'అమాదేర్ పరా, అమాదేర్ సమాధాన్' టీఎంసీని గెలిపిస్తుందా?

కొత్త పథకానికి రూ. 8వేల కోట్ల కేటాయించిన పశ్చిమ బెంగాల్ సీఎం మమతా..;

Update: 2025-07-24 14:32 GMT
Click the Play button to listen to article

పశ్చిమ బెంగాల్‌(West Bengal)లో ఎన్నికలు(Assembly Elections) దగ్గర పడుతుండడంతో టీఎంసీ(TMC) ప్రభుత్వం కొత్త సంక్షేమ పథకాన్ని అమలుకు శ్రీకారం చుడుతోంది. ఈ పథకానికి 'అమాదేర్ పరా, అమాదేర్ సమాధాన్' (మా ప్రాంతం, మా పరిష్కారం) అని నామకరణం చేశారు. ప్రభుత్వం-ప్రజల భాగస్వామ్యంతో ఈ పథకాన్ని ఆగస్టు 2న ప్రారంభించనున్నట్లు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ(Mamata Banerjee) బుధవారం (జూలై 23) ప్రకటించారు. ఈ పథకానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.8,000 కోట్లు కేటాయించింది. రాష్ట్రంలోని సుమారు 80 వేల పోలింగ్ కేంద్రాలకు ఒక్కొ దానికి రూ.10 లక్షలు కేటాయించింది. ఎన్నికల సంఘం (EC) తాజా సమాచారం ప్రకారం.. పశ్చిమ బెంగాల్‌లో దాదాపు 7.64 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. అంటే ఒక్కో పోలింగ్ కేంద్రానికి వెయ్యి కంటే తక్కువ మంది ఓటర్లు ఉన్నారు.

తాగునీటి వనరుల ఏర్పాటు, దెబ్బతిన్న రోడ్లకు మరమ్మతు చేయడం, ఐసీడీడిఎస్ (ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్‌మెంట్ సర్వీసెస్) కేంద్రాలు, ప్రాథమిక పాఠశాలల పైకప్పుల మరమ్మతు కోసం ఈ నిధులు వినియోగిస్తారు.


ప్రజా స్పందన శిబిరాలు..

ప్రభుత్వ అధికారులు మూడు పోలింగ్ కేంద్రాలను కలిపి ప్రజా స్పందన శిబిరాలను నిర్వహిస్తారు. ఫలితంగా పౌరుల అవసరాలు, సమస్యలను నేరుగా తెలుసుకుని పరిష్కరించే అవకాశం ఉంటుంది. ఈ కార్యక్రమం 60 రోజుల పాటు కొనసాగుతుంది. దుర్గా పూజ కారణంగా 15 రోజుల విరామం ఉంటుంది. నివాసితులు తమ సమస్యలను, సూచనలను ఆన్‌లైన్‌లో కూడా ఎంట్రీ చేయవచ్చు. ఈ పథకం అమలును పర్యవేక్షించేందుకు రాష్ట్ర, జిల్లా స్థాయిలో టాస్క్ ఫోర్స్‌లను ఏర్పాటు చేస్తారు. రాష్ట్ర స్థాయి టాస్క్ ఫోర్స్‌కు ప్రధాన కార్యదర్శి మనోజ్ పంత్ నాయకత్వం వహిస్తారు.

కాగా ఇలాంటి కార్యక్రమం నిర్వహించడం దేశంలోనే ఇదే తొలి అని టీఎంసీ చెప్పుకుంటోంది. అయితే లక్ష్యాలకు మించి ఈ కార్యక్రమం రాజకీయాలతో ముడిపడినట్టు కనిపిస్తోంది.

గత నాలుగు సంవత్సరాలుగా.. రాష్ట్ర ఆదాయంలో సుమారు 94 శాతం సంక్షేమ పథకాలకు కేటాయించారు. మౌలిక సదుపాయాలు, గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి వినియోగించారు. కేంద్రం తీసుకున్న నిర్ణయం తర్వాత నిధుల కొరతే అందుకు కారణం. పశ్చిమ బెంగాల్‌లోని చాలా గ్రామ పంచాయతీల్లో అభివృద్ధి కుంటుపడింది. ఈ సమస్యలు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీపై ప్రభావం చూపే అవకాశం ఉంది.

అప్పు భారం..

2024-25 సంవత్సరానికి సవరించిన బడ్జెట్ అంచనా ప్రకారం.. రాష్ట్రం రూ.7,06,531.61 కోట్ల అప్పు చేసింది. ఇది 2011లో ఇదే టీఎంసీ ప్రభుత్వం చేసిన దానికంటే దాదాపు నాలుగు రెట్లు ఎక్కువ. "టీఎంసీ రాజకీయాలు రాష్ట్ర ఖజానాను ఎంతగా హరించేశాయంటే.. ప్రభుత్వం ఉద్యోగులకు బకాయిపడ్డ కరువు భత్యాన్ని కూడా చెల్లించలేకపోయింది" అని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు అధిర్ రంజన్ చౌదరి పేర్కొన్నారు.

డీఏ కూడా చెల్లించలేని స్థితిలో..

జూన్ 27 నాటికి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు చెల్లించని డీఏ (కరువు భత్యం)లో కనీసం పావు వంతు (సుమారు రూ. 10,425 కోట్లు) చెల్లించాలని మే నెలలో సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. తీవ్రమైన ఆర్థిక సంక్షోభం మధ్య చెల్లింపునకు ఆరు నెలల పొడిగింపు ఇవ్వాలని కోరింది. రెండు ఉద్యోగ సంఘాలు రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో ధిక్కార పిటిషన్లు దాఖలు చేశాయి. కోర్టు వచ్చే నెలలో ఈ పిటిషన్లను విచారించే అవకాశం ఉంది. ఒకవేళ సుప్రీంకోర్టు ధిక్కార నోటీసు జారీ చేస్తే..ఎన్నికలకు ముందు అధికార టీఎంసీకి పెద్ద ఇబ్బందిగా మారుతుంది. అంతేకాకుండా డీఏ చెల్లించకపోవడం వల్ల రాష్ట్రంలోని దాదాపు 14 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు అధికార పార్టీకి వ్యతిరేకంగా మారే అవకాశం ఉంది.

అపఖ్యాతి పాలైన గత పథకాలు..

లక్ష్మీర్ భండార్, కృషక్ బంధు, స్వాస్థ్య సతి, సబూజ్ సతి, దువారే సర్కార్ లాంటి సంక్షేమ పథకాలు.. TMC 2011లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వరుసగా ఎన్నికల్లో విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించాయి. ఈ పథకాలపై చాలా విమర్శలు వచ్చాయి. "దువారే సర్కార్ (ఇంటి వద్ద ప్రభుత్వం) పథకం టీఎంసీ కార్యకర్తలకు బలవంతపు వసూళ్లకు ఎలా సాధనంగా మారిందో మనందరికీ తెలుసు. కొత్త పథకానికి కూడా అదే గతి పడే అవకాశం ఉంది" అని సీపీఐ(ఎం) నాయకుడు సుజన్ చక్రవర్తి అభిప్రాయపడ్డారు. 

Tags:    

Similar News