రైతులకు శాస్త్రవేత్తల తీపి కబురు

దేశంలో అన్నదాతలకు వాతావరణ శాస్త్రవేత్తలు శుభవార్త వెల్లడించారు. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలో 2024 సంవత్సరంలో నైరుతి రుతుపవనాల సీజన్ ఆశాజనకంగా ఉంటుందని వాతావరణశాఖ అధికారులు అంచనా వేశారు. వాతావరణ స్థితిగతులపై ఐఎండీ శాస్త్రవేత్తలు ఏం చెబుతున్నారో తెలుసుకుందాం.

Update: 2024-02-15 04:56 GMT
Rains

 2024వ సంవత్సరం వ్యవసాయ రంగానికి వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని శాస్త్రవేత్తలు తాజాగా ప్రకటించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలతోపాటు దేశంలో ఈ ఏడాది సాధారణం కంటే అధిక వర్షపాతం కురిసే అవకాశం ఉందని భారత వాతావరణశాఖ అధికారులతో పాటు శాస్త్రవేత్తలు తేల్చారు. ఈ ఏడాది జులై నెల నాటికి ఎల్ నినో స్థానంలో చల్లటి వర్షాలు కురిపించే లా నినాతో రుతుపవనాల సీజనులో అధిక వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ శాస్త్రవేత్తలు వెల్లడించారు. గత సీజన్‌లో కురిసిన వర్షపాతం కంటే కూడా ఈ ఏడాది అధిక వర్షాలు కురుస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఈ ఏడాది జులై నాటికి ఎల్ నినో బలహీన పడి లా నినా ఏర్పడటం కారణంగా దేశంలో భారీవర్షాలు కురుస్తాయని కేంద్ర భూశాస్త్రాల మంత్రిత్వ శాఖ మాజీ కార్యదర్శి మాధవన్ రాజీవన్ చెప్పారు.

ఎల్ నినో నుంచి లా నినాకు మారనున్న వాతావరణ పరిస్థితులు...

ఎల్ నినో నుంచి లా నినాకు మారే అవకాశాలు 50శాతం కంటే ఎక్కువగా ఉన్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దీనివల్ల భారతదేశవ్యాప్తంగా ఈ ఏడాది ఖరీఫ్ సీజనులో రుతుపవనాల వల్ల సమృద్ధిగా వర్షాలు కురుస్తాయని రాజీవన్ వివరించారు. ఎల్ నినో వల్ల భారత దేశంలో రుతుపవనాల ప్రభావాన్ని, వర్షపాతాన్ని తగ్గిస్తాయని, అదే లా నినా వర్షపాతాన్ని పెంచుతుందని భారతీయ వాతావరణ పరిశోధకులు చెప్పారు. ఈ ఏడాది ఆగస్టు-సెప్టెంబరు నెలల మధ్య లా నినా పరిస్థితులు అభివృద్ధి చెందడానికి 60 శాతం సంభావ్యత ఉందని యునైటెడ్ స్టేట్స్ లోని నేషనల్ ఓషియానిక్ అండ్ అట్మాస్పియరిక్ అడ్మినిస్ట్రేషన్ కూడా అంచనా వేసింది. ఎల్ నినో బలహీన పడుతుందని అమెరికా, ఐరోపా వాతావరణ సంస్థలు కూడా వెల్లడించాయి.

ఈ ఏడాది సాధారణం కంటే అధిక వర్షాలు

‘‘జులై నాటికి లా నినా అభివృద్ధి చెందడం వల్ల భారతదేశ వ్యాప్తంగా అధిక వర్షాలు కురుస్తాయని, దీనివల్ల పంటలు బాగా పడి రైతులకు మేలు జరగనుంది’’అని మాధవన్ రాజీవన్ ఎక్స్ సోషల్ మీడియాలో పోస్టు చేశారు. లా నినో ప్రభావం భారతీయ రుతుపవనాలతో పాటు ప్రపంచ వాతావరణంపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని శాస్త్రవేత్తలు అంచనా వేశారు. మొత్తంమీద లా నినా వల్ల బలమైన రుతుపవనాల ప్రభావంతో తెలుగు రాష్ట్రాలతోపాటు దేశంలో సగటు కంటే ఎక్కువ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ అధికారులు చెప్పారు.

ఈ ఏడాది రైతులకు శుభసూచకం...హైదరాబాద్ వ్యవసాయ మాజీ శాస్త్రవేత్త ఎన్‌డీ‌ఆర్‌కే శర్మ

ఈ ఏడాది సాధారణం కంటే అధిక వర్షాలు కురుస్తాయని వాతావరణ శాస్త్రవేత్తలు ప్రకటించిన నేపథ్యంలో ఖరీఫ్ సీజన్ లో రైతులకు మేలు జరుగుతుందని హైదరాబాద్ వ్యవసాయ మాజీ శాస్త్రవేత్త ఎన్‌డీ‌ఆర్‌కే శర్మ చెప్పారు. సాధారణం కంటే అధిక వర్షాలు కురవడమే కాకుండా వర్షం కురిసే రోజుల సంఖ్య పెరిగితే వ్యవసాయం మెరుగ్గా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. సకాలంలో వర్షాలు కురిస్తే దిగుబడి పెరుగుతుందని శర్మ వివరించారు.

గత ఏడాది వర్షాభావ పరిస్థితులతో నష్టపోయిన రైతులు

గత ఏడాది వర్షాభావ పరిస్థితులతో భారతదేశంలోని రైతులు తీవ్రంగా నష్టపోయారు. దేశంలో వ్యవసాయం చేయాలంటే నైరుతి రుతుపవన వర్షపాతంపై ఆధారపడుతుంటారు. గత ఏడాది ఎల్ నినో కారణంగా నైరుతి రుతుపవనాలు రైతన్నలను నిరాశకు గురిచేశాయి. ఫసిపిక్ మహా సముద్రంలో ఏర్పడిన ఎల్ నినో వల్ల లోటు వర్షపాతంతో రైతులు నష్టపోయారు. గత ఏడాది సకాలంలో రుతుపవనాలు భారతదేశంలోకి ప్రవేశించనందు వల్ల వర్షాలు కురవలేదు. దీనివల్ల పంటల సాగు కూడా ఆలస్యమైంది.

ఈ వేసవిలో ఎండలు ఎక్కువే...

గత సంవత్సరం నైరుతి రుతుపవనాల సీజనులో సాధారణ వర్షపాతం 868.6 మిల్లీమీటర్ల కంటే తక్కువగా నమోదైంది. గత ఏడాది 820 మిల్లీమీటర్ల వర్షమే కురిసింది. అయితే ఈసారి అంతకంటే మెరుగ్గా వర్షాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ఈ ఏడాది భారీ వర్షాలతోపాటు ఈ వేసవిలో ఎండల తీవ్రత కూడా ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాస్త్రవేత్తలు అంచనా వేశారు. ఈ ఏడాది తుపానుల ప్రభావం వల్ల అతి భారీవర్షాలు కూడా కురిసే అవకాశం ఉందని జాతీయ, అంతర్జాతీయ వాతావరణ శాస్త్రవేత్తలు చెప్పారు. ఈ ఏడాది ఎల్ నినోకు ముగింపుని సూచిస్తున్నాయని ఐఎండీ శాస్త్రవేత్త డాక్టర్ శివానంద పాయ్ వెల్లడించారు. ఈ వేసవిలో ఎల్ నినో కొనసాగితే గత ఏడాది కంటే ఎండలు తీవ్రంగా ఉంటాయని భారత ట్రాపికల్ మెటీరియాలజీ క్లైమేట్ సైంటిస్ట్ రాక్సీ మాథ్యు కోల్ వివరించారు. ఇప్పటికే తెలంగాణలో గరిష్ఠ ఉష్ణోగ్రత 31 నుంచి 35 డిగ్రీల సెల్షియస్ కు చేరుకుందని హైదరాబాద్ ఐఎండీ శాస్త్రవేత్త డాక్టర్ ఏ ధర్మరాజు చెప్పారు.

తెలంగాణలో రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తాం: మంత్రి తుమ్మల


 



తెలంగాణలో ఈ ఏడాది ఖరీఫ్ సీజన్ అన్నదాతలకు ఆశాజనకంగా ఉంటుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ‘ఫెడరల్ తెలంగాణ’తో చెప్పారు. ఖరీఫ్ సీజనులో వర్షాలు సాధారణం కంటే అధికంగా కురుస్తాయని ఐఎండీ శాస్త్రవేత్తలు అంచనా వేసిన నేపథ్యంలో ఈ ఏడాది పంటల సాగు మెరుగ్గా ఉండవచ్చని మంత్రి పేర్కొన్నారు. రైతులకు ఈ ఏడాది బ్యాంకుల ద్వారా రుణాలు కూడా అధికంగా ఇవ్వడంతో పాటు వారికి తమ శాఖ నుంచి సలహాలు, సూచనలు ఇస్తూ వ్యవసాయ ఉత్పత్తుల దిగుబడిని పెంచుతామని మంత్రి చెప్పారు. గురువారం నుంచి తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో మూడు రోజుల పాటు అగ్రిటెక్ సదస్సు నిర్వహిస్తున్నామని చెప్పారు. వ్యవసాయరంగంలో అధునాతన పద్ధతులను అమలు చేసి, రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వివరించారు.

Tags:    

Similar News