ఢిల్లీ కొత్త సీఎం ఎవరు? ఆ జాబితాలో ఎవరెవరున్నారు?

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సంచలన ప్రకటన తర్వాత దేశం చూపంతా దేశరాజధానిపైకి మళ్లింది. కేజ్రీవాల్ స్థానంలో ఎవరు సీఎంగా వస్తారన్న దానిపై ఉత్కంఠ నెలకొంది.

Update: 2024-09-16 09:26 GMT

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సంచలన ప్రకటన తర్వాత దేశం చూపంతా దేశరాజధానిపైకి మళ్లింది. కేజ్రీవాల్ స్థానంలో ఎవరు సీఎంగా వస్తారన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీకి సంబంధించిన అవినీతి కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ శుక్రవారం తీహార్ జైలు నుంచి విడుదలైన విషయం తెలిసిందే. శనివారం ఆయన తన పదవికి రాజీనామా చేస్తు్న్నట్లు పార్టీ కార్యాలయంలో ప్రకటించారు. “నా నిర్దోషిత్వాన్ని జనంలో నిరూపించుకున్న తర్వాతే మళ్లీ సీఎం పీఠాన్ని అధిరోహిస్తా’’నని చెప్పారు. ఈ నేపథ్యంలో కేజ్రీవాల్ స్థానంలో కొత్త ముఖ్యమంత్రి ఎవరవుతారన్న పెద్ద ప్రశ్నగా తయారైంది.

కొత్త సీఎంపై ఇంకా చర్చ జరగలేదు..

కేజ్రీవాల్ మంగళవారం ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తారని, ఆ తర్వాత అతని స్థానానికి ఎంపిక ప్రక్రియ ప్రారంభమవుతుందని ఢిల్లీ మంత్రి సౌరభ్ భరద్వాజ్ చెబుతున్న మాట. ముఖ్యమంత్రి ఎవరనే దానిపై ఎటువంటి చర్చ జరగలేదని తెలిపారు. "ఈరోజు సెలవు. రేపు వారంలో మొదటి పనిదినం. రేపు లెఫ్టినెంట్ గవర్నర్‌కు కేజ్రీవాల్ తన రాజీనామాను అందజేస్తారు. రాజీనామా ఆమోదించిన తర్వాత పార్టీ ఎమ్మెల్యేల సమావేశం నిర్వహించి కొత్త ముఖ్యమంత్రి పేరును ప్రకటిస్తాం’’ అని విలేఖరులతో అన్నారు.

సిసోడియా, సునీతా కేజ్రీవాల్‌కు ఛాన్స్ ఉందా?

సిఎం పదవికి కేజ్రీవాల్ అత్యంత సన్నిహితుడు, మద్యం పాలసీ కేసులో సహ నిందితుడైన మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా పేరును కేజ్రీవాల్ స్వయంగా తోసిపుచ్చారు. సిసోడియా, తాను తమ నిర్ధోషిత్వాన్ని నిరూపించుకున్న తర్వాత మళ్లీ పదవులు చేపడతామని కేజ్రీవాల్ పార్టీ కార్యకర్తలకు, ప్రజలకు స్పష్టతనిచ్చారు.

ఇక లోక్‌సభ ఎన్నికల సమయంలో హర్యానా, ఢిల్లీ, గుజరాత్‌ లో పార్టీ తరపున ప్రచారం చేసిన కేజ్రీవాల్ భార్య, మాజీ బ్యూరోక్రాట్‌ సునీతా కేజ్రీవాల్‌‌కు సీఎం పదవి కట్టబెట్టవచ్చన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ మధ్య ఆమె తరచుగా ప్రెస్ కాన్ఫరెన్స్‌లకు హాజరుకావడం, తన భర్త కూర్చునే కుర్చీ నుంచి వీడియో ప్రసంగాలు ఇవ్వడం, కేజ్రీవాల్ సందేశాలను చదివి వినిపించడమే అందుకు కారణం. ఇండియా కూటమి చేపట్టిన ర్యాలీలలో సునీతా కేజ్రీవాలే ఎక్కువగా కనిపించడడంతో ఆమె అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. అయితే సునీతా కేజ్రీవాల్ ముందుగా ఎమ్మెల్యేగా ఎన్నిక కావాల్సి ఉంటుంది.

అతిషి..

కల్కాజీ నియోజకవర్గం నుంచి గెలుపొంది, మంత్రిగా ఉన్న అతిషి కూడా కొత్త సీఎం రేసులో ఉన్నారు. ఈమెకు కేజ్రీవాల్ వద్ద మంచి గుర్తింపు కూడా ఉంది. ఢిల్లీ ప్రభుత్వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసే బాధ్యతను అరవింద్ కేజ్రీవాల్ అతిషికి అప్పగించిన విషయం తెలిసిందే. దీన్ని బట్టి చూస్తే AAP నాయకత్వం ఆమెపై ఎంత నమ్మకంగా ఉందో అర్థమవుతుంది. 43 ఏళ్ల అతిషి ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయ పూర్వ విద్యార్థి. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) కేజ్రీవాల్‌ను అరెస్టు చేసిన తర్వాత ఆయన అరెస్టును ఖండిస్తూ నిత్యం జనం నోట ఉన్నది కూడా అతిషినే. ప్రస్తుతం క్యాబినెట్ మంత్రులందరిలో అత్యధికంగా 14 శాఖలకు ఇన్‌ఛార్జ్‌గా ఉన్న మంత్రి కూడా ఈమె. మంచివాక్చాతుర్యం, నాయకత్వ లక్షణాలు, పార్టీ వైఖరిని స్పష్టంగా చెప్పగల వ్యక్తి కావడంతో అతిషి సీఎం అయ్యే అవకాశాలున్నాయి.

గోపాల్ రాయ్..

సీఎం రేసులో గోపాల్ రాయ్ పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తోంది. శ్రామిక హక్కులు, విద్యార్థి క్రియాశీలత నేపథ్యం ఉన్న నేత. 49 ఏళ్ల రాయ్ ఢిల్లీ రాజకీయాల్లో కీలక వ్యక్తి. పార్టీలో అట్టడుగు స్థాయి నుంచి వచ్చిన విస్తృత రాజకీయ అనుభవం ఉన్న నాయకుడు. ప్రస్తుతం పర్యావరణం, అటవీ, సాధారణ పరిపాలన శాఖ మంత్రిగా ఉన్నారు. కార్మికవర్గాల సంఘాలు, నాయకులతో రాయ్‌కి సత్సంబంధాలున్నాయి. కాలుష్య నియంత్రణ నుంచి కార్మిక సంక్షేమం వరకు ఢిల్లీ సమస్యలను పరిష్కరించడంలో మంచి అనుభవం ఉన్న వ్యక్తి.

కైలాష్ గెహ్లాట్..

కైలాష్ గెహ్లాట్ పార్టీలోని సీనియర్ నేతల్లో ఒకరు. వృత్తిరీత్యా న్యాయవాది. రవాణా, ఆర్థిక, గృహ వ్యవహారాల శాఖలకు మంత్రిగా ఉన్నారు. 50 ఏళ్ల గెహ్లాట్ 2015 నుంచి ఢిల్లీలోని నజాఫ్‌గఢ్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఢిల్లీలో రవాణా మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి విశేష కృషి చేశారు. బస్సు సేవలను విస్తరింపజేశారు. ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టేలా చేశారు. రహదారి భద్రతకు అధిక ప్రాధాన్యం ఇచ్చారు. మంచి పాలనా సామర్థ్యం ఉన్న వ్యక్తిగా కైలాష్ గెహ్లాట్‌కు పేరుంది. గెహ్లాట్ ఢిల్లీ హైకోర్టు, సుప్రీంకోర్టు రెండింటిలోనూ ప్రాక్టీస్ చేసిన అనుభవం ఉంది. 2005, 2007 మధ్య హైకోర్టు బార్ అసోసియేషన్‌లో మెంబర్ ఎగ్జిక్యూటివ్‌గా కూడా ఉన్నారు.

సౌరభ్ భరద్వాజ్..

ఈయన మాజీ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్. గ్రేటర్ కైలాష్ నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన భరద్వాజ్ విజిలెన్స్, హెల్త్ శాఖలకు మంత్రిగా కొనసాగుతున్నారు. AAP జాతీయ అధికార ప్రతినిధి కూడా. కేంద్ర దర్యాప్తు సంస్థలు తమ పార్టీ అగ్రనేతలను అరెస్టు చేసినపుడు పార్టీ స్టాండ్‌ను స్పష్టంగా చెప్పిన వ్యక్తి కూడా. మద్యం కుంభకోణంలో సిసోడియా అరెస్ట్ కావడంతో ఆయన బాధ్యతలు భరద్వాజ్‌కు అప్పగించారు.

Tags:    

Similar News