మలుపు తిరిగిన ఒంటెల కాపరి కథ,ఎడారిలో వెలుగుచూసిన నాందేవ్

సౌదీ ఎడారిలో ఒంటెల కాపరిగా పనిచేస్తున్న రాథోడ్ నాందేవ్ ఆచూకిని ఎత్తకేలకు గుర్తించారు.ఇండియన్ ఎంబసీ అధికారులు చేపట్టిన ఆపరేషన్‌లో లొకేషన్‌ను గుర్తించారు.

Update: 2024-08-16 12:12 GMT

పొట్టకూటి కోసం గల్ఫ్ దేశానికి వెళ్లిన తెలంగాణ వాసి రాథోడ్ నాందేవ్ వ్యవహారం మలుపు తిరిగింది.ఇటీవల సెల్ఫీ వీడియోతో నాందేవ్ సంచలనం సృష్టించారు.నిర్మల్ జిల్లా ముధోల్ మండలం రువ్వి గ్రామానికి చెందిన గిరిజనుడు రాథోడ్ నాందేవ్ ఇంటిపని వీసాపై కువైట్ దేశానికి వెళ్లగా అక్కడి అరబ్బు యజమాని అతన్ని సౌదీ అరేబియాకు అక్రమంగా తీసుకువెళ్లారు. అరబ్బు యజమాని నాందేవ్‌ను అక్రమంగా కువైట్ దేశం సరిహద్దు దాటించి సౌదీ అరేబియా ఎడారిలో ఒంటెల కాపరిగా పని చేయించుకుంటున్న విషయం ఇటీవల వెలుగు చూసిన విషయం తెలిసిందే.


భార్య ఫిర్యాదుతో కదిలిన ఎంబసీ అధికారులు
సౌదీ అరేబియా దేశంలోని అటవీ ప్రాంతంలో ఒంటెల కాపరిగా పనిచేస్తున్న రాథోడ్ నాందేవ్ ఎడారి లొకేషన్ ను ఎట్టకేలకు భారత ఎంబసీ అధికారులు గుర్తించారు. తన భర్త నాందేవ్‌తో ఎడారిలో ఒంటెలకాపరిగా పనిచేయిస్తూ కొడుతున్నారని అతని భార్య లక్ష్మి భారత విదేశాంగ శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు.బాల్కొండ మాజీ ఎమ్మెల్యే, తెలంగాణ మినరల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఈరవత్రి అనిల్ ఈ విషయాన్నిటీపీసీసీ ఎన్నారై సెల్ కన్వీనర్ మంద భీంరెడ్డి తో కలిసి ఎంబసీతో సహా సంబంధిత విదేశాంగ శాఖ అధికారుల దృష్టికి తీసికెళ్లారు.

ఏ ఎడారిలో నాందేవ్ ఉన్నాడంటే...
రాథోడ్ నాందేవ్ సౌదీ అరేబియా ఈస్ట్రన్ ప్రావిన్స్ లోని ఖఫ్జి పట్టణం సమీపంలోని ఎడారిలో ఉన్నట్లు వెల్లడైంది. నాందేవ్ వాట్సాప్ లో తన లొకేషన్ మ్యాపును అతని భార్య లక్ష్మికి షేర్ చేయడంతో ఈ విషయం రూఢి అయ్యింది. కువైట్ సిటీ కి 110 కిలోమీటర్ల దూరంలో అల్ వఫ్రా అనే పట్టణం ఉంది. అల్ వఫ్రా నుంచి 50 కిలోమీటర్ల దూరంలో సౌదీ ఆరేబియా లోని పర్షియన్ గల్ఫ్ సముద్ర తీరంలో ఖఫ్జి అనే పట్టణం ఉంది.

నాందేవ్ ను రక్షిస్తాం...
కువైట్ వీసా ఉన్న గల్ఫ్ కార్మికుడు నాందేవ్ ను సౌదీ అరేబియా భూభాగం నుంచి రక్షించడంలో కొన్ని సాంకేతికమైన, న్యాయపరమైన చిక్కులున్నాయని టీపీసీసీ ఎన్నారై సెల్ కన్వీనర్ మంద భీంరెడ్డి ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. కువైట్ లోని ఇండియన్ ఎంబసీ, సౌదీ అరేబియా రాజధాని రియాద్ లోని ఇండియన్ ఎంబసీలు ఈ కేసులో సమన్వయంతో పనిచేస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. ఢిల్లీ లోని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సూచనల మేరకు కువైట్, సౌదీ ప్రభుత్వాలను సంప్రదిస్తూ అడుగులు వేస్తున్నారు. అనుమతి లేకుండా, పొరపాటున దేశాల సరిహద్దులు దాటినప్పుడు అనుసరించాల్సిన అంతర్జాతీయ నిబంధనలకు అనుగుణంగా స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ (ఎస్ఓపి) ను పాటిస్తూ నాందేవ్ ను రక్షించేందుకు ప్రయత్నిస్తున్నారని భీంరెడ్డి వివరించారు.

నాందేవ్ కు ధైర్యం చెప్పి...
టీపీసీసీ ఎన్నారై సెల్ కన్వీనర్ మంద భీంరెడ్డి వాట్సాప్, ఐఎంఓ ద్వారా సౌదీ లో ఉన్న ఒంటెల కాపరి రాథోడ్ నాందేవ్ తో మాట్లాడి ఓదార్చి, అతనికి ధైర్యం చెప్పారు.
ఈ సందర్బంగా నాందేవ్ ఎడారి జీవితం గురించి మంద భీంరెడ్డికి వివరించారు.‘‘ప్రతీరోజూ ఉదయం 6 గంటల నుంచి 11 గంటల వరకు 40 ఒంటెలను ఎడారిలో తిప్పడం. ఆ తర్వాత వాటిని గ్రీన్ టెంట్ (కొట్టం) లోకి ఒంటెలను తీసుకు వచ్చి వాటికి నీళ్లు, మేత ఇవ్వడం. నాతో పాటు ఉన్న ఉత్తర ప్రదేశ్ కు చెందిన రాజు అనే వ్యక్తి ఒంటెలకు దాణా పెట్టడంలో సహాయం చేసి, ఒంటెల పాలు పితుకుతున్నాడు’’అని నాందేవ్ వివరించాడు.

అరబ్బు యజమాని కొట్టాడు...
‘‘తండ్రీ కొడుకులైన అరబ్బు యజమానులు పొద్దంతా తమను కనిపెట్టుకొని ఉంటారని, రెండు సార్లు జీపుతో ఢీ కొట్టారని, ఒకసారి కొట్టారని, ఆరోగ్యం బాగా లేకపోతే ఆసుపత్రికి కూడా తీసుకపోరని, తప్పించుకొని పారిపోయే ప్రయత్నం చేస్తే చంపేసే అవకాశం ఉంది’’అని నాందేవ్ విలపిస్తూ చెప్పాడు. ఒంటెలు అనారోగ్యం పాలైతే మాత్రం వెంటనే వెటర్నరీ వైద్య సిబ్బందిని పిలిపిస్తారని, కాని తనకు మాత్రం వైద్యచికిత్స చేయించరని ఆయన తెలిపారు.

నెలకు రూ.20వేల జీతం
‘‘నా యజమాని నెలకు రూ.20 వేల జీతం చొప్పున ప్రతి మూడు నెలలకు ఒకసారి తన కుమారుడి బ్యాంక్ అకౌంట్ కు డబ్బులు పంపిస్తారు,డిగ్రీ పూర్తి చేసిన తన కూతురికి ఇటీవల పెళ్లి అయిందని, ఆ పెళ్లికి తాను హాజరు కాలేకపోయాను’’ అని నాందేవ్ ఆవేదన వ్యక్తం చేశారు.డిచ్ పల్లి లోని తెలంగాణ యూనివర్సిటీలో తన కుమారుడు ఎంఏ చదువుతున్నాడని పిల్లల భవిష్యత్ కోసం ఎంత కష్టమైనా భరించానని నాందేవ్ చెప్పాడు.

ఏడారిలో ఒంటెలతోనే అనుబంధం
‘‘గత ఎనిమిది నెలలుగా ఒంటెలతో అనుబంధం ఏర్పడిందని, పిల్ల ఒంటెలను వదిలి వెళ్లడం బాధ కలిగించే విషయం, కానీ యజమాని హింస, అతి వేడిని, పని ఒత్తిడిని భరించడం కష్టంగా ఉంది’’అని నాందేవ్ పేర్కొన్నాడు. ఎప్పుడు ఇండియాకు చెరుకుంటానో అని రోజులు లెక్క పెడుతున్నానని నాందేవ్ ఆవేదనగా చెప్పారు.

Tags:    

Similar News