కాంగ్రెస్ నేత కుమారుడి చెరువు కబ్జా కథ

హైదరాబాద్‌లో తీసిన శాటిలైట్ చిత్రాల్లో చెరువుల కబ్జా బాగోతం వెలుగుచూసింది. కాంగ్రెస్ పార్టీ నాయకుడి కుమారుడు చేసిన చెరువు కబ్జా కథ చిత్రాల్లో బయటపడింది.

Update: 2024-08-30 01:23 GMT

రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం కొత్వాల్ గూడ గ్రామంలోని సర్వేనంబరు 14లోని చెరువును మట్టితో పూడ్చి కబ్జా చేశారని శాటిలైట్ చిత్రాల్లో వెలుగుచూసింది. నేషనల్ రీమోట్ సెన్సింగ్ ఏజెన్సీ శాటిలైట్ ద్వారా తీసిన గూగుల్ ఎర్త్ చిత్రాల్లో చెరువు స్థలంలోనే భవనాలు నిర్మించారని తేలింది.


చెరువులో చొచ్చుకువచ్చారు...
హిమాయత్ సాగర్ మంచినీటి రిజర్వాయర్ ఫుల్ ట్యాంక్ లెవెల్ అయిన నిషేధిత జోన్ పరిధిలోని కొత్వాలగూడ గ్రామంలోని సర్వే నంబరు 14 పరిధిలో ప్రహరీగోడలు, రోడ్డు, భవనాలు ఉన్నాయని శాటిలైట్ చిత్రంలో వెలుగుచూశాయి. 2012-16,2017,2018.2019,2021,2023 సంవత్సరాల్లో నేషనల్ రీమోట్ సెన్సింగ్ ఏజెన్సీ తీసిన చిత్రాల్లో ఈ కబ్జాలు కనిపించాయి.చెరువులోకి చొచ్చుకు వచ్చి భవనాలు నిర్మించారని అధికారులకు సమాచారం అందింది. హెచ్ఎండీఏ మాస్టర్ ప్లాన్ లో సర్వే నంబరు 8,16 లలోని భూమి ఉంది. దీన్ని ఆసరాగా తీసుకొని నిషేధిత జోన్ లో ఉన్న సర్వే నంబరు 14లోని భూమిని కబ్జాదారు నిబంధనలను ఉల్లంఘించి భవనాలు నిర్మించారు.



ధరణి పోర్టల్‌లో పట్నం రినీష్ రెడ్డి భూమిగా నమోదు

ధరణి పోర్టల్ లో శంషాబాద్ మండలం కొత్వాల్ గూడలోని సర్వే నంబరు 14 ఎ, 14 ఎఏ లలో ఉన్న భూములు అసైన్డ్ భూములని ఉంది. అసైన్డ్ భూములను గిఫ్ట్‌ రిజిస్ట్రేషన్లు, విక్రయాలు సాగించారని క్లైమెట్ కాంగ్రెస్ ప్రతినిధి డాక్టర్ లుబ్నా సార్వత్ జరిపిన పరిశోధనల్లో తేలింది. ఈ అసైన్డ్ భూముల్లో 13 ఎకరాలు మాజీ మంత్రి, కాంగ్రెస్ బడా నేత పట్నం మహేందర్ రెడ్డి కుమారుడు పట్నం రినీష్ రెడ్డి పేరు మీద, ఒక ఎకరం రాంబ్లీ భార్య జి కాంతమ్మ పేరిట ధరణి పోర్టల్ లో నమోదైంది.

గతంలో ఫిర్యాదు చేసినా, పట్టించుకోలేదు...
గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో తాను జంట జలాశయాల ఫుల్ ట్యాంక్ లెవెల్, బఫర్ జోన్లలో ఆక్రమణలపై ఫిర్యాదు చేసినా, అధికారులు, ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదని డాక్టర్ లుబ్నా సర్వత్ ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు.జంట జలాశయాలను కబ్జా చేశారని ఫిర్యాదు చేస్తే వాటిని తొలగించకుండా, ఆక్రమణల్లో ఉన్న నీటిని తొలగించారు. హిమాయత్ సాగర్,ఉస్మాన్ సాగర్ తాగునీటి అవసరాలపై గత ప్రభుత్వం దృష్టి సారించకుండా కబ్జాదారులకు అండదండలు అందించిందని ఆమె ఆరోపించారు.



 జలాశయంలో ఆక్రమణలను తొలగించాలి : డాక్టర్ లుబ్నా సర్వత్

జంట జలాశయాల పరిధిలోని నిషేధిత జోన్లలోని భవనాలను తొలగించాలని టీమ్ క్లైమేట్ కాంగ్రెస్ ప్రతినిధి డాక్టర్ లుబ్నా సర్వత్ డిమాండు చేశారు.మంచినీటి రిజర్వాయర్‌లో ఎలాంటి కాలుష్యం లేకుండా యుద్ధ ప్రాతిపదికన నిషేధిత బఫర్ జోన్‌లో ఆక్రమణలను తొలగించాలని ఆమె కోరారు.ఉస్మాన్ సాగర్ నుంచి ఆక్రమణలను తొలగించాలని డిమాండ్ చేస్తూ చెన్నైలోని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ లో తాను కేసు వేశానని డాక్టర్ లుబ్నా సర్వత్ ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు.


Tags:    

Similar News