కాలుష్యం కాటేసింది...

హైదరాబాద్ నగర శివార్లలోని పారిశ్రామికవాడలు కాలుష్య కాసారాలుగా మారాయి. జిన్నారం పారిశ్రామికవాడ చెరువుల్లోని కలుషిత నీరు తాగి 20 గేదెలు, చేపలు మృత్యువాత పడ్డాయి.

Update: 2024-08-23 09:53 GMT

ఒకవైపు హైదరాబాద్ నగరం అభివృద్ధితో విస్తరిస్తుండగా, మరో వైపు కాలుష్యం కాటేస్తోంది. నగర శివార్లలో పెద్ద సంఖ్యలో వెలసిన పరిశ్రమలతో కాలుష్యం పెచ్చు పెరిగింది. నగర శివార్లలోని పరిశ్రమల నుంచి వెలువడుతున్న కాలుష్య కారకాలతో పారిశ్రామికవాడల్లో గాలితోపాటు నీరు కూడా విషపూరితంగా మారాయి.

- ఖాజిపల్లి, గడ్డపోతారం, కిష్టాయిపల్లి గ్రామాల చుట్టుపక్కల ఉన్న పరిశ్రమలు ఈవర్షాకాలంలో ప్రమాదకర వ్యర్ధాలను చెరువలలోకి వదులుతున్నాయని స్థానిక ప్రజలు ఆరోపించారు.పారిశ్రామిక వ్యర్థాలు వెదజల్లుతుండటంతో చెరువులు, భూగర్భంలోని నీరు విషతుల్యంగా మారిందని స్థానికులు చెప్పారు.
- జిన్నారం పారిశ్రామికవాడలోని కుంటల్లో కలుషిత నీరు తాగి 20కి పైగా గేదెలు మృత్యువాత పడ్డాయి. గత 10 రోజులుగా ఖాజీపల్లి, గడ్డపోతారం, కిష్టాయిపల్లికి చెందిన రైతులకు చెందిన 20కి పైగా గేదెలు మరణించడంతో కళేబరాలతో రైతులు నిరసన తెలిపారు.
- చెరువులు, కుంటల్లోని కలుషితమైన నీరు తాగి పలు గేదెలు మృత్యువాత పడుతుండడంతో జిన్నారం మండలంలోని పారిశ్రామికవాడల్లో ఉన్న గ్రామాల్లో పశువుల పెంపకందారులకు పశువులను ఆరుబయట మేపడం సమస్యగా మారింది.

పీసీబీ కార్యాలయం ఎదుట రైతుల నిరసన
పారిశ్రామిక వాడల్లోని కలుషిత జలాలు తాగి గురువారం నాలుగు గేదెలు మృతి చెందాయి. మరో నాలుగు గేదెలు కలుషిత నీటిని తాగడంతో ప్రాణాలతో పోరాడుతున్నాయి. సోమవారం నుంచి పారిశ్రామికవాడల చుట్టూ ఉన్న గ్రామాల్లో గత కొన్ని రోజులుగా పలు గేదెలు మృతి చెందాయి.కలుషిత జలాలతో గేదెల మృతిపై స్థానిక కాలుష్య నియంత్రణ మండలి అధికారులకు రైతులు ఫిర్యాదు చేసినా వారు స్పందించ లేదు. దీంతో స్థానిక నాయకుల ఆధ్వర్యంలో రైతులు ఈ గేదెల కళేబరాలను హైదరాబాద్‌లోని కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ)కార్యాలయానికి తీసుకెళ్లి పెద్దఎత్తున నిరసన చేపట్టారు.పరిశ్రమల వల్ల తమ జీవనం కష్టంగా మారుతున్నప్పటికీ ప్రభుత్వం తమ ఫిర్యాదులపై చర్యలు తీసుకోవడం లేదని రైతులు ఆవేదనగా చెప్పారు.

అనారోగ్యం పాలవుతున్న ప్రజలు
పరిశ్రమలు విడుదల చేస్తున్న కలుషిత నీరు,గాలితో ప్రజలు అల్లాడుతున్నారు. హానికరమైన కలుషిత వ్యర్థ పదార్థాలను విడుదల చేయడంతో ఆయా గ్రామాల్లోని ప్రజలు కూడా తరచూ అనారోగ్యం పాలవుతున్నారు.గొర్రెలు,మేకలు,కోళ్లు,ఇతర పశువులు కూడా కాలుష్యం కారణంగా మృత్యువాత పడుతున్నాయని పారిశ్రామికవాడల గ్రామాల ప్రజలు చెప్పారు. కలుషిత నీటి వల్ల చేపలు కూడా మరణిస్తున్నాయని స్థానిక ప్రజలు ఆవేదనగా చెప్పారు.

మృత్యువాత పడుతున్న చేపలు
సంగారెడ్డి చెరువులో కలుషిత జలాలతో చేపలు మృత్యువాత పడ్డాయి.కొన్ని పరిశ్రమలు ప్రమాదకర వ్యర్థాలను మహబూబ్ సాగర్ ట్యాంకులోకి విడుదల చేయడం వల్లే చేపలు చనిపోయాయని మత్స్యకారులు చెప్పారు.సంగారెడ్డిలో మత్స్యశాఖ అధికారులు చేపలు చనిపోయిన చెరువు నుంచి నీటి నమూనాలను సేకరించి పరీక్షలకు ల్యాబ్ కు పంపించారు. చిట్కుల్ సరస్సులో చేపలు మరణించడంతో దీని పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని మత్స్యకారులు డిమాండ్ చేశారు.


కలుషిత చెరువుల నీటి శాంపిల్స్ సేకరణ
బంజారాహిల్స్ లోటస్‌పాండ్‌లోనూ ఇటీవల చేపలు కుప్పలు తెప్పలుగా మృత్యువాత పడ్డాయి.దీంతో చెరువు నీటి శాంపిల్స్ సేకరించి టెస్టులకు పంపించారు.చెరువు నిండా కుప్పలు, తెప్పలుగా చచ్చిపోయి తేలిన చేపల్ని చూసి మత్స్యకారులు లబోదిబోమన్నారు.పటాన్ చెరు మండలం చిట్కుల్ గ్రామంలోని పెద్ద చెరువులో సుమారు 10 టన్నుల చేపలు మృతి చెందాయి.చేపల మృతికి రసాయన వ్యర్థ పదార్థాలే కారణమనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.మత్స్యకారుల ఫిర్యాదు మేరకు కాలుష్య నియంత్రణ మండలి అధికారులు,మత్స్యశాఖ అధికారులు సరస్సును సందర్శించారు.పీసీబీ అధికారులు కరిగిన ఆక్సిజన్ స్థాయి సాధారణం కంటే తక్కువగా ఉందని, అందువల్లే చేపలు మరణించాయని అధికారులు చెప్పారు.

చేపల మృతిపై హైకోర్టు విచారణ
హైదరాబాద్‌‌‌‌‌‌‌‌ శివార్లలోని పఠాన్‌‌‌‌‌‌‌‌చెరువు చిట్కూల్‌‌‌‌‌‌‌‌ చెరువులో కాలుష్యంతో టన్నుల కొద్ది చేపలు మృతి చెందటంపై హైకోర్టు సుమోటోగా విచారణకు స్వీకరించింది. చేపల మృతిపై కౌంటర్లు దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.పలు పరిశ్రమలు చెరువులోకి కాలుష్యాన్ని వదిలిపెట్టడంతోనే చేపలు మృత్యువాత పడ్డాయని మత్స్యకారులు వివరించారు.

కాలుష్య కారక పరిశ్రమల మూసివేతకు పీసీబీ ఆదేశాలు
సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం మాంబాపూర్ గ్రామంలో వాయు కాలుష్యాన్ని వెదజల్లుతున్న పరిశ్రమను మూసివేయాలని కాలుష్య నియంత్రణ మండలి ఆదేశాలు జారీ చేసింది. కాలుష్యాన్ని వెదజల్లుతున్న పరిశ్రమకు విద్యుత్ కనెక్షన్ ను తొలగించారు. వాయు, జల కాలుష్యాన్ని వెదజల్లుతున్న పరిశ్రమలపై తాము విచారణ జరుపుతున్నామని, త్వరలో చర్యలు తీసుకుంటామని కాలుష్య నియంత్రణ మండలి అధికారి ప్రసన్నకుమార్ ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. కలుషిత జలాలు తాగి గేదెలు మరణించాయని రైతుల ఫిర్యాదుపై తాము దర్యాప్తు చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు.


Tags:    

Similar News