బిగ్ ఫైట్ : సీఎం సిట్టింగ్ స్థానం మల్కాజిగిరిలో త్రిముఖ పోరు

మల్కాజిగిరి లోక్‌సభ సీఎం రేవంత్ రెడ్డి సిట్టింగ్ స్థానం.ఈ హాట్ సీటులో మరోసారి పాగా వేసేందుకు కాంగ్రెస్ యత్నిస్తుండగా, మరో వైపు బీఆర్ఎస్, బీజేపీలు ఆశలు పెట్టుకున్నాయి.

Update: 2024-03-14 07:53 GMT
Malkajigiri

హాట్ సీటుగా మారిన సీఎం రేవంత్ రెడ్డి సిట్టింగ్ స్థానమైన మల్కాజిగిరి పార్లమెంటును ఈ సారి ఎన్నికల్లో ఎలాగైనా కైవసం చేసుకోవాలని అధికార కాంగ్రెస్ పార్టీ కృతనిశ్చయంతో ఉంది. సీఎం సిట్టింగ్ సీటు కావడంతో బీఆర్ఎస్, బీజేపీ కూడా దృష్టి సారించాయి. దీంతో మూడు పార్టీల బలమైన అభ్యర్థుల మధ్య బిగ్ ఫైట్ రాజుకుంది.

నాగర్ కర్నూల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలైన బడా వ్యాపారవేత్త మర్రి జనార్దన్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ తీర్థం ఇచ్చి అతన్ని మల్కాజిగిరి ఎంపీ బరిలో దించాలని ఆ పార్టీ యోచిస్తోంది. ఇందులో భాగంగా మర్రితో గత కొంత కాలంగా కాంగ్రెస్ నేతలు రహస్య మంతనాలు సాగిస్తున్నారని సమాచారం. మర్రి సొంత పట్టణమైన నాగర్ కర్నూలు మున్సిపాలిటీలో అతని అనుచరులైన ఏడుగురు బీఆర్ఎస్ కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీలో చేరారు. దీంతో మర్రి కూడా కాంగ్రెస్ పార్టీలో చేరి మల్కాజిగిరి నుంచి పోటీ చేయనున్నారని కాంగ్రెస్ పార్టీ నేతలు చెబుతున్నారు.


అభయ హస్తం హామీల అమలు
కాంగ్రెస్ పార్టీకి చెందిన సీఎం సిట్టింగ్ స్థానం కావడంతో పాటు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండటం, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గత ఎన్నికల్లో ఓటర్లకు ఇచ్చిన అభయహస్తం హామీలను నెరవేర్చడం లాంటివి తమ పార్టీకి పార్లమెంట్ ఎన్నికల్లో విజయం చేకూర్చిపెడతాయని ఈ నియోజవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. మల్కాజిగిరిలో కాంగ్రెస్ పక్షాన తుమ్మల నాగేశ్వరరావు సన్నాహక సమావేశాలు నిర్వహిస్తూ ముందుకు సాగుతున్నారు. కాంగ్రెస్ రూలింగ్ గవర్నమెంట్, సీఎం రేవంత్ ప్రభావం, అభయ హస్తం హామీల అమలుతో కాంగ్రెస్ పార్టీకి పరిస్థితులు అనుకూలంగా ఉండవచ్చని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు.

బీఆర్ఎస్ నేతల ధీమా
మల్కాజిగిరి పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో మేడ్చల్, మల్కాజిగిరి, కుత్బుల్లాపూర్, కూకట్‌పల్లి, ఉప్పల్, ఎల్బీనగర్, సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలోనూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలున్నారు. మేడ్చల్, మల్కాజిగిరి సెగ్మెంట్లలో ఒకే కుటుంబానికి చెందిన మల్లారెడ్డి, రాజశేఖర్ రెడ్డిలు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి కేపీ వికేకానంద 85,400 ఓట్ల ఆధిక్యత సాధించి రికార్డు నెలకొల్పారు. ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో తమకున్న బలంతో ఈ సారి మల్కాజిగిరి తమ పార్టీ కైవసం చేసుకుంటుందని ఉప్పల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ధీమా వ్యక్తం చేశారు.

అసెంబ్లీ ఫలితాలు పునరావృతం అయ్యేనా?
మల్లారెడ్డి కుమారుడు భద్రారెడ్డికి బీఆర్ఎస్ టిక్కెట్టు ఇస్తామని చెప్పినా, అక్రమంగా నిర్మించిన కళాశాల భవనాన్ని కూల్చివేసిన నేపథ్యంలో మల్లారెడ్డి కుమారుడు ఎన్నికల బరిలో నిలబడనని ప్రకటించారు.దీంతో కేసీఆర్ టీఆర్ఎస్ రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడిగా మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షుడిగా పనిచేసిన ఎమ్మెల్సీ శంబీపూర్ రాజు బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దించారు. అసెంబ్లీ ఫలితాలు పార్లమెంటు ఎన్నికల్లో పునరావృతం అవుతాయా? లేదా అనేది సందేహాస్పదంగా మారింది.

ఉత్తరాది ఓటర్లపై బీజేపీ గురి
దేశంలోనే కాకుండా తెలంగాణలోనూ అతి పెద్ద పార్లమెంట్ నియోజకవర్గమైన మల్కాజిగిరిలో ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన ప్రజలు ఉపాధి కోసం వచ్చి ఇక్కడ నివాసముంటున్నారు. పూర్తిగా నగర జనాభాతో పాటు మినీ ఇండియాగా ఈ నియోజకవర్గం గుర్తింపు పొందింది. ఉత్తరాది రాష్ట్రాల ఓటర్ల బలం, బీజేపీ కేడర్ తమ పార్టీకి విజయం చేకూరుస్తాయని ఆ పార్టీ అభ్యర్థి, మాజీ మంత్రి ఈటెల రాజేందర్ చెబుతున్నారు. బీజేపీ ఈటెల అభ్యర్థిత్వాన్ని మొదటి జాబితాలోనే ప్రకటించడంతో ఆయన ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీతో మీర్జాలగూడ నుంచి మల్కాజిగిరి వరకు రోడ్ షో నిర్వహించేందుకు కమలనాథులు సమాయత్తమయ్యారు. బీసీ అభ్యర్థి నినాదం, మోదీని మూడోసారి ప్రధానమంత్రిని చేయాలని కోరుతూ బీజేపీ నేతలు ప్రచారం సాగిస్తున్నారు.

కాంగ్రెస్ పార్టీకి కంచుకోట
మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గంలో మూడుసార్లు ఎన్నికలు జరగ్గా రెండుసార్లు కాంగ్రెస్ అభ్యర్థులే విజయ బావుటా ఎగురవేశారు. దీంతో కాంగ్రెస్ పార్టీకి ఈ సీటు కంచుకోటగా మారింది. మల్కాజిగిరి ఎంపీ స్థానం ఏర్పడాక 2009వ సంవత్సరంలో మొదటిసారి ఎన్నికలు జరిగాయి. 2009లో ఇక్కడి నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సర్వే సత్యనారాయణ ఎంపీగా విజయం సాధించి 2012లో కేంద్ర రవాణశాఖ సహాయమంత్రిగా పనిచేశారు. అనతరం 2014 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన చామకూర మల్లారెడ్డి గెలిచారు. 2014 ఎన్నికల్లో టీడీపీ ఎంపీగా గెలిచి టీఆర్ఎస్ పార్టీలో చేరారు. 2019వ సంవత్సరంలో జరిగిన సాధారణ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్ధి, మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డిపై 10,919 ఓట్ల ఆధిక్యతతో ప్రస్థుత ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డి విజయం సాధించారు.

ఇక్కడి ఎంపీలను వరించిన అదృష్టం
మల్కాజిగిరి ఎంపీలను అదృష్టం వరిస్తోంది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో టీపీసీసీ అధ్యక్షుడైన ఎ రేవంత్ రెడ్డి తన సొంత నియోజకవర్గమైన కొడంగల్ నుంచి పోటీ చేసి విజయఢంకా మోగించి ఏకంగా సీఎం అయ్యారు. ఇక్కడి నుంచి ఎంపీలైన సర్వే సత్యనారాయణ కేంద్రమంత్రి అయ్యారు. మరో ఎంపీ మల్లారెడ్డి అనూహ్యంగా రాష్ట్ర మంత్రి అయ్యారు. మల్కాజిగిరి ఎంపీ స్థానానికి రేవంత్ రాజీనామా చేశారు. మల్కాజిగిరి నుంచి గెలిచిన ముగ్గురికి మంచి అవకాశాలు రావడంతో ఈ స్థానం కలిసి వస్తుందనే సెంటిమెంటు ఏర్పడింది. మొదట సర్వే సత్యనారాయణ కేంద్రమంత్రి అయ్యారు. రెండో సారి ఎంపీ అయిన మల్లారెడ్డిని రాష్ట్ర మంత్రి పదవి వరించింది. మూడోసారి ఎంపీగా విజయం సాధించిన రేవంత్ రెడ్డి ఏకంగా తెలంగాణ సీఎం అయ్యారు.
మల్కాజిగిరి పార్లమెంట్ బరిలో మూడు పార్టీలు బలమైన అభ్యర్థులను నిలిపి విజయం కోసం ఎవరికి వారు శ్రమిస్తున్నారు. మల్కాజిగిరి త్రిముఖ పోరులో ఎవరు విజయం సాధిస్తారు? అనేది పార్లమెంటు ఎన్నికల ఫలితాల వరకు వేచి చూడాల్సిందే.


Tags:    

Similar News