నేరాల పథకరచన, అమలులో బిష్ణోయ్ గ్యాంగ్ రూటే వేరు!

భిన్నమైన గ్యాంగులకు చెందిన నేరస్తులను ఎంచుకుని హత్యను చేయించటమే బిష్ణోయ్ గ్యాంగ్ ప్రత్యేకత అని ముంబాయి పోలీస్ శాఖలోని కొందరు ది ఫెడరల్‌ కు చెప్పారు.

Update: 2024-10-17 08:44 GMT

బాబా సిద్దికి హత్యతో నగరంలో 1980, 1990ల నాటి గ్యాంగ్ వార్‌లు మళ్ళీ మొదలయ్యాయేమోనని ముంబాయివాసులు గజగజా వణుకుతున్నారు. ఈ హత్య చేసింది ముగ్గురు కిరాయి హంతకులు. వీరు ముగ్గురూ వేర్వేరు రాష్ట్రాలకు, వేర్వేరు నేపథ్యాలకు చెందినవారు. వీరికి ఆయుధాలు, ఇతర సహకారం అందించినది కూడా వేర్వేరు గ్యాంగులకు చెందినవారు. భిన్నమైన గ్యాంగులకు చెందిన నేరస్తులను ఎంచుకుని హత్యను చేయించటమే బిష్ణోయ్ గ్యాంగ్ ప్రత్యేకత అని ముంబాయి పోలీస్ శాఖలోని కొందరు ది ఫెడరల్‌ కు చెప్పారు.

టార్గెట్ చేసిన వ్యక్తులను హతమార్చటానికి ఇలా వేర్వేరు చోట్లనుంచి హంతకులను కిరాయికి మాట్లాడుకుని కుట్రలు అమలు చేసే పద్ధతిని లారెన్స్ బిష్ణోయ్, అతని అనుచరులు దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలలో అనుసరిస్తున్నారని పోలీస్ వర్గాలు తెలిపాయి. హత్యకు పాల్పడ్డారని చెబుతున్న ముఠాలోని ఇద్దరు సభ్యులలో ధర్మరాజ్ కశ్యప్, శివ కుమార్ గౌతమ్ ఉత్తర ప్రదేశ్‌కు చెందినవారు, హత్యకు ముందు పూణేలో ఉంటున్నారు. వీరిద్దరినీ శుభం లోంకర్ కిరాయికి తీసుకున్నాడు, అతను కూడా ఇప్పుడు పరారీలో ఉన్నాడు. గౌతమ్‌కు గానీ, కశ్యప్‌కు గానీ క్రిమినల్ నేపథ్యం ఏమీ లేదు. పూణేలో శుభం లోంకర్, అతని సోదరుడు ప్రవీణ్ నడుపుతున్న ఒక పాల ఉత్పత్తుల దుకాణానికి సమీపంలో గౌతమ్, కశ్యప్ తుక్కు వ్యాపారం చేస్తున్నారు. ప్రవీణ్‌ను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. గౌతమ్, కశ్యప్ నడిపే తుక్కు వ్యాపారం వాస్తవానికి ఈ కేసులో మరో నిందితుడుగా ఉన్న హరీష్ నిషాద్‌ది. ఇతనిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. గౌతమ్, కశ్యప్, నిషాద్ ముగ్గురూ యూపీలోని ఒకే గ్రామానికి చెందినవారు. తుక్కు వ్యాపారంలో తనకు సాయం చేయాలని నిషాద్ తన ఊరివారైన గౌతమ్, కశ్యప్‌లను పిలిచాడు.

గౌతమ్, కశ్యప్‌లలాగా కాకుండా ఈ హత్యకేసులో మూడో నిందితుడు గుర్‌మెయిల్ బల్జీత్ సింగ్‌కు క్రిమినల్ రికార్డ్ ఉంది. ఇతను హర్యానాలోని కైతల్‌కు చెందినవాడు. ఇతనిపై మూడు కేసులు ఉన్నాయి, ఈ మూడింటిలో ఒక కేసులో - తన కజిన్ ఒకరిని హత్య చేశాడన్నది ఆరోపణ.

ఈ సింగ్‌ను హత్యకోసం కిరాయికి తీసుకున్నది జలంధర్‌కు చెందిన మహమ్మద్ యాసిన్ అఖ్తర్ అలియాస్ జీషన్ అనే గ్యాంగ్‌స్టర్ ముఠా. జీషన్ సుమారు 12 మంది నేరగాళ్ళతో తన సొంత ముఠాను నడుపుతున్నాడని పంజాబ్ పోలీస్ వర్గాలు తెలిపాయి. బిష్ణోయ్ గ్యాంగ్ రాజస్థాన్, ఢిల్లీ-ఎన్‌సీఆర్, హర్యానా, పంజాబ్, మరికొన్ని రాష్ట్రాలలో నేర కార్యకలాపాలు నడిపే ముఠాలతో వ్యూహాత్మక ఒప్పందాలు కుదుర్చుకుందని పంజాబ్ పోలీస్ శాఖలో అసిస్టెంట్ ఇనస్పెక్టర్ జనరల్‌గా పని చేస్తున్న గుర్మీత్ సింగ్ చౌహాన్ ది ఫెడరల్ కు చెప్పారు. ఈ ముఠాలు తమలో తాము పనులను పంచుకుంటూ ఉంటాయని తెలిపారు.

గతంలో గాయకుడు సిద్దు మూసేవాలా హత్యలో కూడా వేర్వేరు ముఠాలకు చెందిన హంతకులను కిరాయికి మాట్లాడుకోవటం, వేర్వేరు ముఠాలు ఆయుధాలను సమకూర్చటం, నేరం చేసిన తర్వాత హంతకులకు వేరే రాష్ట్రాలలో ఆశ్రయం ఇవ్వటం తాము గమనించామని చౌహాన్ చెప్పారు. అఖ్తర్ గతంలో బిష్ణోయ్ గ్యాంగ్ కోసం కొన్ని నేరాలు చేశాడని తెలిపారు. బిష్ణోయ్ గ్యాంగ్ లోని సౌరభ్ మహాకాల్ పోలీసులనుంచి తప్పించుకోవటానికి అఖ్తర్ ఆశ్రయం ఇచ్చాడని చెప్పారు. మహాకాల్‌ను మూసేవాలా హత్యకేసులో ప్రమేయం ఉందనే ఆరోపణలపై పోలీసులు అరెస్ట్ చేశారు.

జలంధర్‌లో ధనవంతుల ఇళ్ళలో పాలరాళ్ళు పరిచే పని చేసే తన తండ్రిని ఒకరు చితకబాదినందుకు ప్రతీకారం తీర్చుకోవటానికి అఖ్తర్ నేరస్తుడిగా మారాడు. తన తండ్రికి జరిగిన అవమానానికి ప్రతీకారం తీర్చుకోవటానికి సంఘ వ్యతిరేక శక్తులతో చేతులు కలిపాడని, ఆ ప్రతీకారం తీర్చుకున్న తర్వాత సంఘ వ్యతిరేక కార్యకలాపాలలో పూర్తిగా కూరుకుపోయాడని చౌహన్ చెప్పారు. జైలుకు వెళ్ళిన తర్వాత పెద్ద నేరస్తుడిగా మారిపోయాడని తెలిపారు. పటియాలా జైలులో అఖ్తర్, గుర్‌మెయిల్ బల్జిత్ సింగ్ కలుసుకున్నారని తెలిపారు.

విదేశాలనుంచి కార్యకలాపాలు నిర్వహించే బిష్ణోయ్ ముఖ్య అనుచరులు బాబా సిద్దికి హత్య విషయంలో లోంకర్, అఖ్తర్‌లను వినియోగించుకుని కుట్రను రచించారు. సిద్దికిని హత్య చేసింది తామేనని ఫేస్‌బుక్‌లో ప్రకటించినది శుభం లోంకరే. గతంలో సల్మాన్ ఖాన్ ఇంటివద్ద కాల్పుల ఘటనకు సంబంధించి లోంకర్‌ను ముంబాయి పోలీసులు విచారణ జరిపారు. అయితే సరైన ఆధారాలు లేకపోవటంతో వదిలేశారు.

Tags:    

Similar News