ఉపరాష్ట్రపతి పదవికి సీపీ రాధాకృష్ణన్ నామినేషన్ దాఖలు..

వెంట వెళ్లిన ప్రధాని మోదీ, రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, సీనియర్ మంత్రులు..;

Update: 2025-08-20 07:43 GMT
Click the Play button to listen to article

ఎన్డీఏ(NDA) ఉపరాష్ట్రపతి అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్(CP Radhakrishnan) బుధవారం (ఆగస్టు 20) నామినేషన్ దాఖలు చేశారు. రాజ్యసభ సెక్రటరీ జనరల్ ప్రమోద్ చంద్ర మోదీకి నామినేషన్ పత్రాలు అందజేశారు. రాధాకృష్ణన్ వెంట ప్రధాని మోదీ(PM Modi), రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, ఎం తంబిదురై, చిరాగ్ పాస్వాన్, రాజీవ్ రంజన్ సింగ్ లాలన్, ఇతర సీనియర్ నాయకులు, మంత్రులు ఉన్నారు. ఇక ఉపరాష్ట్రపతి ఎన్నిక సెప్టెంబర్ 9న జరుగుతుంది. నామినేషన్ దాఖలుకు చివరి తేదీ ఆగస్టు 21. గత నెలలో ప్రస్తుత ఉపరాష్ట్రపతి జగదీప్ ధంఖర్ రాజీనామా చేయడంతో ఈ ఎన్నిక అనివార్యమైంది.

ప్రధాని మోదీ, ఎన్డీయే నేతల సమక్షంలో రాధాకృష్ణన్ నామినేషన్‌ను నాలుగు సెట్‌లలో దాఖలు చేశారు. ఒక్కొక్క సెట్‌లో 20 మంది ప్రతిపాదకులు, 20 మంది మద్దతుదారులు సంతకాలు చేశారు. మొదటి సెట్‌లో ప్రధాన ప్రతిపాదకుడిగా ప్రధాని మోదీ సంతకం చేశారు. మిగిలిన సెట్‌లలో కేంద్ర మంత్రులు, సీనియర్ NDA నాయకుల సంతకాలు ఉన్నాయి.


రాధాకృష్ణన్ గురించి..

తమిళనాడు(Tamil Nadu)లోని తిరుప్పూర్‌లో మే 4, 1957న జన్మించిన చంద్రపురం పొన్నుసామి రాధాకృష్ణన్ (CP Radhakrishnan) B.B.A ( బ్యాచ్‌లర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్) పూర్తి చేశారు. ఆర్‌ఎస్‌ఎస్ స్వయంసేవక్‌గా జీవితాన్ని ప్రారంభించి.. 1974లో భారతీయ జనసంఘ్ రాష్ట్ర కార్యనిర్వాహక కమిటీలో సభ్యుడయ్యారు. నాలుగు దశాబ్దాలకు పైగా రాజకీయానుభవం ఉన్న రాధాకృష్ణన్‌కు తమిళనాడు రాజకీయ, ప్రజా జీవితంలో మంచి పేరుంది.


కాషాయ దళంలో కార్యదర్శిగా..

రాధాకృష్ణన్ తమిళనాడులో 1996లో బీజేపీ(BJP) కార్యదర్శిగా నియమితులయ్యారు. 1998లో కోయంబత్తూరు నుంచి తొలిసారి లోక్‌సభకు ఎన్నికయ్యారు. 1999లో తిరిగి లోక్‌సభకు ఎన్నికై పదవీ కాలంలో టెక్స్టైల్స్ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఛైర్మన్‌గా పనిచేశారు. ప్రభుత్వ రంగ సంస్థల (పీఎస్‌యు) పార్లమెంటరీ కమిటీ, ఆర్థిక సంప్రదింపుల కమిటీలో కూడా సభ్యుడిగా కొనసాగారు. స్టాక్ ఎక్స్ఛేంజ్ కుంభకోణంపై దర్యాప్తు చేస్తున్న పార్లమెంటరీ ప్రత్యేక కమిటీలో సభ్యుడిగా కూడా ఉన్నారు.

2004లో రాధాకృష్ణన్ పార్లమెంటరీ ప్రతినిధి బృందంలో భాగంగా UN జనరల్ అసెంబ్లీలో ప్రసంగించారు. తైవాన్‌కు వెళ్లిన మొదటి పార్లమెంటరీ ప్రతినిధి బృందంలో సభ్యుడు కూడా.

2004-2007 మధ్య రాధాకృష్ణన్ తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు. ఆ సమయంలో 93 రోజుల పాటు 19,000 కి.మీ. 'రథ యాత్ర' చేపట్టారు. దేశంలోని నదుల అనుసంధానం, ఉగ్రవాదాన్ని నిర్మూలించడం, యూనిఫాం సివిల్ కోడ్ అమలు చేయడం, అంటరానితనాన్ని నిర్మూలించడంపై ఆయన యాత్ర కొనసాగింది.

2016లో రాధాకృష్ణన్ కొచ్చిలోని కాయిర్ బోర్డు ఛైర్మన్‌గా నియమితులై ఆ పదవిలో నాలుగేళ్లు కొనసాగారు. ఆయన నాయకత్వంలో భారతదేశం నుంచి కాయిర్ ఎగుమతులు రూ. 2532 కోట్లకు చేరుకున్నాయి. 2020 నుంచి 2022 వరకు కేరళ బీజేపీకి అఖిల భారత ఇన్‌చార్జ్‌గా ఉన్నారు.


ప్రస్తుతం మహారాష్ట్ర గవర్నర్‌గా..

ప్రస్తుతం మహారాష్ట్ర (Maharashtra) గవర్నర్‌గా కొనసాగుతోన్న రాధాకృష్ణన్ 2024 జూలై 31న ఆ పదవికి ప్రమాణ స్వీకారం చేశారు. అంతకుముందు ఫిబ్రవరి 18 2023న జార్ఖండ్ గవర్నర్‌గా పనిచేశారు. దాదాపు ఒకటిన్నరేళ్లు ఆ పదవిలో ఉన్నారు. తన మొదటి నాలుగు నెలల్లోనే జార్ఖండ్‌లోని 24 జిల్లాలో ప్రయాణించి ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. భారత రాష్ట్రపతి ఆదేశాల మేరకు ఆయన తెలంగాణ గవర్నర్‌గా, పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్‌గా కూడా పనిచేశారు.

రాధాకృష్ణన్‌కు క్రీడలంటే ఆసక్తి. టేబుల్ టెన్నిస్‌లో కాలేజీ ఛాంపియన్. క్రికెట్, వాలీబాల్ ఇష్టమయిన ఆటలు. 

Tags:    

Similar News