తెలంగాణలో వన్‌ ఎమ్మెల్యే, వన్‌ పెన్షన్‌ విధానానికి తూట్లు

తెలంగాణలో వన్‌ ఎమ్మెల్యే, వన్‌ పెన్షన్‌ విధానానికి తిలోదకాలు ఇచ్చారు. తెలంగాణలో మాత్రం దీనికి విరుద్ధంగా మాజీ ఎమ్మెల్యేలు అధిక పెన్షన్ పొందుతున్నారు.

Update: 2024-03-21 07:52 GMT
Telangana Assembly

తెలంగాణలో ఒక ఎమ్మెల్యే...ఒక పెన్షన్ విధానానికి విరుద్ధంగా మాజీ ఎమ్మెల్యేలకు టర్మ్‌లను బట్టి అధిక పెన్షన్ పొందుతున్నారు. చట్టాలు చేసే వారు అధికారం ఉంది కదా అని తమకు అనుకూలంగా తెలంగాణ పెన్షన్ సవరణ చట్టం 2021 పేరిట తీసుకువచ్చి మాజీ శాసనసభ్యులకు చెల్లించే పెన్షన్లను అనూహ్యంగా పెంచుకున్నారు. గతంలో ఎమ్మెల్యేలకు కనీస పెన్షన్ నెలకు రూ.30వేలు ఇచ్చేవారు. అనంతరం 2021 పెన్షన్ సవరణ చట్టం ప్రకారం మాజీ శాసనసభ్యులు 2021వ సంవత్సరం మార్చి 30వతేదీ నుంచి పెన్షన్ ను నెలకు రూ.50వేలకు పెంచారు. ఒక టర్మ్ కంటే ఎక్కువ సార్లు పనిచేసిన శాసనసభ్యులకు ఒక శాసనసభ్యుడి పెన్షన్ ఒక టర్మ్ లేదా అందులో కొంత భాగం పనిచేస్తే అలాంటి వారికి కనీసం నెలకు రూ.50వేల పెన్షన్ ఇస్తున్నారు. అయితే కొందరు ఎమ్మెల్యేలు రెండుసార్లు, మూడుసార్లు, నాలుగు సార్లు శాసనసభ్యులుగా పనిచేసిన వారికి వారు ఎమ్మెల్యేగా పనిచేసిన కాలానికి ఏడాది రెండువేల రూపాయల చొప్పున అదనంగా పెన్షన్ ఇస్తున్నారు. మాజీ ఎమ్మెల్యేలకు చెల్లించే పింఛన్లతోపాటు వైద్య బిల్లుల పరిమితిని పెంచుతూ రూపొందించిన సవరణ బిల్లులను గతంలో తెలంగాణ శాసనసభ ఆమోదించింది. ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేల వైద్య బిల్లులకు సంబంధించి ప్రభుత్వం చెల్లించే మొత్తాన్ని రూ.లక్ష నుంచి 10 లక్షలకు పెంచారు.


మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు పెన్షన్లు
మాజీ ఎమ్మెల్యేలకు భారీగా పెన్షన్లు ఇచ్చేందుకు ప్రజాధనాన్ని వెచ్చించాల్సి వస్తోంది. నెలకు మాజీ ఎమ్మెల్యేల గరిష్ఠ పెన్షన్ నెలకు రూ.70వేలుగా ఉంది. మాజీ శాసనసభ్యుల జీవిత భాగస్వామి జీవించి ఉంటే వారికి కనీస పెన్షన్ నెలకు రూ.50వేలు, గరిష్ఠ పెన్షన్ రూ.70వేలు చెల్లిస్తున్నారు. అసలే అప్పులతో అల్లాడుతున్న తెలంగాణ రాష్ట్రంలో శాసనసభ్యుల భారీ పెన్షన్ల పంపిణీ అదనపు భారంగా మారింది. తెలంగాణలోని 34 జిల్లాల్లో 245 మంది మాజీ ఎమ్మెల్యేలు, 52 మంది ఎమ్మెల్సీలు, 62 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల జీవిత భాగస్వాములు పెన్షన్లు పొందుతున్నారు.

పంజాబ్ రాష్ట్రంలో ఒకే పెన్షన్
వన్‌ ఎమ్మెల్యే, వన్‌ పెన్షన్‌.. ఎన్నిసార్లు ఎన్నికైనా ఒకే పెన్షన్ వన్‌ ఎమ్మెల్యే అనే విధానాన్ని పంజాబ్ రాష్ట్ర ఆప్ ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ మాన్ తీసుకువచ్చి సంచలనం సృష్టించారు. ఎమ్మెల్యేల ఫ్యామిలీ పెన్షన్‌లోనూ కోత విధిస్తున్నట్టు మాన్ ప్రకటించారు. తెలంగాణలో పలువురు ఎమ్మెల్యేలు ఒకసారికి మించి ఎమ్మెల్యేలుగా ఎన్నిక అవుతుండటంతో వారి పదవీ కాలం ముగిసిన ప్రతీసారి వారికి కొంత మొత్తం పెన్షన్‌ ఇస్తుననారు. మాజీ ఎమ్మెల్యేల్లో కొందరు ఎంపీలుగానూ పనిచేశారు. వారు పార్లమెంట్‌ సభ్యుడి పదవీకాలం ముగిశాక ఆ పెన్షన్‌ కూడా పొందున్నారు. కొందరు మాజీ ఎమ్మెల్యేగా పెన్షన్‌, ఎంపీగా కూడా రెండో పెన్షన్‌ తీసుకుంటున్నారు.

ఒక ఎమ్మెల్యే...ఒక పెన్షన్ పొందాలి : డాక్టర్ పెంటపాటి పుల్లారావు
ఎమ్మెల్యేలైనా, ఎంపీలుగా పనిచేసినా వారి పదవీకాలం ముగియగానే ఒక వ్యక్తి...ఒక పెన్షన్ విధానం అమలు చేయాలని ప్రముఖ ఆర్థికవేత్త, సామాజిక విశ్లేషకులు డాక్టర్ పెంటపాటి పుల్లారావు ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. మాజీ ఎమ్మెల్యేలు అయినా సామాన్య ఉద్యోగులైనా పెన్షన్ విషయంలో ఒకే విధానం ఉండాలని ఆయన సూచించారు. పెన్షన్ల విషయంతో పాటు మంత్రులు హైదరాబాద్ నగరం నుంచి తరచూ రాజకీయ కార్యకలాపాలపై ఢిల్లీకి విమానాల్లో వెళ్లి వస్తూ అక్కడ ఒక్క కేంద్ర అధికారి, లేదా కేంద్రమంత్రిని కలిసి ఢిల్లీ రాజకీయ పర్యటనను కాస్తా అధికారిక పర్యటన అని చూపిస్తూ విమాన చార్జీలను తెలంగాణ ప్రభుత్వం నుంచి పొందుతున్నారని పెంటపాటి పుల్లారావు చెప్పారు. రాజకీయ విమాన పర్యటనలకు తెలంగాణ ప్రజా ధనాన్ని ఎలా వెచ్చిస్తారని ఆయన ప్రశ్నించారు.

త్వరలో పిల్ వేస్తాం : ఫోరం పర్ గుడ్ గవర్నెన్స్ కార్యదర్శి సోమ శ్రీనివాసరెడ్డి

ఒన్ ఎమ్మెల్యే లేదా ఎంపీ ఒన్ పెన్షన్ విధానం అమలు చేయాలని కోరుతూ తాము హైకోర్టులో త్వరలో ప్రజాప్రయోజన వ్యాజ్యం వేస్తామని ఫోరం పర్ గుడ్ గవర్నెన్స్ కార్యదర్శి సోమ శ్రీనివాసరెడ్డి ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. ప్రైవేటు ఉద్యోగి పదవీ విరమణ చేస్తే వారికి పీఎఫ్ ఇచ్చే పెన్షన్ తప్ప వృద్ధ్యాప్య పెన్షన్ కూడా పొందకూడదు. ఒకరికి ఒకే పెన్షన్ పద్ధతి పకడ్బందీగా అమలు చేయాలని తాము పోరాడుతామని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేసి పదవీవిరమణ చేశాక ఎమ్మెల్యే లేదా ఎంపీ అయితే వారు రెండు పెన్షన్లు పొందకుండా ఒకే పెన్షన్ పొందేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సి ఉందని సోమ శ్రీనివాసరెడ్డి వివరించారు.

హేతుబద్ధతకు భిన్నంగా ఎమ్మెల్యేల పెన్షన్లు :ఆర్థికశాస్త్రవేత్త జి. పాపారావు
ప్రజలకు సేవ చేస్తామని చేతులు జోడించి నేతలు ఎన్నికల సమయంలో ఓట్లు అడుగుతారని, ఎన్నికయ్యాక లక్షల రూపాయల పెన్షన్‌ అందుకుంటున్నారు. పలువురు ఎమ్మెల్యేలు ఒకసారికి మించి ఎమ్మెల్యేలుగా ఎన్నిక అవుతుండటంతో.. పదవీ కాలం ముగిసిన ప్రతీ సారి వారికి కొత్తగా అదనపు పెన్షన్‌ కలుస్తోంది. చట్టాలు చేసే వారు తమకు అనుకూలంగా వాటిని మలుచుకునే తెలంగాణ పెన్షన్ సవరణ చట్టం 2021 చేయడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు తెలంగాణకు చెందిన ఆర్థికశాస్త్రవేత్త జి పాపారావు ప్రశ్నించారు. ప్రభుత్వ ఉద్యోగుల్లా కాకుండా హేతుబద్ధతకు భిన్నంగా మాజీ ఎమ్మెల్యేలు భారీగా డబుల్ పెన్షన్లు పొందడం సబబు కాదని పాపారావు చెప్పారు. కోట్లాది రూపాయలను వెచ్చించి ప్రజాప్రతినిధులుగా ఎన్నికయ్యే ప్రజాప్రతినిధులకు అసలు పెన్షన్ అవసరం ఏముందని ఆయన ప్రశ్నించారు. ప్రజలకు సేవ చేయాలి తప్ప, తాము ఎమ్మెల్యేగా చేశామని పెన్షన్ల రూపంలో ప్రజాధనాన్ని పొందరాదని ఆయన వివరించారు.

మాజీ శాసనసభ్యులకు పెన్షన్ ఒక టర్మ్‌కే పరిమితం చేయాలి : యం పద్మనాభరెడ్డి
మాజీ శాసనసభ్యులకు పెన్షన్ ఒక టర్మ్‌కే పరిమితం చేయాలని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ అధ్యక్షులు యం పద్మనాభరెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేర తెలంగాణ రాష్ట్ర చీఫ్ సెక్రటరీ ఎ శాంతికుమారికి ఫోరం పర్ గుడ్ గవర్నెన్స్ పక్షాన వినతిపత్రాన్ని పద్మనాభరెడ్డి సమర్పించారు. మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఇచ్చే పెన్షన్ ల విషయంలో తక్షణం చర్యలు తీసుకొని వన్ ఎమ్మెల్యే...వన్ పెన్షన్ విధానాన్ని తీసుకురావాలని ఆయన సూచించారు.

శాసనసభ్యులకు జీతం తక్కువైనా అలవెన్సులు అధికం
తెలంగాణలో శాసనసభ్యులకు ప్రభుత్వం నెలకు రూ.20వేల జీతం మాత్రమే చెల్లిస్తోంది. శాసనసభ్యుల జీతం తక్కువైనా అలవెన్సులు మాత్రం అధికం. నియోజకవర్గం అలవెన్సు కింద ఒక్కో ఎమ్మెల్యేకు నెలకు రూ.2,30,000 చెల్లిస్తున్నారు. దీంతోపాటు హైదరాబాద్ నగరంలోని లెజిస్లేచర్ హాస్టల్ అయిన ఎమ్మెల్యే క్వార్టర్స్ లో మూడు బెడ్రూంల ఫ్లాట్ వసతి కల్పించారు. ఎమ్మెల్యేలకు నివాస క్వార్టర్ కేటాయించడమే కాకుండా ఆ ఫ్లాట్ కు అయ్యే విద్యుత్, మంచినీటి చార్జీలను కూడా ప్రభుత్వమే ప్రజాధనంతో చెల్లిస్తోంది. ఎమ్మెల్యేల రెసిడెన్స్ కం క్యాంపు ఆఫీసు విద్యుత్, వాటర్ బిల్లులను లెజిస్లేచర్ సెక్రటేరియట్ చెల్లిస్తోంది. ఒకవేళ శాసనసభ్యులు హాస్టల్ లో వసతి వద్దనుకుంటే వారు నెలకు నివాస అలవెన్సు కింద రూ.25వేలు పొందవచ్చు. దీంతోపాటు శాసనసభ, శాసనమండలి సమావేశాలు జరుగుతున్నపుడు సభ్యులు సభకు హాజరైతే వారికి రోజుకు డీఏ కింద వెయ్యిరూపాయలు ఇస్తున్నారు. దీంతో పాటు సభ్యులు సమావేశాలకు వచ్చినపుడు రాక,పోకలకు ట్రావెలింగ్ అలవెన్సు కూడా ఇస్తున్నారు.

ఏడాదికి 70వేల కిలోమీటర్ల దూరం రైలు ప్రయాణ సౌకర్యం
మంత్రులు, స్పీకర్, డిప్యూటీ స్పీకర్, ప్రతిపక్ష నాయకుడు, ప్రభుత్వ చీఫ్ విప్, విప్ మంత్రులకు సంవత్సరానికి 70,000 కిలోమీటర్ల దూరం రైళ్లలో ఫస్ట్ క్లాస్ తరగతిలో ప్రయాణం చేసేందుకు వీలుగా ట్రావెల్ సౌకర్యం కల్పించారు.శాసనసభ్యులు, వారి జీవిత భాగస్వామికి టీఎస్ ఆర్టీసీ బస్సు్లో ఉచిత ప్రయాణానికి అనుమతి ఉంది. శాసనసభ్యులు, వారి కుటుంబ సభ్యులకు వైద్య సౌకర్యాలు కల్పించారు. సభ్యులు కారు కొనుగోలుకు రూ.30లక్షలు కేవలం 4 శాతం వడ్డీపై అడ్వాన్సును ప్రభుత్వం చెల్లిస్తోంది.
ప్రజాధనంతో ఇన్ని సౌకర్యాలు పొందుతున్న ప్రజాప్రతినిధులు ప్రజల అభివృద్ధి, సంక్షేమానికి ఏమేర పనిచేస్తున్నారన్నది ప్రశ్నార్థకంగా మారింది.








Tags:    

Similar News