హైదరాబాద్‌లో జోరుగా, హుషారుగా దాండియా డ్యాన్సులు

హైదరాబాద్‌లో దసరా నవరాత్రి ఉత్సవాల్లో దాండియా జోరు

Update: 2025-09-23 09:14 GMT
హైదరాబాద్‌లో దసరా నవరాత్రి ఉత్సవాల్లో దాండియా డ్యాన్సులు

దసరా పండుగ సందర్భంగా దుర్గాదేవిని పూజిస్తూ గుజరాతీలు, రాజస్థానీలు దాండియా నృత్యాలు చేస్తుంటారు. హైదరాబాద్ నగరంలో గుజరాతీలు, రాజస్థానీయులు ఎక్కువ మంది ఉండటంతో వారితోపాటు తెలుగు వారు కూడా దసరా నవరాత్రుల ఉత్సవాల్లో పాల్గొంటున్నారు. దీంతో నగరంలో దాండియా నృత్యాల జోరు కనిపిస్తోంది.ఒక వైపు బతుకమ్మ సంబరాలు, మరో వైపు దసరా దాండియా ఆటపాటలతో హైదరాబాద్ నగరం హోరెత్తిపోతోంది. వివిధ భాషలు, వివిధ ప్రాంతాల సంస్కృతుల సమ్మేళనం హైదరాబాద్ గొప్ప సాంస్కృతిక వారసత్వంతో దాండియా కోలాహలం కనిపిస్తోంది.




 యువత ఉల్లాసంగా...

దసరా నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా హైదరాబాద్ నగరంలో దాండియా ఉత్సవాలు జోరుగా, హుషారుగా సాగుతున్నాయి.ఈ ఉత్సవాల్లో యువతీ, యువకులు కలిసి మెలసి చిందేస్తున్నారు. నగరంలోని ఖరీదైన హోటళ్ల లాంజ్ ల నుంచి ఒపెన్ ఎయిర్ పార్టీలు,ఉద్యానవనాలు, లైవ్ బ్యాండ్ లు, డీజే, దాండియా ఆటపాటలతో నవరాత్రి ఉత్సవాలు సందడిగా మారాయి.నవరాత్రి రావడంతో హైదరాబాద్ నగరం అద్భుతమైన దాండియా, గర్బా రాత్రులతో కోలాహలంగా మారింది.

విద్యుద్దీపాల కాంతుల మధ్య...
విద్యుద్దీపాల కాంతులు,డీజే ట్రాక్ సంగీతం మధ్య యువతీ, యువకులు దాండియా నృత్యం నృత్యం చేస్తూ ఉల్లాసంగా గడుపుతున్నారు. మాదాపూర్ లోని యోలో అరేనా, బేగంపేటలోని చిరాన్ ఫోర్ట్ క్లబ్, జూబ్లీహిల్స్ కన్వెన్షన్ సెంటర్, సికింద్రాబాద్ ఏఎంఆర్ ప్లానెట్ మాల్, బైరామల్ గూడలోని ఎడులకంటి రామ్ రెడ్డి గార్డెన్స్,నానక్ రాంగూడలోని ఫ్లిప్ సైడ్ అడ్వెంచర్ పార్కు...ఇలా ఒకటేమిటి? హోటల్లు, ఫంక్షన్ హాళ్లల్లో దాండియా నృత్యాలకు టికెట్లు బుకింగ్ అయ్యాయి. ఈ దాండయా వేడుకల్లో వివిధ రకాల రుచులను ఆస్వాదించడంతోపాటు వివిధ రకాల నృత్యాలతో భలే పసందుగా ఉంటోంది. నగరం దాండియా నృత్యాలకు సిద్ధం అయింది.



 ఎన్నెన్నో ప్రాంతాలు...దాండియా డ్యాన్సులు...

హైదరాబాద్ నగరంలోని బేగంపేట, కొంపల్లి, సికింద్రాబాద్, గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్టు, గండిపేట ప్రాంతాల్లో దాండియా నృత్యాల వేడుకలు సాగుతున్నాయి.పాటలు పాడటం, డోలు వాయించడం, గర్భా సంప్రదాయ దాండియా నృత్యాలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి.కేపీహెచ్ బీ కైథలాపూర్ గ్రౌండ్ లో దుమ్ము లేసి పోయేలా యువతుల దాండియా నృత్యాలు చేస్తున్నారు. హైదరాబాద్ బిగ్గెస్ట్ డాక్టర్ దాండియాలో వైద్యులు పాల్గొంటున్నారు.ఎల్ బి నగర్ లోని వన్ కన్వెన్షన్ హాలులో సాగుతున్న దాండియా కార్యక్రమంలో పాల్గొనాలంటే రూ.4,999 ఎంట్రీ ఫీజు చెల్లించాలి. ఈ కార్యక్రమంలోనే చిన్నారుల కోసం డాక్టర్ కిడ్స్ ఫ్యాషన్ వాక్ కూడా ఏర్పాటు చేశారు.సెప్టెంబరు 27వతేదీన జరిగే ఈ దాండియా వేడుకకు సినిమానటి విజయశాంతి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారని నిర్వాహకులు ప్రకటించారు. వైద్యులు, పిల్లలు, వారి కుటుంబాల కోసం సంగీతం, నృత్యం, వినోదం, పండుగ వైబ్‌లతో నిండిన మరపురాని రాత్రిని మిస్ అవ్వకండి అంటూ నిర్వాహకులు చెబుతున్నారు.

అతిథులకు దాండియా స్టిక్స్
హైదరాబాద్ యువక సంఘం దాండియా ఉత్సవ్ 2025 పేరిట వనస్థలిపురంలో నిర్వహిస్తోంది. ఈ దాండియా ఉత్సవాలకు వచ్చే అతిథులకు అన్ లిమిటెడ్ మాక్ టైల్స్, ఫుడ్, ఒక జత దాండియా స్టిక్స్ అందించనున్నారు. 51 అడుగుల దుర్గామాత విగ్రహం డీజే బ్యాండ్ దాండియా విత్ బాలీవుడ్ ట్విస్ట్ లైవ్ సింగర్స్, నాన్ స్టాప్ డీజే రాయల్ లాంజ్ పేరిట దాండి సందడి ఏర్పడింది.జూబ్లీహిల్స్ కన్వెన్షన్ సెంటర్,ఉప్పల్ లోని శ్రీ పళనీ కన్వెన్షన్స్ , సికింద్రాబాద్ పీజీ కాలేజీ గ్రౌండ్,ధోలారే ధోలా నవరాత్రి సంధ్యా కన్వెన్షన్ లలో దాండియా ఉత్సవాలు జోరుగా పసందుగా సాగుతున్నాయి.



 థ్రిల్ అందించే స్నో దాండియా

కొండాపూర్ శరత్ సిటీ మాల్ అయిదో అంతస్తులో స్నో కింగ్డమ్ మంచు తెరల మధ్య సరికొత్త థ్రిల్ అందించేలా స్నో దాండియా నిర్వహిస్తున్నారు. మంచులోనే 32 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో స్నో కింగ్డమ్ ఏర్పాటు చేశారు. మంచు మధ్య సాగే దాండియా ఆటపాటల్లో స్నో రాక్ క్లైంబింగ్, స్నో డ్యాన్స్, స్నో స్లైడింగ్, టోబో గానింగ్ కార్యక్రమాలు చేపట్టారు. కొండాపూర్ లో మంచు తెరల మధ్య రాజస్థానీలు, గుజరాతీలు దాండియా వేడుకలు జరుపుకుంటున్నారు. కొండాపూర్ సరస్వతీ మాల్ లో నవభారత్ దాండియా ఉత్సవ్ పేరిట దేవీ నవరాత్రులు ఘనంగా నిర్వహిస్తున్నారు.

దాండియా డ్యాన్సులతో ఫిట్ నెస్
దాండియా నృత్యాల వల్ల ఫిట్ నెస్ పరంగా ప్రయోజనాలున్నాయని స్నోకింగ్ డమ్ ఎండీ పువ్వాడి హారిక చెప్పారు. దాండియా నృత్యాల వల్ల ఒత్తిడి దూరమవుతుందని ఆమె చెప్పారు. దాండియాతో మానసిక ఉల్లాసంతోపాటు ఉత్తేజాన్నిస్తుందని ఆమె వివరించారు.



 హైదరాబాద్ నగరంలో అగర్వాల్ ప్యాకర్స్ అండ్ మూవర్స్ బడే బయ్యా అండ్ డీఆర్ఎస్ గ్రూప్ ఆధ్వర్యంలో రంగతాళి దాండియా నైట్ -2025 4వ సీజన్ నిర్వహించారు. తళుకుమిళుకుల మధ్య మిరుమిట్లు గొలిపే రంగురంగుల విద్యుద్దీపాల కాంతుల మధ్య యువతీయువకులు డ్యాన్సులతో అదరగొట్టారు.సెప్టెంబరు 22 నుంచి అక్టోబరు 1వతేదీ వరకు పదిరోజుల పాటు సాగనున్న ఈ దాండియా మహోత్సవంలో పాల్గొనేందుకు బుక్ మై షో ద్వారా టికెట్లు కొనవచ్చు. శంషాబాద్ కొత్వాల్ గూడలోని వైష్ణ కన్వెన్షన్ అండ్ రిసార్ట్ లో


మ్యూజిక్ , డ్యాన్స్, ఉత్సవాలు
హైదరాబాద్ నగరంలో జూమెంగే... హమ్ నాచెంగే... హమ్ గాయెంగే అంటూ డిస్కో దాండియా సందడి నెలకొంది.హైదరాబాద్ ఐఐటీలో బతుకమ్మ అండ్ దాండియా కలర్స్ పేరిట విద్యార్థులు దాండియా ఆడుతున్నారు. హైదరాబాద్ హెచ్ఐసీసీలోని నోవాటెల్ సెలబ్రిటీ దాండియా నైట్ ఏర్పాటు చేశారు.మల్లికా గార్డెన్ సిటీలో దిల్ దార్ దాండియా పేరిట మర్చిపోలేని మధుర అనుభవం, తన్మయత్వంతో యువతీ యువకులు డ్యాన్స్ చేస్తున్నారు.ట్యాంక్ బండ్ పై బతుకమ్మ కలర్ పుల్ గర్బా దాండియా కు ఏర్పాట్లు చేశారు. మరో వైపు గచ్చిబౌలి అడ్వెంచర్ పార్కులో దాండియా వేడుకలను వేడుకగా నిర్వహించనున్నారు.



 హైదరాబాద్ దాండియా ఉత్సవాలు...

నవరాత్రి దాండియా మహోత్సవంలో భాగంగా మాదాపూర్ లోని యోలో అరేనాలో లైట్ల కింద రాత్రిపూట నృత్యం చేయవచ్చని నిర్వాహకులు ప్రకటించారు.బేగంపేటలోని చిరాన్ ఫోర్ట్ క్లబ్ లో రుచికరమైన వంటకాలతో పాటు, లైవ్ షోలు, ఆహారం,పానీయాల శ్రేణితో కూడిన విస్తృతమైన దాండియా వేడుక నిర్వహించనున్నారు. జూబ్లీ హిల్స్ కన్వెన్షన్ సెంటర్ ఓపెన్-ఎయిర్ థియేటరులో ఉల్లాసంగా నృత్యకారులు డ్యాన్స్ చేయనున్నారు. సికింద్రాబాద్‌లోని ఎఏంఆర్ ప్లానెట్ మాల్‌లో డిస్కో దండియా 2025, బైరామల్‌గూడలోని ఎడులకంటి రామ్ రెడ్డి గార్డెన్స్‌లో రాస్ గర్బా వాల్యూమ్ 7 ,దాండియా మహోత్సవ్ సీజన్ 3,పీర్జాదిగూడ శ్రీ పళని కన్వెన్షన్స్, దండియా మస్తీ సీజన్ 3, ఫ్లిప్‌సైడ్ అడ్వెంచర్ పార్క్ లలో దాండియా సందడి నెలకొంది.



 విశ్వ హిందూ పరిషత్ హెచ్చరిక

తెలంగాణ విశ్వ హిందూ పరిషత్ (VHP) దాండియా నిర్వాహకులకు హెచ్చరిక జారీ చేసింది. హిందువులు కానివారిని దాండియాలో పాల్గొనడానికి అనుమతించవద్దని వీహెచ్ పీ కోరింది. ఎవరైనా నిర్వాహకులు వారిని అనుమతించడానికి ప్రయత్నిస్తే తాము అడ్డుకుంటామని విశ్వ హిందూ పరిషత్ జాతీయ ప్రతినిధి రవినూతల శశిధర్ చెప్పారు. హిందువులు కానివారు దాండియా టిక్కెట్లు కొనుగోలు చేసి, ప్రాంగణంలోకి ప్రవేశించి 'లవ్ జిహాద్'కు పాల్పడుతూ హిందూ బాలికలతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని శశిధర్ ఆరోపించారు.దాండియాలో పాల్గొనేవారికి నుదిటిపై తిలకం వేయాలని శశిధర్ కోరారు.

షీ టీమ్ లను రంగంలోకి దించండి
హైదరాబాద్ నగరంలో సాగుతున్న దాండియా వేడుకల్లో తెలంగాణ పోలీసులు షీ టీమ్ బృందాలను మఫ్టీలో రంగంలోకి దించాలని విశ్వ హిందూ పరిషత్ జాతీయ ప్రతినిధి రవినూతల శశిధర్ సూచించారు.ప్రభుత్వం ధృవీకరించిన గుర్తింపు రుజువును చూసిన తర్వాతే పాల్గొనేవారిని అనుమతించాలని కోరారు. నిర్వాహకులు బ్రీత్ ఎనలైజర్‌లను ఉపయోగించి పరీక్షలు కూడా నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు. దాండియా నిర్వాహకులు వారి ఇష్టానుసారం వ్యవహరిస్తే విశ్వ హిందూ పరిషత్ వారికి తగిన సమాధానం ఇస్తుందని ఆయన హెచ్చరించారు.



Tags:    

Similar News