ముందే మార్కెట్‌లోకి వచ్చిన మామిడిపండ్లు..ధర తెలిస్తే షాకవుతారు

నోరూరించే తియ్యటి మామిడిపండ్లు ఈ ఏడాది హైదరాబాద్ మార్కెట్‌లోకి ముందే వచ్చేశాయి. మామిడిపండ్ల దిగుబడి తగ్గడంతో వీటి ధర ఆకాశన్నంటుతోంది.

Update: 2024-02-27 15:26 GMT
MANGOS

మామిడిపండ్లు ఈ ఏడాది హైదరాబాద్ మార్కెట్‌లోకి ముందే వచ్చేసినా వీటి ధరలు చూస్తే మాత్రం షాక్ కొట్టేలా ఉన్నాయి. సాధారణంగా మామిడిపండ్లు మార్చి నెల చివరి వారంలో లేదా ఏప్రిల్ నెల ప్రారంభంలో హైదరాబాద్ మార్కెటుకు వస్తుంటాయి. కానీ ఈ సంవత్సరం సాధారణం కంటే ముందే నగర మార్కెట్‌లోకి మామిడిపండ్లు రావడంతో మామిడి ప్రియులు ఆనందపడుతున్నారు. ఐరన్, యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు సమృద్ధిగా ఉన్న ఈ మామిడి పండ్ల ధర ఈ ఏడాది అనూహ్యంగా పెరిగింది.విటమిన్ సి అధికంగా ఉండటంతోపాటు రోగనిరోధక శక్తిని పెంచే ఈ పండ్లకు గిరాకీ బాగానే ఉంది. మామిడిపండ్లలో విటమిన్ ఎ బీటా-కెరోటిన్ రూపంలో ఉంది. ప్రస్థుతం హైదరాబాద్ నగరంలో కిలో మామిడిపండ్ల ధర రూ.450 రూపాయల వరకు పలుకుతోంది.


తగ్గనున్న మామిడిపండ్ల ధరలు
పండ్లలోనే రారాజుగా పిలిచే మామిడిపండ్లు మార్కెట్ లోకి వచ్చాయంటే చాలు జనం వీటిని ఎగబడి కొంటుంటారు. హైదరాబాద్ మార్కెట్‌కు మామిడి పండ్ల రాక మరింత ఎక్కువ కావడంతో ధరలు తగ్గే అవకాశం ఉంది. మార్కెట్ కు వచ్చే మామిడిపండ్ల లారీల సంఖ్య పెరిగితే ధరలు తగ్గుతాయని హైదరాబాద్ పండ్ల మార్కెట్ అధికారులు చెప్పారు.మామిడి పండ్ల సరఫరా పెరగడంతో ధరలు ఆటోమేటిక్‌గా పడిపోతాయని ఓ వినియోగదారుడు రాపోలు సతీష్ చెప్పారు. ఏప్రిల్‌లో మార్కెట్‌లకు వివిధ రకాల మామిడి పండ్లు వచ్చినప్పుడు ధరలు బాగా తగ్గుతాయని వినియోగదారులు అంటున్నారు.

మామిడి రకాలను బట్టి మారుతున్న ధరలు
మామిడి పండ్ల రకాలను బట్టి మార్కెట్ లో ధరలున్నాయి. మామిడిపండ్లలో మేలు రకమైన హిమాయత్ రకం కిలో రూ.400 నుంచి 450 రూపాయల దాకా విక్రయిస్తున్నారు. అత్యంత తీపిగా ఉండే మామిడి రసాలు కిలో రూ.200 నుంచి 250 రూపాయల వరకు ధర పలుకుతోంది. బెనిషన్ రకం కిలో రూ.150 నుంచి 200 రూపాయలకు విక్రయిస్తున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో అధికంగా పండించే బంగినపల్లి మామిడి అంటే ప్రజలు ఇష్టంగా తింటుంటారు. దీంతో పాటు నీలం, చందూరా, రుమానియా, మల్గోవా, చక్కెర కట్టి, గిర్ కేసర్ మామిడి,అంటు మామిడి లేక చిలక ముక్కు మామిడి లేక బెంగుళూరు మామిడి అనే రకాలున్నాయి. చిన్నారుల నుంచి పెద్దల వరకు వేసవికాలం వచ్చిందంటే చాలు తేనేలూరించే మామిడిపండ్లను ఇష్టంగా తింటుంటారు. బంగినపల్లి, సువర్ణరేఖ, తోతాపురి మామిడి రకాలకు మార్కెట్ లో డిమాండు అధికంగా ఉంది. డిమాండు ఉన్న మామిడి రకాలకు ధర కూడా అధికంగా పలుకుతోంది.

మామిడిపండ్ల ఎగుమతి అధికం
మన రెండు తెలుగు రాష్ట్రాల నుంచి మామిడి పండ్లను అధికంగా విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు. ఆర్గానిక్ పద్ధతిలో పండించిన మామిడికాయలకు ప్రపంచవ్యాప్తంగా గిరాకీ ఉండటంతో ఎక్కువగా రైతులు ఎగుమతి చేస్తున్నారు. మేలైన మామిడి రకాలను ఎగుమతి చేస్తుండటంతో వీటి ధరలు కూడా పెరిగాయి. భారతదేశం నుంచి 27,872.78 మెట్రిక్ టన్నుల మామిడి పండ్లను 2021-22వ సంవత్సరంలో ఎగుమతి చేశారు. యూకే, ఖతార్, ఒమన్, యూఏఈ దేశాలకు 327.45 కోట్ల విలువగల మామిడిపండ్లను ఎగుమతి చేసినట్లు కేంద్ర వాణిజ్యశాఖ గణాంకాలు చెబుతున్నాయి. దేశంలో మామిడిపండ్ల దిగుబడిలో 16.07 శాతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి వస్తున్నాయి. తెలంగాణలో 8.54 శాతం మామిడిపండ్ల దిగుబడి ఉందని కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని హార్టికల్చర్ బోర్డు గణాంకాలు చెబుతున్నాయి.

మామిడి తోటల సాగులో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానం
మామిడి తోటల సాగులో తెలంగాణ కంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అగ్రస్థానంలో ఉంది. మామిడి సాగులోనే కాకుండా దిగుబడిలోనూ ఆంధ్రప్రదేశ్ రెండవ స్థానంలో ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీకాకుళం నుంచి చిత్తూరు దాకా పలు జిల్లాల్లో మామిడి తోటలున్నాయి. తెలంగాణ రాష్ట్రంలోని ఆదిలాబాద్, ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో రైతులు ఈ తోటలను సాగు చేస్తున్నారు. తెలంగాణలోని హైదరాబాద్ శివారు ప్రాంతాలతోపాటు పలు జిల్లాల్లో రియల్ ఎస్టేట్ రంగం పుంజుకోవడంతో తోటల సాగు తగ్గింది. దీనికి తోడు ఈ ఏడాది సజావుగా వర్షాలు కురవక పోవడంతోపాటు పూత రాలి పోవడం వల్ల మామిడి దిగుబడి తగ్గవచ్చని తెలంగాణ వ్యవసాయ శాఖ మాజీ శాస్త్రవేత్త ఎన్డీఆర్కే శర్మ ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. ప్రస్తుతం మామిడి పండ్లను పండించడానికి రసాయనాలు, క్రిమిసంహారక మందులు కూడా ఉపయోగిస్తున్నారు. అలా పండించిన పండ్లు ఎగుమతికి అనుమతించడం లేదు.


Tags:    

Similar News