‘‘ఉగ్రమూకలను వదిలిపెట్టం’’
పహల్గామ్ దాడి ఘటనపై ప్రధాని మోదీ సీరియస్..;
‘‘పహల్గామ్‌లో ఉగ్రదాడికి పాల్పడిన వారిని వదిలిపెట్టం. ప్రతి ఉగ్రవాదిని, వారికి మద్దతిస్తున్న వ్యక్తులను కఠినంగా శిక్షిస్తాం’’ అని ప్రధాని మోదీ (PM Narendra Modi) తీవ్రంగా హెచ్చరించారు. బీహార్‌లోని మధుబణి బహిరంగసభలో ఆయన మాట్లాడుతూ.. "ఈ దాడి కేవలం నిరాయుధ పర్యాటకులపై మాత్రమే కాదు. యావత్ భారతావనిపై జరిగిన దాడి." అని పేర్కొ్న్నారు. ఉగ్రవాది ఎక్కడ నక్కినా సరే వెతికి మరీ శిక్షిస్తామన్నారు. ఉగ్రవాదం దేశ స్ఫూర్తిని ఎప్పటికీ విచ్ఛిన్నం చేయలేదన్నారు. ప్రసంగానికి ముందు ప్రధాని ఒక నిమిషం మౌనం వహించి మృతులకు నివాళి అర్పించారు.
ఇదిలా ఉండగా.. జమ్మూ కశ్మీర్‌లో ఉగ్ర దాడిని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సిడబ్ల్యుసి) ఖండించింది. ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. "హిందువులను లక్ష్యంగా చేసుకుని మట్టుబెట్టడం దారుణమని ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే అన్నారు. దేశ భద్రతకు సంబంధించిన విషయాల్లో కేంద్రానికి తాము మద్దతు ఉంటుందని చెప్పారు. ఉగ్రవాదుల దుశ్చర్యను తాము తీవ్రంగా ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు.
ఏప్రిల్ 22న జమ్మూకశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లా పహల్గాం(Pahalgam)లోని ప్రముఖ పర్యాటక ప్రాంతం బైసరన్‌లో ముష్కరులు నరమేధానికి పాల్పడిన సంగతి తెలిసిందే. సైనిక దుస్తుల్లో వచ్చి పర్యాటకులను చుట్టుముట్టి అతి సమీపం నుంచి కాల్పులు జరిపారు. ఈ ఘటనలో 25 మంది పర్యాటకులు, ఓ కశ్మీరి యువకుడు ప్రాణాలు కోల్పోయారు.