ముంబై నగరాన్ని షేక్ చేస్తున్న బాబా సిద్దికి హత్య!
సిద్దికికి దావూద్ ఇబ్రహీమ్‌తో సంబంధాలు ఉన్నందున, సల్మాన్‌ఖాన్‌కు అత్యంత సన్నిహితుడు కావటంవల్లనే అతనిని చంపామని బిష్ణోయ్ గ్యాంగ్ ప్రకటించింది.
బాబా సిద్దికి హత్య ఆ నగరంలోనే కాకుండా మొత్తం మహారాష్ట్ర వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ హత్య లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ పనేనని పోలీసులు ధృవీకరించారు. మరోవైపు, ఇది తమ పనేనని బిష్ణోయ్ గ్యాంగ్ సభ్యుడు ఒకరు సోషల్ మీడియాలో ఒక పోస్ట్ ద్వారా ప్రకటించారు. హతుడు సిద్దికికి దావూద్ ఇబ్రహీమ్‌తో సంబంధాలు ఉన్నందున, సల్మాన్‌ఖాన్‌కు అత్యంత సన్నిహితుడు కావటంవల్లనే అతనిని చంపామని ఆ పోస్టులో పేర్కొన్నారు. దావూద్, సల్మాన్‌లకు సాయంచేసేవారు ఎవరికైనా అదే గతి పడుతుందని హెచ్చరించారు.
ఇద్దరు నిందితులు అరెస్ట్, మరో ఇద్దరి పరారీ
హత్యకు పాల్పడినట్లుగా భావిస్తున్న ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారినుంచి రెండు పిస్టల్‌లను, బుల్లెట్‌లను స్వాధీనం చేసుకున్నారు. మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నాడు. పట్టుబడిన నిందితులు హర్యానాకు చెందిన గుర్నెయిల్ బల్జీత్ సింగ్, యూపీకి చెందిన ధర్మరాజ్ రాజేష్ కశ్యప్ అని, పరారీలో ఉన్న నిందితులు శివ్ కుమార్, మహమ్మద్ జీషన్ అఖ్తర్ అని పోలీసులు చెబుతున్నారు. వీరిలో ముగ్గురు కొంతకాలం క్రితం హర్యానాలో జైలులో ఉన్న బిష్ణోయ్ గ్యాంగ్ సభ్యుడు ఒకరిని కలుసుకున్నారని పోలీసులు ఇవాళ వెల్లడించారు. పట్టుబడిన ఇద్దరు నిందితులను ఇవాళ కోర్టులో ప్రవేశపెట్టగా పోలీస్ రిమాండ్ విధించారు.
నివాళులు అర్పించిన సల్మాన్
సల్మాన్ ఖాన్‌కు సిద్దికి అత్యంత సన్నిహితుడు. సల్మాన్, షారుక్‌ల మధ్య ఎంతోకాలంగా ఉన్న వైరానికి తెరదించి, ఇద్దరికీ రాజీ కుదిర్చిన ఘనత సిద్దికిదేనని చెబుతారు. సినిమా షూటింగ్‌లో ఉన్న సల్మాన్, ఈ వార్త తెలియగానే మృతదేహాన్ని చూడటానికి హుటాహుటిన బయలుదేరి వచ్చారు. ఆదివారం సాయంత్రం 5 గం. ప్రాంతంలో తన చిరకాల మిత్రుడి నివాసానికి చేరుకుని మృతదేహానికి నివాళులు అర్పించారు. మరోవైపు సల్మాన్ ఇంటివద్ద కూడా భద్రతను కట్టుదిట్టం చేశారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో సల్మాన్ ఇంటివద్ద కొందరు దుండగులు కాల్పులు జరిపారు. అది కూడా బిష్ణోయ్ గ్యాంగ్ పనేనని అప్పట్లో అన్నారు.
ఎవరీ లారెన్స్ బిష్ణోయ్?
సల్మాన్‌కు సన్నిహితుడు కావటంవలనే సిద్దికిని చంపినట్లు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ఇవాళ పెట్టిన సోషల్ మీడియా పోస్టులో ఉంది. అసలు ఈ లారెన్స్ బిష్ణోయ్ ఎవరు అనేదానిపై ఇప్పుడు పెద్ద చర్చ జరుగుతోంది. ఇతను ప్రస్తుతం అహ్మదాబాద్‌లోని సబర్మతి జైలులో ఖైదీగా ఉన్నాడు. జైలునుంచే అక్రమ కార్యకలాపాలు నిర్వహిస్తాడని అంటారు. ఇతను 1993లో పంజాబ్‌లో పుట్టాడు. 2010లో చండీగడ్‌లోని డీఏవీ కాలేజిలో చేరిన తర్వాత కొందరు నేరస్తులతో పరిచయం ఏర్పడింది. అక్కడనుంచి మత్తుమందుల వ్యాపారం, హత్యలు, రౌడీ మామూళ్ళ వసూలు వంటి కార్యకలాపాలను మొదలుపెట్టాడు. ఇప్పటివరకు కేవలం ఉత్తరాది ప్రాంతంలోని పంజాబ్, హర్యానా, ఢిల్లీ, రాజస్థాన్ రాష్ట్రాలలో మాత్రమే ఇతని కార్యకలాపాలు జరుగుతుండేవి. ముంబై నగరంలోని పేరుమోసిన దావూద్ ఇబ్రహీమ్, ఛోటా రాజన్, రవి పూజారి వంటి గ్యాంగులు ఇప్పుడు మరుగున పడిపోవటంతో లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ వారి స్థానంలోకి రావాలని చూస్తుండవచ్చని ముంబై పోలీసులు చెబుతున్నారు.
లారెన్స్ బిష్ణోయ్‌కు సల్మాన్ ఎందుకు టార్గెట్?
సల్మాన్ ఖాన్ 1998లో కొంతమంది హీరోయిన్‌లను వెంటబెట్టుకుని రాజస్థాన్ అడవుల్లో విహారానికి వెళ్ళి కొన్ని కృష్ణజింకలను వేటాడి చంపిన సంగతి తెలిసిందే. ఆ జింకలను లారెన్స్ బిష్ణోయ్‌కు చెందిన బిష్ణోయ్ సామాజికవర్గంవారు పవిత్రమైన జంతువుగా కొలుస్తుంటారు. అందుకే సల్మాన్‌ను లారెన్స్ బిష్ణోయ్ టార్గెట్ చేశాడని అంటారు. మరోవైపు,సల్మాన్ పేరు చెప్పటంద్వారా తనకు బాగా పేరు వస్తుందని అలా బెదిరిస్తుంటాడని కూడా ఒక వాదన ప్రచారంలో ఉంది.
సిద్దికికి బాలీవుడ్‌లో మంచి పేరు
బాలీవుడ్ సర్కిల్‌లో మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్న 66 ఏళ్ళ బాబా సిద్దికి బాంద్రా వెస్ట్ నుంచి మూడు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు, 2004-2008 కాలంలో కాంగ్రెస్-ఎన్‌సీపీ ప్రభుత్వంలో మంత్రిగా కూడా చేశారు. ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీలో ఉండేవారు, ఈ ఏడాదే అజిత్ పవార్ ఎన్‌సీపీ వర్గంలో చేరారు. ఆయనకు వై క్యాటగరీ సెక్యూరిటీ ఇవ్వబడి ఉంది.
నిన్నరాత్రి 9 గం. ప్రాంతంలో తన కుమారుడు, ఎమ్మెల్యే అయిన జీషన్ సిద్దికి కార్యాలయంనుంచి బయటకు వచ్చి కారు దగ్గరకు వెళుతుండగా, ఆయనపై దుండగులు కాల్పులు జరిపారు. నిన్న దసరా సందర్భంగా రావణ దహనం టపాసులు కాలుస్తున్న సమయంలోనే దుండగులు కాల్పులు జరపటంతో ఆ శబ్దంలో ఈ ఘటనను ఎవరూ సరిగ్గా గమనించలేదు. సిద్దికిని వెంటనే లీలావతి ఆసుపత్రికి తరలించారు. అక్కడ చనిపోయినట్లు నిర్ధారణ అయింది. ఈ కేసు దర్యాప్తులో సహకరించటానికి ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ అధికారులు కూడా ముంబై చేరుకున్నారు. మరోవైపు కాల్పులకు వాడిన ఒక పిస్టల్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులు దాదాపు రెండు నెలలనుంచి బాబా సిద్దికి ఇల్లు, ఆఫీసుల వద్ద రెక్కీ నిర్వహించారని పోలీసులు చెప్పారు.
రాజకీయ ప్రకంపనలు
అటు రాజకీయంగా కూడా ఈ హత్య ప్రకంపనలు సృష్టిస్తోంది. వచ్చే నెలలో మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఇంత పెద్ద రాజకీయ నాయకుడు హత్యకు గురవటం గత మూడు దశాబ్దాలలో ఇదే మొదటిసారి. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితిని ఈ హత్య అద్దం పడుతోందని ప్రతిపక్షాలు విమర్శించాయి. అధికారపక్షానికి చెందిన నాయకుడికే భద్రత లేకపోతే సామాన్యుడికి ప్రభుత్వం ఎలా భద్రత కల్పిస్తుందని ఎన్‌సీపీ(శరద్ పవార్ వర్గం) నాయకుడు జయంత్ పాటిల్ ప్రశ్నించారు. ఈ ఘటనకు బాధ్యత వహించి హోమ్ మంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ వెెంటనే రాజీనామా చేయాలని శరద్ పవార్ డిమాండ్ చేశారు. నగరంలో గ్యాంగ్ వార్‌లు మళ్ళీ తలెత్తకుండా అన్ని చర్యలూ తీసుకుంటామని ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే చెప్పారు.
బాబా సిద్దికి అంటేనే భారీ ఇఫ్తార్ పార్టీలకు మారు పేరుగా ఉండేది. ఈ పార్టీలకు పలువురు బాలీవుడ్ నటులు హాజరయ్యేవారు. బాలీవుడ్‌లే ఏమైనా గొడవలు వస్తే, సిద్దికీయే పంచాయతీలు చేసేవారు. కరోనా సమయంలో ఆపన్నులకు అత్యంత ఖరీదైన మందులు అందజేశారని సిద్దికికి పేరు ఉంది. సిద్దికికి ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరుగుతాయని ముఖ్యమంత్రి ప్రకటించారు.