సమ్మర్ ఎఫెక్ట్ : తెలంగాణలో జనజీవనం అస్తవ్యస్తం

మండుతున్న ఎండలు తెలంగాణ జన జీవనాన్ని తీవ్ర ప్రభావితం చేస్తున్నాయి. మంచినీటి కొరతకు తోడు కోడిగుడ్ల ధరలు పెరిగాయి.చెరువుల్లోని చేపలు కూడా మృత్యువాత పడుతున్నాయి.

Update: 2024-05-06 12:57 GMT
హైదరాబాద్ మండే ఎండలతో వెలవెలబోతున్న ట్యాంక్ బండ్

తెలంగాణలో ఈ వేసవిలో వివిధ ప్రాజెక్టు జలాశయాలు అడుగంటి పోవడంతో మంచినీటి కొరత ఏర్పడింది. భూగర్భ జలాలు కూడా అడుగంటి పోయాయి దీంతో ఈ వేసవిలో పలు ప్రాంతాల్లో మంచినీటి కొరత ఏర్పడింది. హైదరాబాద్ నగరంలో బోర్లు డ్రై కావడంతో ఇళ్లలో వినియోగానికి నీటిని ట్యాంకర్ల ద్వారా కొనుగోలు చేయాల్సి వస్తోంది. చికెన్, కోడిగుడ్ల ధరలు పెరిగాయి. మరో వైపు చెరువుల్లోని చేపలు కూడా అధిక వేడికి మరణిస్తున్నాయి. వేడిమి తట్టుకోలేక ప్రజలు ఏసీలు, కూలర్లపై ఆధారపడుతున్నారు. దీంతో విద్యుత్ వినియోగం కూడా గణనీయంగా పెరిగింది.


47 డిగ్రీల సెల్సియస్ దాటిన ఉష్ణోగ్రత
తెలంగాణలో సూర్యుడు నిప్పులు కక్కుతుండటంతో జనం అల్లాడుతున్నారు. రోహిణి కార్తెకు ముందే సూరీడు తన ప్రతాపం చూపిస్తుండటంతో ఒకే రోజు వడదెబ్బతో 19 మంది మరణించారు. జగిత్యాల, నిజామాబాద్, మంచిర్యాల, నల్గొండ, ఖమ్మం, రంగారెడ్డి జిల్లాల్లో ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగాయి. వచ్చే మూడు రోజుల పాటు ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, పెద్దపల్లి జిల్లాల్లో తీవ్ర వడగాలులు వీస్తాయని హైదరాబాద్ ఐఎండీ అధికారి ధర్మరాజు చెప్పారు. మండుతున్న ఎండలతో మధ్యాహ్నం ప్రజలు ఇళ్లలో నుంచి బయటకు రావద్దని ఐఎండీ అధికారులు, తెలంగాణ వైద్యఆరోగ్యశాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. మొత్తంమీద ఎండల తీవ్రత వల్ల ప్రజల జన జీవనం స్తంభించి పోయింది. పగలంతా ఎండలు మండుతుండగా సాయంత్రానికి చిరుజల్లులతో వాతావరణం చల్లబడుతోంది.

డెడ్ స్టోరేజీకి చేరిన జలాశయాలు
తెలంగాణలో మండుతున్న ఎండల ధాటికి వివిధ ప్రాజెక్టు జలాశయాల్లో నీరు అడుగంటింది. నాగార్జునసాగర్ ప్రాజెక్టులో నీరు అడుగంటడంతో అత్యవసర పంపింగ్ వ్యవస్థను అధికారులు ప్రారంభించారు. హైదరాబాద్ నగర తాగునీటి అవసరాలను తీర్చడానికి శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు నీటిని తరలించాలని వాటర్ బోర్డు అధికారులు నిర్ణయించారు. ప్రాజెక్టులో డెడ్ స్టోరేజీ నుంచి మంచినీటిని తీసుకునేందుకు యుద్ధప్రాతిపదికన ప్రాజెక్టు వద్ద బూస్టర్ పంపులను ఏర్పాటు చేశారు. మే 15వ తేదీన ఎల్లంపల్లి ప్రాజెక్టులోనూ అత్యవసర పంపింగ్ ప్రారంభిస్తామని హైదరాబాద్ జలమండలి ఇంజినీరు కృష్ణ చెప్పారు.

ఎల్లంపల్లి నీటిపైనే ఆశలు
ఎల్లంపల్లి ప్రాజెక్టులో గత ఏడాది కంటే నీటిమట్టం గణనీయంగా పడిపోయింది. దీంతో ఈ నీటిని కేవలం తాగునీటి సరఫరాకే వినియోగించాలని అధికారులు నిర్ణయించారు. నిర్మల్, బోథ్, ఆర్మూర్ చుట్టుపక్కల పట్టణాలకు నీటి సరఫరా కోసం, శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ నుంచి మిషన్ భగీరథ ద్వారా నీరు అందించాలని నిర్ణయించారు. లోయర్ మానేరు డ్యాంలో నీటిమట్టం డెడ్ స్టోరేజీకి చేరుకుంది. దీంతో డెడ్ స్టోరేజి నుంచి కరీంనగర్ కు మంచినీటిని సరఫరా చేయాలని నిర్ణయించారు. ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ జంట జలాశయాల నుంచి హైదరాబాద్ తాగునీటి అవసరాలకు 22 మిలియన్ గ్యాలన్ల నీటిని తీసుకోవాలని నిర్ణయించారు.

తగ్గిన భూగర్భజలాలు
మండుతున్న ఎండలు, తగ్గిన వర్షపాతం వల్ల తెలంగాణలోని 33 జిల్లాలో 32 జిల్లాల్లో భూగర్భజలమట్టం గత ఏడాదితో పోలిస్తే 1.67 మీటర్ల మేర తగ్గిందని భూగర్భజల శాఖ అధికారులు చెప్పారు. 201 మండలాల్లో భూగర్భజలమట్టం 15.25 మీటర్ల మేర తగ్గింది. మహబూబ్ నగర్ జిల్లాలో భూగర్భ జలమట్టం గణనీయంగా పడిపోయిందని భూగర్భ శాస్త్రవేత్తలు నిర్ధారించారు. నిజామాబాద్, నిర్మల్, ఆదిలాబాద్, జగిత్యాల, ములుగు, మెదక్, మేడ్చల్, హైదరాబాద్, నల్గొండ, సూర్యాపేట, నాగర్ కర్నూల్, జోగులాంబ గద్వాల, వికారాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, కామారెడ్డి, నారాయణ పేట జిల్లాల్లో అధికంగా భూగర్భజలాలు పడిపోయాయి.

పెరిగిన కోడిగుడ్ల ధరలు
తెలంగాణలో ఉష్ణోగ్రతలు పెరగడంతో కోళ్ల మరణాల రేటు పెరిగింది. దీంతో గుడ్డు ధరలు పెరిగాయని పౌల్ట్రీ మార్కెట్ నిపుణులు చెప్పారు.గత వేసవితో పోలిస్తే నగరంలో గుడ్ల ధర గణనీయంగా పెరిగింది. 100 యూనిట్ల గుడ్ల ధర గతేడాది మే 4న రూ.420 ఉండగా, ఈ ఏడాది రూ.445కి పెరిగింది.ఏప్రిల్ 5 మే 4 మధ్య గుడ్డు ధర 70 పైసలు పెరిగింది. ఏప్రిల్ 5న రూ.4.35 ఉన్న గుడ్డు ధర ఇప్పుడు మే 5 నాటికి రూ.5.25కు పెరిగింది. ఎండల తీవ్రత వల్ల కోడిగుడ్లే కాదు చికెన్ ధరలు కూడా పెరిగాయని చికెన్ షాపు యజమాని ఆరిఫ్ ముహమ్మద్ చెప్పారు.

వేడెక్కుతున్న నీరు...చెరువుల్లో చేపల మృతి
పెరుగుతున్న ఉష్ణోగ్రతల కారణంగా చెరువుల్లోని నీరు విపరీతంగా వేడెక్కుతోంది. పెరుగుతున్న ఉష్ణోగ్రతల కారణంగా పొల్కమ్మ చెరువు, కముని చెరువు సహా సరస్సుల్లో నీరు విపరీతంగా వేడెక్కడంతో చేపలు చనిపోతున్నాయి.ఉష్ణోగ్రత పెరుగుదలతో కరిగిన ఆక్సిజన్ ద్రావణీయత తగ్గుతుంది. రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు 47 డిగ్రీల సెల్సియస్‌ దాటిపోవడంతో తెలంగాణ వ్యాప్తంగా ఉన్న చెరువుల్లోని చేపలు చనిపోతున్నాయని మత్స్యకార సంఘం నాయకుడు పిట్టల రవీందర్ ఆందోళన వ్యక్తం చేశారు. రంగారెడ్డి జిల్లా మంచాల మండలం చిత్తాపూర్ గ్రామంలోని కామ చెరువులో మండుతున్న ఎండలు, వడగాలుల ప్రభావం వల్ల రెండు టన్నుల చేపలు మరణించాయి. కామ చెరువుపై ఆధారపడి జీవనం సాగిస్తున్న మత్స్య కారులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.

హైదరాబాద్ లో వాహనాల కాలుష్యంతో పెరిగిన ఉష్ణోగ్రత
కాంక్రీట్ జంగిల్ గా మారిన హైదరాబాద్ నగరంలో అధిక ఉష్ణోగ్రతలు నమోదవ్వడానికి నగరంలోని ట్రాఫిక్ కూడళ్ల వద్ద ఏర్పడిన కాలుష్యం కారణమని తిరుచ్చి ఎన్ఐటీ అధ్యయనంలో వెల్లడైంది. అసలే అధిక ఉష్ణోగ్రతలతో సతమతమవుతున్న హైదరాబాద్ నగర ప్రజలకు ట్రాఫిక్ సిగ్నళ్ల వద్ద ఏర్పడిన వాయు కాలుష్యం ఎఫెక్టుతో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని తిరుచ్చి ఎన్ఐటీ తేల్చిచెప్పింది.




ఐఎండీ, జలమండలి,


Tags:    

Similar News