రేవంత్, ఇక కాస్కో!

చుక్కలు చూపించడానికి విపక్షం రెడీ అయినట్టు కనిపిస్తోంది. అసెంబ్లీ కొలువుదీరిన తొలినాడే విపక్షం శాంపిల్ చూపింది. డిసెంబర్ 9 వచ్చిందిగా అదేమైందని ప్రశ్నించింది.

By :  A.Amaraiah
Update: 2023-12-09 14:30 GMT
ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్‌ చేత ప్రతిజ్ఞ తీసుకోమన్న బిజెపి

తెలంగాణ అసెంబ్లీ కొలువుదీరింది. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు ప్రమాణం చేశారు. బీజేపీ బాయ్ కాట్ చేసింది. రజాకార్ల వారసత్వం ఉన్న అక్బరుద్దీన్ ఎదుట ప్రమాణం చేయబోమని భీష్మించింది. విపక్షం హాజరైనా ఊహించినట్టే కల్వకుంట్ల తారక రామారావు ముఖం చాటేశారు. బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఆస్పత్రిలో కోలుకుంటున్నారు. గన్ పార్క్ కళకళలాడింది. కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీలలో రెండు పట్టాలెక్కాయి. సోనియాగాంధీని తెలంగాణ దేవతగా కాంగ్రెస్ నేతలు అభివర్ణిస్తూ పుట్టిన రోజు వేడుకలు జరిపారు. ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్ తో గవర్నర్ తమిళసై ప్రమాణం చేయించడంతో మొదలైన రేవంత్ ప్రభుత్వం మూడో రోజు పాలన ఒకింత ఆసక్తికరంగానే సాగింది.

తొలిరోజే సవాల్ విసిరిన విపక్షం...


తెలంగాణ అసెంబ్లీ ప్రారంభమైన తొలిరోజే అధికార పక్షానికి ప్రతిపక్షం సవాల్ విసిరింది. పరిస్థితి చూస్తుంటే సీఎం రేవంత్ రెడ్డికి చుక్కలు చూపించాలనే విపక్షమైన బీఆర్ఎస్ నిర్ణయించుకున్నట్టు అర్థమవుతోంది. బహుశా ఈ పనిని ఈసారి విపక్షం హరీశ్ రావు, కల్వకుంట్ల తారక రామారావు నెత్తిన పెట్టినట్టు కనిపిస్తోంది. ఈ సవాళ్లను ఎదుర్కోవడానికి వంద రోజులు గడువు కావాలని రేవంత్ రెడ్డి కోరినప్పటికీ విపక్షం అంత గడువిచ్చే సూచనలు కన్పించడం లేదు. వీటిని ఎలా ఎదుర్కొంటారు, దీటుగా ఎలా స్పందిస్తారనేది మున్ముందు తేలనుంది.

ఆరు గ్యారంటీలు, వంద రోజులు...

‘‘ఇవాళ తెలంగాణ ప్రజలకు పండగ రోజు. 2009, డిసెంబర్ 9న తెలంగాణ ప్రక్రియ ప్రారంభమైంది. తెలంగాణ తల్లి అంటే సోనియమ్మ రూపం కనిపిస్తుంది. నాది తెలంగాణ అని చెప్పే అవకాశం మనకు సోనియమ్మ ఇచ్చారు. ఇక్కడి ప్రజల కోసమే సోనియమ్మ ఆరు గ్యారంటీలను ఇచ్చారు. ఇవాళ ఆరు గ్యారంటీల్లో రెండు గ్యారంటీలను అమలు చేసే బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది” ఇదీ రేవంత్ రెడ్డి చెప్పిన మాట. మహిళలకు కాంగ్రెస్ చేసిన బాస. ఇది అమల్లోకి తెస్తూ రేవంత్ చెప్పిన గంటకే విపక్షం దాడి మొదలైంది. అసెంబ్లీలోని బీఆర్ఎస్ శాసనసభా పక్ష కార్యాలయంలో మాట్లాడిన హరీశ్ రావు... ఇదే డిసెంబర్ 9న ఇస్తానన్న రైతుబంధు సాయం ఏమైందీ, రైతుల పక్షాన నేను అడుగుతున్నా అని అధికార కాంగ్రెస్ పార్టీని నిలదీశారు. దీన్నిబట్టి రాబోయే విమర్శల తుపాను అర్థమవుతుంది. రేవంత్ ఎలా కాస్కుంటారో మరి..

బయల్దేరిన మహాలక్ష్మీ...


ఎన్నికల వేళ ఇచ్చిన ఆరు గ్యారంటీలను 100 రోజుల్లో అమలు చేస్తామని సీఎం రేవంత్‌ రెడ్డి చెప్పారు. ఆరు గ్యారంటీల్లో ఒకటైన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యానికి నిర్దేశించిన మహాలక్ష్మి పథకానికి శ్రీకారం చుట్టారు. రెండో హామీ- ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.10 లక్షలకు పెంచే పథకాన్నీ సీఎం లాంఛనంగా ప్రారంభించారు. ఆరోగ్యశ్రీ లోగో, పోస్టర్‌లను ఆవిష్కరించారు. తెలంగాణ ప్రభుత్వం తరఫున బాక్సర్‌ నిఖత్‌ జరీన్‌కు రూ.2 కోట్ల చెక్కును ఇచ్చారు. ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం అయ్యాక అసెంబ్లీ ప్రాంగణంలోనే ఈ రెండు హామీలు పట్టాలెక్కాయి.

తమిళి సై ప్రసంగం ఆరోజే..

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 14కు వాయిదా పడ్డాయి. సభ మళ్లీ ప్రారంభమైన తొలిరోజున శాసన సభాపతిని ఎన్నుకుంటారు. ఆ మరుసటి రోజు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్‌ తమిళిసై ప్రసంగిస్తారు. తర్వాతి రోజు గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని ప్రవేశపెట్టి చర్చిస్తారు. ఎన్ని రోజులు సభ నిర్వహించాలనేది స్పీకర్‌ ఎన్నిక అనంతరం జరిగే బీఏసీలో నిర్ణయిస్తారు.

సందడి సందడిగా అసెంబ్లీ..

కాంగ్రెస్ కండువాలు, గులాబీ జెండాల మధ్య ఒక్కగానొక్క ఎర్రచొక్కా.. కాషాయ వస్త్రాలు కానరాలేదు. 2023 డిసెంబర్ 9న ఉదయం 11 గంటలకు అసెంబ్లీలో కనిపించిన దృశ్యాలివి. హైదరాబాద్ చాంద్రాయణగుట్ట ఎంఐఎం ఎమ్మెల్యే, ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్ స్పీకర్ సీట్లో కూర్చోగానే ముందుగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో ప్రమాణం చేయించారు. ఆ తర్వాత వరుసగా ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రమాణం చేశారు. మాజీ సీఎం కేసీఆర్‌ సర్జరీ దృష్ట్యా ప్రమాణ స్వీకారానికి కేటీఆర్ రాలేదు. ప్రమాణ స్వీకారానికి తనకు మరో రోజు సమయం ఇవ్వాలని శాసనసభ సెక్రటరీని ఆయన కోరారు.

మేమెందుకు రావడం లేదంటే...

శాసనసభ సమావేశాలకు బీజేపీ ఎమ్మెల్యేలు రాలేదు. సీనియర్‌ ఎమ్మెల్యేలను కాదని ప్రొటెం స్పీకర్‌గా అక్బరుద్దీన్‌ను చేశారని ఆరోపించారు. శాసనసభా వ్యవహారాలు తెలిసిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డే ఈ ఆరోపణ చేయడం గమనార్హం. ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్ సమక్షంలో బీజేపీ ఎమ్మెల్యేలు ఇవాళ ప్రమాణం చేయరని తెగేసి చెప్పారు. రెగ్యులర్ స్పీకర్ ఎన్నిక తరువాతే వాళ్లు ప్రమాణం చేస్తారు.

ఆర్టీసీ బస్సెక్కిన సీఎం..

మహిళల కోలాహలం, అధికారుల హడావిడి, కాంగ్రెస్ ఎమ్మెల్యేల హంగామా మధ్య మహిళల ఉచిత బస్సు ప్రయాణానికి ఉద్దేశించిన మహాలక్ష్మి పథకం ప్రారంభమైంది. సీఎం రేవంత్‌ రెడ్డి ఈ పథకాన్ని ప్రారంభించి ఆర్టీసీ బస్సులో మంత్రులు, మహిళా ఎమ్మెల్యేలతో కలసి ప్రయాణించారు.

శాఖల కేటాయింపుతో రంగంలోకి దిగిన మంత్రులు..


అసెంబ్లీ వాయిదా పడిన అరగంటలోపే మంత్రులకు శాఖలు కేటాయింపులొచ్చాయి. ఉత్తర్వులు వచ్చీరాగానే మంత్రులు రంగంలోకి దిగిపోయారు. హోం, పురపాలక, విద్య, ఎస్సీ, ఎస్టీ సంక్షేమంతో పాటు మంత్రులకు కేటాయించని ఇతర శాఖలను సీఎం తన వద్దే అట్టిపెట్టుకున్నారు.

ఎవరెవరికి ఏమేమి ఇచ్చారంటే..

ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకి ఆర్థిక, ఇంధన శాఖ, తుమ్మల నాగేశ్వరరావుకి వ్యవసాయం, చేనేత, జూపల్లి కృష్ణారావుకి ఎక్సైజ్‌, పర్యాటకం, ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డికి నీటి పారుదల, పౌరసరఫరాలు, దామోదర రాజనర్సింహకి వైద్య, ఆరోగ్య శాఖ, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ, దుద్దిళ్ల శ్రీధర్‌బాబుకి ఐటీ, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాలు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డికి రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖ, పొన్నం ప్రభాకర్ కి రవాణా, బీసీ సంక్షేమం, సీతక్కకి పంచాయతీ రాజ్‌, మహిళ, శిశు సంక్షేమం, కొండాసురేఖకి అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖలు కేటాయించారు. ప్రస్తుతం మంత్రులుగా ఉన్నవారిలో ఒక్క సీతక్క తప్ప మిగతా వారందరికీ ఎంతో కొంత పాలనాయంత్రాంగం, విధి విధానాలతో అనుబంధం ఉన్నవాళ్లే కావడం విశేషం. భట్టి విక్రమార్క అప్పుడే ఆర్ధిక శాఖ ఫైళ్లతో తలమునకలవుతున్నారట.

పాత సలహాదారులందరికీ గుడ్ బై..

కాంగ్రెస్ ప్రభుత్వం వస్తూనే వేగంగా పలు మార్పులు చేపట్టింది. వాటిల్లో ఒకటి కేసీఆర్ హయాంలో ప్రభుత్వ సలహాదారులుగా ఉన్న ఏడుగుర్నీ రేవంత్ ప్రభుత్వం తొలగించింది. వీరితో పాటు స్పెషల్ ఆపీసర్లకు కూడా ఉద్వాసన పలుకుతూ చీఫ్ సెక్రటరీ శాంతా కుమారి ఉత్తర్వులు జారీ చేశారు.

ఎమ్మెల్సీల రాజీనామా ఎందుకు?


ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్‌ రెడ్డి, కడియం శ్రీహరి, పాడి కౌశిక్‌ రెడ్డి రాజీనామా చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో వీరు ఎమ్మెల్యేలుగా ఎన్నిక కావడంతో నిబంధనల ప్రకారం 15 రోజులలోపు ఏదో ఒక సభ్యత్వానికి రాజీనామా చేయాలి. ఖాళీ అయిన స్థానానికి ఎన్నికల కమిషన్‌ ఆరు మాసాలలోపు ఎన్నికలు నిర్వహిస్తుంది. శాసన మండలి ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్‌ రెడ్డిని కలిసి ఎమ్మెల్సీలుగా రాజీనామా చేస్తున్నట్లు లేఖలు అందించారు.

కొసమెరుపు అదిరింది..

కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 48 గంటలు గడవక మునుపే ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంవో) అధికారినంటూ ఓ వ్యక్తి మోసానికి తెరలేపాడు.


ఈ విషయం సీఎంవోకి తెలిసింది. పోలీసులకు ఫిర్యాదు అందింది. ఆ మోసగాడు హైదరాబాద్‌ వనస్థలిపురం ప్రాంతానికి చెందిన అత్తిలి ప్రవీణ్‌ సాయి అని తేలింది. నాలుగు తన్ని తీసుకొచ్చి కటకటాల్లో పెట్టారు పోలీసులు.

Tags:    

Similar News