తెలంగాణ గవర్నర్ కి సీఎం స్వాగతం

తెలంగాణ నూతన గవర్నర్ గా నియమితులైన జిష్ణుదేవ్ వర్మ బుధవారం రాష్ట్రంలో అడుగుపెట్టారు.

Update: 2024-07-31 10:56 GMT

తెలంగాణ నూతన గవర్నర్ గా నియమితులైన జిష్ణుదేవ్ వర్మ బుధవారం రాష్ట్రంలో అడుగుపెట్టారు. ఆయనకి సీఎం రేవంత్ రెడ్డి స్వాగతం పలికారు. అధికారులతో కలిసి శంషాబాద్ ఎయిర్ పోర్టులో గవర్నర్ ని రిసీవ్ చేసుకున్నారు. గవర్నర్ కి సీఎం రేవంత్ శాలువా కప్పి, పుష్పగుచ్చం అందించారు. సీఎంతోపాటు సీఎస్ శాంతి కుమారి, డీజీపీ జితేందర్, త్రివిధ దళాల అధికారులు, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాల్ రావు, ఇతర ఉన్నతాధికారులు గవర్నర్ కి ఆహ్వానం పలికారు. అనంతరం గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సాయుధ దళాల గౌరవ వందనం స్వీకరించారు.

కాగా, జులై 27 న తెలంగాణ సహా మొత్తం 10 రాష్ట్రాలకు గవర్నర్లను నియమిస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉత్తర్వులు జారీ చేశారు. కొత్తవారు ఏడుగురుని గవర్నర్లుగా నియమించగా, ముగ్గురు గవర్నర్లను బదిలీ చేశారు. అందులో భాగంగా ఝార్ఖండ్ గవర్నర్, తెలంగాణ ఇంచార్జ్ గవర్నర్ గా ఉన్న సీపీ రాధాకృష్ణని కేంద్ర ప్రభుత్వం మహారాష్ట్రకి బదిలీ చేసింది. ప్రస్తుతం మహారాష్ట్ర గవర్నర్ గా ఉన్న రమేష్ బైస్ ను తప్పించింది. తెలంగాణ బీజేపీ నేత ఇంద్రసేనారెడ్డి త్రిపుర గవర్నర్ గా నియమితులవ్వగా.. ఆ రాష్ట్రానికి చెందిన బీజేపీ నేత జిష్ణుదేవ్ ని తెలంగాణ గవర్నర్ గా నియమించడం విశేషం. జిష్ణుదేవ్ ఈరోజు సాయంత్రం 5.30 గంటలకి తెలంగాణ గవర్నర్ గా ఛార్జ్ తీసుకోనున్నారు.

జిష్ణుదేవ్ వర్మ త్రిపుర రాజకుటుంబానికి చెందిన వారు. జిష్ణు దేవ్ వర్మ 1957 ఆగస్టు 15న జన్మించారు. దేవ్ వర్మ 1990ల ప్రారంభంలో రామజన్మభూమి ఉద్యమం సమయంలో భారతీయ జనతా పార్టీలో చేరారు. 1993లో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. ఆయన 2018 లో త్రిపుర శాసనసభలోని చరిలం నియోజకవర్గం నుండి ఎన్నికయ్యారు. 2018 నుంచి 2023 వరకు త్రిపురకు 2వ ఉప ముఖ్యమంత్రిగా పనిచేశారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో చారిలం అసెంబ్లీ నియోజకవర్గంలో పోటీ చేసి ఓడిపోయారు. ప్రస్తుతం ఆయన తెలంగాణ రాష్ట్ర నాల్గవ గవర్నర్ గా నియమితులయ్యారు. 

Tags:    

Similar News