తెలంగాణకు సండే అలెర్ట్...

తెలంగాణ16 జిల్లాల్లో ఆదివారం ఉరుములు,మెరుపులు,ఈదురు గాలులతో కూడిన వర్షం

Update: 2024-06-09 01:40 GMT
తెలంగాణలో రుతువవనాల ప్రభావంతో విస్తారంగా కురుస్తున్న వర్షాలు


తెలంగాణలోని 16 జిల్లాల్లో ఈ ఆదివారం ఉరుములు,మెరుపులు,ఈదురు గాలులతో  దద్దరిల్లుతుంది. వాటితో వర్షం కురుస్తుంది.  గాలి వేగం గంటకు 30నుంచి 40 కిలోమీటర్లతో కూడి ఉంటుంది.  తెలంగాణ రాష్ట్రంలోని నిర్మల్,నిజామాబాద్, నల్గొండ, సూర్యాపేట్,యాదాద్రి భువనగిరి,హెైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, రంగారెడ్డి,వికారాబాద్,సంగారెడ్డి,మెదక్,కామారెడ్డి,మహబూబ్ నగర్,నాగర్ కర్నూల్, వనపర్తి,నారాయణపేట్,జోగులాంబ గద్వాల జిలాల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉంది.


ఆదివారం తెలంగాణ రాష్ట్రంలోని వికారాబాద్,మహబూబ్ నగర్,వనపర్తి,నారాయణపేట్ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం డైరెక్టర్ నాగరత్న ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు.

తెలంగాణకు రెయిన్స్ ఎలెర్ట్

- వికారాబాద్,మహబూబ్‌నగర్,వనపర్తి,నారాయణపేట జిల్లాల్లో ఆదివారం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో ఎల్లో అలర్ట్‌ను జారీ చేసినట్లు వాతావరణ శాఖ తెలిపింది.

- జూన్ 10వతేదీన సోమవారం ఉరుములు,మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు తెలంగాణలోని పలు జిల్లాల్లో కురిసే అవకాశం ఉందని ఐఎండీ అధికారులు చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలోని వికారాబాద్,సంగారెడ్డి,మహబూబ్ నగర్,వనపర్తి,నారాయణపేట్ జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
- తెలంగాణలో నైరుతి రుతుపవనాలు వేగం పుంజుకోవడంతో 20 జిల్లాల్లోని 320 మండలాల్లో అధిక వర్షపాతం నమోదైంది. ఈ సీజన్‌లో జూన్ 1వతేదీ నుంచి ఐదు జిల్లాల్లోని 73 మండలాల్లో అధిక వర్షపాతం నమోదైంది.
- జూన్ 1వ తేదీ నుంచి 8వతేదీ వరకు రాష్ట్రంలో కురిసిన వర్షపాతం సాధారణ వర్షపాతం 22 మిల్లీమీటర్లు కాగా, 47.7 మిల్లీమీటర్లు నమోదైందని తెలంగాణ డెవలప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ తన నివేదికలో పేర్కొంది.
- తెలంగాణ రాష్ట్రంలో ఈ నెల 11వతేదీన తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ అధికారులు అంచనా వేశారు.

భారీవర్షాలతో నీటమునిగిన అంగన్ వాడీ కేంద్రం
శనివారం సాయంత్రం 4 గంటల వరకు వికారాబాద్‌లోని కాశీంపూర్‌లో అత్యధికంగా 85.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఆ తర్వాత భద్రాద్రి కొత్తగూడెంలోని సీతారాంపట్నంలో 46 మిల్లీమీటర్ల వర్షపాతం కురిసింది.షాద్‌నగర్‌లోని నెహ్రూ కాలనీలోని అంగన్‌వాడీ కేంద్రం వర్షపు నీటితో నిండిపోయింది.వర్షపు నీటితో నిండిపోవడంతో మందులు, ఇతర వస్తువులు నీట మునిగాయి. స్థానికులు ఆశా వర్కర్లను అప్రమత్తం చేయడంతో వారు వెంటనే కేంద్రానికి చేరుకుని బకెట్ల సాయంతో నీటిని బయటకు తోడారు.

ఏపీలో జులైలో భారీవర్షాలు
ఎల్ నినో ముగింపు సందర్భంగా జులై, ఆగస్టు,సెప్టెంబర్‌లో భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ అధికారులు ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు మందగించాయి.ఏపీలో జూన్,జులై నెలల్లో లోటు వర్షపాతం నమోదవుతుందని ఐఎండీ వర్గాలు తెలిపాయి.ఈ లోటును భర్తీ చేయడానికి ఆగస్టు, సెప్టెంబర్‌లలో భారీ వర్షాలు కురుస్తాయని విశాఖలోని వాతావరణ కేంద్రం అధికారులు చెప్పారు.గత రెండు రోజులుగా ఏపీలోని ఏ ప్రాంతంలోనూ వర్షాలు కురవలేదని అమరావతి ఐఎండీ సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ ఎస్.కరుణాసాగర్ తెలిపారు.

సాధారణం కంటే అధిక వర్షాలు
రుతుపవనాలు మొత్తం రాయలసీమను, కోస్తా ఆంధ్ర ప్రదేశ్‌లో దాదాపు 95 శాతం విస్తరించాయని ఆయన చెప్పారు.మొత్తం మీద ఏపీలో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. గతేడాది జూన్ 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం 454.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.

తెలంగాణ ఆరోగ్య మంత్రిత్వ శాఖ హెచ్చరికల జారీ
వర్షాకాలంలో ఎదురయ్యే ఆరోగ్య సమస్యలను అధిగమించేందుకు తెలంగాణ రాష్ట్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ ముందస్తు హెచ్చరికలను జారీ చేసింది. హైదరాబాద్ నగరంలో కురుస్తున్న వర్షాలను దృష్టిలో ఉంచుకుని ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్ మాన్ సూన్ అడ్వైజరీని విడుదల చేశారు.అంగన్‌వాడీలు, ఆశా కేంద్రంలో ఐవీ ద్రవాలు, అవసరమైన మందులు, ఓఆర్ఎస్ సాచెట్‌లను అందుబాటులో ఉంచారు.

అంటువ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు
తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. దీనివల్ల తేమ వివిధ వైరల్ ఇన్‌ఫెక్షన్‌లతోపాటు దోమలు,ఆహారం, నీటి ద్వారా సంక్రమించే వ్యాధులు ప్రబలే ప్రమాదముందని వైద్యులు హెచ్చరించారు. రుతుపవన సంబంధిత అంటువ్యాధులు ప్రబలవచ్చని వైద్యులు తెలిపారు.
- దోమల సంతానోత్పత్తి సమయంలో ఉదయం, సాయంత్రం తలుపులు, కిటికీలను దోమ తెరలతో మూసి ఉంచాలని సూచించారు.
- దోమలు వ్యాప్తి చెందకుండా మంచాలు, నీటి ట్యాంకులకు దోమతెరలతో కప్పి ఉంచాలి. దోమల నివారణకు క్రిమిసంహారక మందులను స్ప్రే చేయాలి.
- చేతులు, కాళ్లను కప్పి ఉంచేలా లేత రంగు దుస్తులు ధరించాలి.
- బయటకు వెళ్లే ముందు ముఖ్యంగా తెల్లవారుజాము, సాయంత్రం సమయంలో దోమలు కుట్టకుండా క్రీమ్‌లు,లోషన్లను వాడాలి.
- దోమలు వృద్ధి చెందకుండా సెప్టిక్ ట్యాంక్‌లను మెష్‌తో కప్పాలి.
- ఎల్లప్పుడూ ఇంట్లో ఫిల్టర్, వేడిచేసిన నీటిని తాగాలి
- ముఖ్యంగా భోజనానికి ముందు, వాష్‌రూమ్‌కు వెళ్లిన తర్వాత తరచుగా చేతులు కడుక్కోవాలి.
- బయటి ఆహారం కంటే తాజాగా ఇంట్లో వండిన ఆహారాన్ని తీసుకోవాలి. వీలైనంత వరకు మిగిలిపోయిన ఆహార పదార్థాలను తినవద్దు.
- తరచుగా చేతులు కడుక్కోండి. అలాగే హ్యాండ్ శానిటైజర్లను తరచుగా వాడండి.
- ఆరోగ్య అత్యవసర పరిస్థితుల్లో 108 అంబులెన్స్‌కు కాల్ చేయండి.


Tags:    

Similar News