ్చన్ పేపర్‌లో..మత, కుల ఆధారిత రాజకీయాలకు RSSతో సంబంధంపై అడిగిన ఒక ప్రశ్న వివాదానికి కారణమైంది. దీంతో చౌదరి చరణ్ సింగ్ యూనివర్సిటీ అధికారులు మీరట్ కాలేజీకి చెందిన పొలిటికల్ సైన్స్ విభాగాధిపతి సీమా పన్వార్‌పై చర్య తీసుకున్నారు. పరీక్షలు, మూల్యాంకన విధుల నుంచి ఆమెను తప్పించారు. తర్వాత రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) విద్యార్థి విభాగం అనుబంధ విభాగం అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ABVP) నాయకులు తీవ్ర నిరసన వ్యక్తం చేసి రిజిస్ట్రార్‌కు మెమోరాండం అందజేశారు. ఆ తర్వాత కొన్ని గంటలకే పన్వర్‌పై "జీవితకాల నిషేధం" విధిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.
‘నాకు ఏ దురుద్దేశం లేదు..’
ఘటనపై యూనివర్సిటీ రిజిస్ట్రార్ ధీరేంద్ర కుమార్ వర్మ అంతర్గత విచారణ చేపట్టారు. వివాదాస్పద ప్రశ్నపత్రాన్ని రూపొందించింది సీమా పన్వారేనని, ఆమెపై జీవితకాలం పాటు యూనివర్సిటీ పరీక్షలు, మూల్యాంకన విధుల నుంచి దూరంగా ఉంచామని చెప్పారు. అయితే ఇది ఉద్దేశపూర్వకంగా చేసింది కాదని, తనకు ఎవరినీ కించపరచాలన్న దురుద్దేశం లేదని పన్వర్ లిఖితపూర్వకంగా క్షమాపణలు కోరారు సీమా.