బడా నేతల ఫాంహౌస్‌లపై ‘హైడ్రా’ దృష్టి

బడా నేతల కబ్జాలపై ‘హైడ్రా’ దృష్టి సారించింది. ఎన్ కన్వెన్షన్ కూల్చివేసిన తర్వాత విరామం ఇచ్చిన హైడ్రా బడా నేతల ఫాంహౌస్ లను కూల్చివేసేందుకు రంగం సిద్ధం చేసింది.

Update: 2024-08-27 10:09 GMT

హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (HYDRAA) అక్రమ కట్టడాల కూల్చివేతల కోసం దూకుడు పెంచాలని నిర్ణయించింది. హైదరాబాద్ నగరంతోపాటు శివారు ప్రాంతాల్లోనూ చెరువులు, కుంటలు, జలాశయాలు, నాలాలను ఆక్రమించి అనధికారికంగా చేసిన భవనాలు, ఫాంహౌస్ ల నిర్మాణాలను కూల్చివేసేందుకు హైడ్రా సమాయత్తం అవుతోంది. దీనిలో భాగంగా హైడ్రా కమిషనర్, ఐపీఎస్ అధికారి ఏవీ రంగనాథ్ గత మూడు రోజులుగా జీహెచ్ఎంసీ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో సమావేశమై ఆక్రమణలపై సమీక్షించారు. రెవెన్యూ, నీటిపారుదల శాఖ, జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, పోలీసు శాఖల అధికారులతో ఆక్రమణల కూల్చివేతల గురించి చర్చించారు.


హైడ్రా లక్ష్యాలపై అంతటా ఆసక్తి
నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ ను హైడ్రా కూల్చివేసిన ఘటన సంచలనం రేపింది. అనంతరం హైడ్రా తర్వాత ఎవరిని లక్ష్యం చేసిందనేది ఆసక్తికరంగా మారింది. హైడ్రా బుల్డోజర్లు ఎవరి ఫాం హౌసులను కూల్చివేసేందుకు వస్తాయోనని అందరిలో ఉత్కంఠ నెలకొంది. హైదరాబాద్ నగర శివార్లలో 50 మంది బడా నేతలు, పారిశ్రామికవేత్లల ఫాంహౌస్ లను కూల్చివేసే దిశగా హైడ్రా కార్యాచరణ ప్రణాళిక రూపొందించిందని సమాచారం.

హైడ్రా బుల్డోజర్లు, అదనపు పోలీసు బలగాలు సిద్ధం
బడా నేతల అక్రమ ఫాంహౌస్ ల కూల్చివేతల కోసం హైడ్రా బుల్డోజర్లు, అదనపు పోలీసు బలగాలను సిద్ధం చేసింది.ప్రతిపక్షం, అధికార పక్షం అని కాకుండా చెరువుల్లో నిర్మించిన అన్నీ భవనాలను నేలమట్టం చేస్తామని హైడ్రా అధికారులు చెబుతున్నారు. కేవలం ప్రతిపక్ష నేతల ఫామ్ హౌస్ ల మీదే దాడులు సాగుతున్నాయనే అపవాదు రాకుండా ఉండేందుకు కొంతమంది కాంగ్రెస్ నేతల పామ్ హౌస్ లను కూల్చాలని హైడ్రా నిర్ణయించిందని సమాచారం.

హైడ్రాకు ఎమ్మెల్యేల మద్ధతు
చెరువుల్లో కబ్జాలను తొలగించేందుకు సీఎం రేవంత్ రెడ్డి ఛైర్మన్ గా ఏర్పాటైన హైడ్రాకు పలువురు ఎమ్మెల్యేలు మద్ధతు ఇస్తున్నారు. జిల్లాల్లోనూ హైడ్రా తరహా యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం సీఎంకు లేఖ రాశారు. హైదరాబాద్ నగర శివార్లలో భూముల ధరలకు రెక్కలు రావడంతో రియల్ ఎస్టేట్ వ్యాపారులు చెరువులు, కుంటలు, నాలాలు, పార్కుల స్థలాలను కబ్జా చేసి భవనాలు నిర్మించారు.పలువురు ఎమ్మెల్యేలు హైడ్రాకు మద్ధతు ఇస్తున్నారు.

గొలుసుకట్టు చెరువులను కాపాడాలి
కాకతీయులు, నిజాం కాలం నాటి గొలుసుకట్టు చెరువులను కాపాడాల్సిన అవసరం ఉందని క్లైమెట్ కాంగ్రెస్ ప్రతినిధి డాక్టర్ లుబ్నా సర్వత్ ‘ఫెడరల్ తెలంగాణ’ చెప్పారు. జన్వాడ ఫాంహౌస్ వద్ద ఉన్న బుల్కాపూర్ నాలాను కబ్జా చేసి రోడ్డు నిర్మించారని తన సర్వేలో తేలిందని ఆమె చెప్పారు. బుల్కాపూర్ నాలాపై నే అప్రోచ్ రోడ్డు నిర్మించడంతోపాటు బఫర్ జోన్ ను కాపాడాలని ఆమె కోరారు. హైకోర్టు ఆక్రమణలను తొలగించాలని కోరింది తప్ప కూల్చవద్దు అని చెప్పలేదని ఆమె వివరించారు.

ఎంఐఎం కబ్జాలపై బుల్డోజర్లు నడిపించాలి : ఎమ్మెల్యే రాజాసింగ్
బీఆర్ఎస్ ప్రభుత్వ మద్ధతుతో చెరువును కబ్జా చేసి ఫాతిమా కళాశాల నిర్మించారని, ప్రభుత్వ భూమిలో ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ పెద్ద బంగ్లా కట్టారని వీటిపై హైడ్రా బుల్డోజర్లు నడిపించాలని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ డిమాండ్ చేశారు. 30 ఎకరాల చెరువులో 12 ఎకరాల భూమిని కబ్జా చేసి ఎంఐఎం ఫాతిమా కేజీ టు పీజీ ఫ్రీ ఎడ్యుకేషన్ కళాశాల నిర్మించారని ఎమ్మెల్యే ఆరోపించారు.

ఎఫ్‌టీఎల్ అంటే...
హైడ్రా కూల్చివేతల నేపథ్యంలో ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్ అనే పదాలు ప్రాచుర్యంలోకి వచ్చాయి. ఎఫ్‌టీఎల్ అంటే పూర్తి ట్యాంక్ స్థాయి. చెరువులో నీటి నిల్వ ఎగువ పరిమితిని సూచించే సరస్సు, ట్యాంక్ లేదా ఇతర నీటి వనరుల గరిష్ఠ నీటి స్థాయిని ఎఫ్‌టీఎల్ సూచిస్తుంది.
చెరువు బఫర్ జోన్‌
బఫర్ జోన్‌ అంటే ఎఫ్‌టిఎల్ చుట్టూ ఉన్న నిర్దేశిత ప్రాంతం. బఫర్ జోన్ యొక్క వెడల్పు సరస్సు లేదా నాలా పరిమాణం ఆధారంగా మారుతుంది. ఆక్రమణలను నిరోధించడానికి, చెరువుల చుట్టూ ఉన్న సహజ పర్యావరణ వ్యవస్థను సంరక్షించడానికి బఫర్ జోన్ కీలకం.పూర్తి ట్యాంక్ స్థాయి సరిహద్దు చుట్టూ ఉన్న బఫర్ జోన్‌గా గుర్తించారు.
రూల్ బుక్ ఏం చెబుతుందంటే...
చెరువుల రక్షిత ప్రాంతాలకు స్పష్టమైన సరిహద్దు ఉంటుంది. నీటిపారుదల,రెవెన్యూ శాఖ రూల్ బుక్ ప్రకారం ఏదైనా సరస్సు, చెరువు, రిజర్వాయర్, లేదా కుంట విస్తీర్ణాన్ని నీటిపారుదల శాఖ, రెవెన్యూ శాఖ కొలిచి ధృవీకరించాలి.మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపాలిటీ, నగర పంచాయతీ, హెచ్‌ఎండీఏ (హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ), యూడీఏ (అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ) పరిధిలో చెరువు సరిహద్దు నుంచి 50 మీటర్లలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టకూడదు.
మజ్లిస్, బీజేపీల మధ్య  వార్ 
హైడ్రా కూల్చివేతల నేపథ్యంలో మజ్లిస్ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ బండ్లగూడలోని ఫాతిమా ఒవైసీ కళాశాలను సమర్థించారు. సరస్సు ప్రాంతాన్ని ఆక్రమించారని ఆరోపిస్తూ కూల్చివేస్తామని బెదిరింపులను మజ్లిస్ ఫ్లోర్ లీడర్ అక్బరుద్దీన్ ఒవైసీ ఖండించారు. ఈ విద్యాసంస్థ వేలాది మంది విద్యార్థులకు ఉచిత విద్యను అందిస్తుందని అక్బరుద్దీన్ పేర్కొన్నారు.కాగా సల్కం చెరువులో అక్బరుద్దీన్ ఒవైసీ అక్రమ నిర్మాణాలను కూల్చివేయాలని బీజేపీ ఫ్లోర్ లీడర్ ఆలేటి మహేశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు.

ఏవీ రంగనాథ్ ఇంటి వద్ద పోలీసు భద్రత
బడా వ్యక్తులకు చెందిన అక్రమ భవనాలను హైడ్రా కమిషనర్, ఐజీ ఏవీ రంగనాథ్ కూల్చివేస్తుండటంతో అతనికి ప్రజలు మద్ధతుగా నిలవగా, కబ్జాదారులైన పెద్దలు మాత్రం వ్యతిరేకంగా ఉన్నారు. ఈ ముక్కుసూటిగా వ్యవహరిస్తూ బడా వ్యక్తులు కబ్జా చేసి నిర్మించిన భవనాలను కూల్చివేస్తున్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఐపీఎస్ ఏవీ రంగనాథ్ కు భద్రతను ఏర్పాటు చేసింది. హైదరాబాద్ నగరంలోని మధురానగర్ ప్రాంతంలో ఉన్న రంగనాథ్ ఇంటి వద్ద పోలీసు అవుట్ పోస్టును ఏర్పాటు చేశారు. అక్రమ కట్టడాలు, కబ్జాలపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ దూకుడుగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో ముప్పు పొంచి ఉందని ఇంటెలిజెన్స్ అధికారులు అందించిన సమాచారంతో ఆయన ఇంటి వద్ద భద్రత కల్పించారు.

హైడ్రాకు ప్రజల మద్ధతు : బీజేపీ ఎంపీ కొండా
మెజారిటీ ప్రజలు హైడ్రాకు మద్దతు ఇస్తున్నారని బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి చెప్పారు. “నేను ట్విట్టర్ పోల్ నిర్వహించాను. 78శాతం మంది ప్రజలు హైడ్రా కూల్చివేతలు మంచిదని భావిస్తున్నారు’’ అని ఎంపీ పేర్కొన్నారు.

Tags:    

Similar News