జుబీన్ గార్గ్ మరణంపై కుటుంబసభ్యుల డిమాండేమిటి?
పరారీలో ఉన్న నార్త్ ఈస్ట్ ఇండియా ఫెస్టివల్ నిర్వాహకుడు శ్యామ్‌కాను మహంత, జుబీన్ గార్గ్ మేనేజర్ సిద్ధార్థ్ శర్మపై ఇప్పటికే లుకౌట్ నోటీసులు జారీ..
అస్సాం(Assam)కు చెందిన ప్రముఖ గాయకుడు జుబీన్ గార్గ్(Zubeen Garg) సింగపూర్‌లో ఇటీవల మరణించిన విషయం తెలిసిందే. సింగపూర్‌లో జరిగిన నార్త్ ఈస్ట్ ఇండియా ఫెస్టివల్‌లో ప్రదర్శన ఇవ్వడానికి వెళ్లిన ఆయన సెప్టెంబర్ 19న సముద్రంలో ఈత కొడుతూ మృత్యువాతపడ్డారు.
అయితే జుబీన్ గార్గ్ మృతిపై సమగ్రంగా దర్యాప్తు చేయాలని ఆయన కుటుంబం సీఐడీకి లేఖ రాసింది. "అతని మరణంపై సమగ్ర దర్యాప్తు జరగాలని మేము కోరుకుంటున్నాము" అని గార్గ్ మామ మనోజ్ కుమార్ బోర్తాకూర్ వార్తాసంస్థ పీటీఐతో అన్నారు.
‘ఇప్పటికే సిట్ దర్యాప్తు..’
"గార్గ్ కుటుంబం నుంచి మాకు ఫిర్యాదు అందింది. దానిని పరిశీలిస్తున్నాము" అని ఒక సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. ఇప్పటికే ఈ కేసును ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) దర్యాప్తు చేస్తోందని పేర్కొన్నారు. ఆదివారం గౌహతిలోని కహిలిపారా ప్రాంతంలోని గార్గ్ నివాసాన్ని సిట్ బృందం సందర్శించిందని కూడా తెలిపారు.
‘‘గార్గ్ గురించి కొన్ని విషయాలు తెలుసుకోడానికి మా సిబ్బంది ఆయన కుటుంబసభ్యులను కలిశారు. వారి స్టేట్‌మెంట్‌లను రికార్డ్ చేశారు" అని ఆయన పేర్కొన్నారు.
లుక్ అవుట్ నోటీసు జారీ..
గార్గ్ కేసుకు సంబంధించి నార్త్ ఈస్ట్ ఇండియా ఫెస్టివల్ నిర్వాహకుడు శ్యామ్‌కాను మహంత, జుబీన్ గార్గ్ మేనేజర్ సిద్ధార్థ్ శర్మపై లుకౌట్ నోటీసులు జారీ చేసినట్లు అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ(CM Himanta Biswa Sarma) ఇటీవల తెలిపారు. మహంత బ్యాంకు ఖాతాలు, క్రెడిట్ కార్డులను సీజ్ చేయించామని కూడా చెప్పారు. వారిద్దరు ఎక్కడా ఉన్నా వెంటనే గౌహతిలో అక్టోబర్ 6న హాజరై తమ వాంగ్మూలం ఇవ్వాలని లేకపోతే పోలీసులు గాలించాల్సి ఉంటుందని హెచ్చరించారు. పోలీసుల ముందు హాజరుకాకపోవడానికి ఇబ్బందిగా ఉంటే.. కోర్టును ఆశ్రయించవచ్చు" అని కూడా చెప్పారు.