పార్లమెంట్ ఎన్నికల బరిలో బడా వ్యాపారుల హవా

పార్లమెంట్ ఎన్నికల బరిలో బడా వ్యాపారుల హవా కొనసాగుతోంది. కోట్లకు పడగలెత్తిన పారిశ్రామికవేత్తలు ఎక్కువమంది పార్లమెంటు బరిలో దిగడంతో ప్రచార హంగామా సాగుతోంది.

Update: 2024-04-22 05:32 GMT
మూడు పార్టీల్లోనూ బడా వ్యాపారులే అభ్యర్థులు...

పార్లమెంట్ ఎన్నికల్లో ప్రచార వ్యయం అనూహ్యంగా పెరగడంతో ఎక్కువమంది బడా వ్యాపారులు, పారిశ్రామికవేత్తలు, కాంట్రాక్టర్లు బరిలో నిలుస్తున్నారు. ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలతో కూడిన పార్లమెంట్ నియోజకవర్గంలో పోటీకి ఆర్థికబలం, అంగబలం ప్రధానం కావడంతో ప్రధాన రాజకీయ పార్టీలన్నీ బడా వ్యాపారులకే పార్టీ టికెట్లు ఇచ్చాయి.

- తెలంగాణ రాష్ట్రంలోని 17 పార్లమెంటు నియోజకవర్గాల్లో ప్రధాన రాజకీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల అభ్యర్థుల వ్యాపారాలను పరిశీలిస్తే వారిలో ఎక్కువ మంది బడాబడా వ్యాపారులే కావడం విశేషం.

మధుకాన్ గ్రూపు సంస్థల అధిపతి నామ
మధుకాన్ గ్రూపు సంస్థల అధిపతిగా ఉన్న నామ నాగేశ్వరరావు ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా ఎన్నికలబరిలోకి దిగారు. మధుకాన్ ప్రాజెక్ట్స్, షుగర్స్, గ్రానైట్ తదితర వ్యాపార సంస్థల అధిపతిగా ఉండి రాజకీయాల్లోకి వచ్చారు.మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన నామ అంచెలంచెలుగా ఎదుగుతూ బడా పారిశ్రామికవేత్తగా ఎదిగారు. రెండు సార్లు ఎంపీగా పనిచేసిన నామ మూడోసారి ఖమ్మం నుంచే బరిలోకి దిగారు.

హెల్త్ కేర్ రంగంలో కొండా విశ్వేశ్వర్ రెడ్డి
గతంలో చేవెళ్ల ఎంపీగా పనిచేసిన కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఈ సారి బీజేపీ అభ్యర్థిగా చేవేళ్ల పార్లమెంట్ నుంచి పోటీ చేస్తున్నారు. రూ.898 కోట్ల రూపాయల ఆస్తులున్న కొండా బడా పారిశ్రామికవేత్త. ప్రముఖ రాజకీయ నాయకుడు, డిప్యూటీ సీఎం కేవీ రంగారెడ్డి మనవడు, మాజీ చీఫ్ జస్టిస్ కొండా మాధవరెడ్డి కుమారుడైన ఈయన పలు వ్యాపారాలు సాగిస్తున్నారు.ఈయన విప్రో హెల్త్ కేర్ ఐటీ సీఈఓగా ఉన్నారు. అపోలో హాస్పిటల్, ఇంద్రప్రస్థ మెడికల్ కార్పొరేషన్, ఆంధ్రా పెట్రో, ఆంధ్రా షుగర్స్, హెల్త్ క్యూర్, ఇలా పలు కార్పొరేట్ కంపెనీల్లో ఈయనకు భాగస్వామ్యం ఉంది. ఈయన అపోలో ఆసుపత్రి వ్యవస్థాపకుడు ప్రతాప్ సిరెడ్డి కుమార్తె సంగీతారెడ్డిని వివాహం చేసుకున్నారు. సంగీతారెడ్డి అపోలో ఆసుపత్రి ఈడీగా పనిచేస్తున్నారు.

విశాఖ ఇండస్ట్రీస్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టరుగా గడ్డం వంశీకృష్ణ
పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ బడా పారిశ్రామికవేత్త. రాజకీయ దిగ్గజం కాకా మనవడైన వంశీకృష్ణ తన తండ్రి నుంచి వచ్చిన వ్యాపారాన్ని చూస్తున్నారు.విశాఖ ఇండస్ట్రీస్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టరుగా వంశీకృష్ణ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. దీంతో పాటు ఈయన కంపెనీకి వీ 6 టీవీ ఛానల్, వెలుగు పత్రిక కూడా ఉంది.

పార్లమెంట్ పోరులో కాంట్రాక్టర్లు
తెలంగాణ నుంచి పార్లమెంట్ ఎన్నికల సమరాంగణంలో పలువురు కాంట్రాక్టర్లు నిలిచారు. నల్గొండ లోక్ సభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కుందూరు రఘువీర్ రెడ్డి ఓ బడా కాంట్రాక్టర్. తన తండ్రి కుందూరు జానారెడ్డి నుంచి వచ్చిన రాజకీయ వారసత్వంతో ఈ సారి ఎంపీ బరిలోకి దిగారు. నల్గొండ బీఆర్ఎస్ అభ్యర్థి కంచర్ల కృష్ణారెడ్డి కూడా కాంట్రాక్టరు, రియల్ ఎస్టేట్ వ్యాపారాలున్నాయి. వరంగల్ బీజేపీ అభ్యర్థి ఆరూరి రమేష్ బడా కాంట్రాక్టరుతో పాటు పలు రకాల వ్యాపారాలున్నాయి. ఖమ్మం బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి తాండ్ర వినోద్ రావు బడా కాంట్రాక్టరు.

ఈటెల రాజేందర్ పౌల్ట్రీ వ్యాపారం
మల్కాజిగిరి బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ కు పౌల్ట్రీ వ్యాపారం ఉంది. హైదరాబాద్ నగర శివార్లలో పలు పౌల్ట్రీ ఫాంలున్నాయి. ఈటెలకు జమున హాచరీస్ ప్రైవేట్ లిమిటెడ్ పేరిట హైదరాబాద్ నగర శివార్లలోని దేవరయాంజాల్, మాసాయిపేట్ గ్రామాల్లో 200 ఎకరాల్లో కోళ్ల ఫారాలున్నాయి. 1.5 లక్షల కోళ్లు, 2 లక్షల బ్రాయిలర్ బ్రీడర్స్ ఫాంలున్నాయి. జమున పౌల్ట్రీ ఫాంను 1986వ సంవత్సరంలో ఈటెల రాజేందర్ ప్రారంభించారు. అనంతరం దీని నిర్వహణ బాధ్యతలను తన భార్య ఈటెల జమునకు అప్పగించారు.

అందరూ బడా వ్యాపారులే...
జహీరాబాద్ లోక్ సభ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న బీబీపాటిల్ బడా పారిశ్రామికవేత్త. ఈయనకు హైదరాబాద్ నగరంలో యమహా షోరూంలు పలు వ్యాపారాలున్నాయి. పలు రంగాల వ్యాపారాలతోపాటు వాహనాల డీలర్ షిప్ లున్నాయి. చేవెళ్ల కాంగ్రెస్ అభ్యర్థి రంజిత్ రెడ్డి కూడా బడా పౌల్ట్రీ వ్యాపారి. గడ్డం రంజిత్ రెడ్డికి శ్రీరాజేశ్వర హాచరీస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఉంది. ఈయన హాచరీస్ లో 8వేల బ్రాయిలర్ బ్రీడర్స్ ఉన్నాయి. గంగాపురం కిషన్ రెడ్డి కూడా బీజేపీలో కీలక నేత అయినా ఆయన కూడా పారిశ్రామికవేత్త. వ్యయసాయంతో పాటు పలు హైదరాబాద్ నగరంలో ఈయనకు వాణిజ్య భవనముంది. బంజారాహిల్స్ రోడ్డు నంబరు 12లో 425 గజాల్లో వాణిజ్య భవనముంది. కందుకూరు మండలం తిమ్మాపూర్ గ్రామంలోనూ వాణిజ్య భవనముంది. పలు కంపెనీల్లో షేర్లు కూడా ఉన్నాయి.

ఎన్నికల బరిలోకి దిగిన రియల్ ఎస్టేట్ వ్యాపారులు
తెలంగాణలో రియల్ ఎస్టేట్ వ్యాపారంలో దిగి కోట్లాదిరూపాయల డబ్బు సంపాదించిన పలువురు వ్యాపారులు ఈ సారి పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న గాలి అనిల్ కుమార్ రియల్ ఎస్టేట్ బడా వ్యాపారిగా గుర్తింపు పొందారు. మెదక్ బీఆర్ఎస్ అభ్యర్థి మాజీ ఐఎఎస్ అధికారి అయిన వెంకట్రామిరెడ్డి రాజపుష్ప రియల్ ఎస్టేట్ కంపెనీ వ్యవస్థాపకుడు. మల్కాజిగిరి బీఆర్ఎస్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డికి రియల్ ఎస్టేట్ తోపాటు మద్యం వ్యాపారాలున్నాయి. చేవేళ్ల బీఆర్ఎస్ అభ్యర్థి కాసాని జ్జానేశ్వర్ రియల్ ఎస్టేట్ తోపాటు పలు వ్యాపారాలున్నాయి.

ఎన్నెన్నో వ్యాపారాలు...
మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధు బడా వ్యాపారి. నల్గొండ బీజేపీ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డికి హోటల్ బిజినెస్ ఉంది. భువనగిరి కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి కూడా వ్యాపారి. భువనగిరి బీజేపీఅభ్యర్థి బూర నర్సయ్య గౌడ్ వృత్తిరీత్యా వైద్యుడైనా ఈయనకు పలు వ్యాపార సంస్థల్లో భాగస్వామ్యముంది. మహబూబాబాద్ పార్లమెంట్ నుంచి పోటీ చేస్తున్న పోరిక బలరాంనాయక్ (కాంగ్రెస్), మాలోతు కవిత (బీఆర్ఎస్) ఇద్దరూ వ్యాపారులు కావడం విశేషం. నాగర్ కర్నూల్ బీజేపీ అభ్యర్థి పోతుగంటి భరత్ ప్రసాద్ కూడా బడా వ్యాపారి. మహబూబ్ నగర్ బీఆర్ఎస్ అభ్యర్థి మన్నే శ్రీనివాసరెడ్డి కూడా వ్యాపారే. నిజామాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్థన్ వ్యవసాయంతో పాటు పలు వ్యాపారాలున్నాయి. నిజామాబాద్ బీజేపీ అభ్యర్థి ధర్మపురి అర్వింద్ కూడా బడా వ్యాపారే. ఈయనకు సొంత కంపెనీలతోపాటు పలు కార్పొరేట్ సంస్థల్లో షేర్లు ఉన్నాయి. కరీంనగర్ బీఆర్ఎస్ అభ్యర్థి వృత్తిరీత్యా న్యాయవాది అయినా ఆయన ఆసుపత్రులు, ఇతర వ్యాపారాల్లో భాగస్వామ్యముంది.

 ఎక్కువ మంది అభ్యర్థులందరూ బడా పారిశ్రామికవేత్తలే...
హైదరాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థి గడ్డం శ్రీనివాసయాదవ్ హైందవ విద్యాసంస్థల ఛైర్మన్ గా ఉన్నారు. హైదరాబాద్ బీజేపీ అభ్యర్థి కొంపెల్లి మాధవీలత విరించి ఆసుపత్రి ఛైర్మన్ గా వ్యవహరిస్తున్నారు. మజ్లిస్ అభ్యర్థి, సిట్టింగ్ ఎంపీ అయిన అసదుద్దీన్ ఒవైసీకి ఆసుపత్రి, మెడికల్ కళాశాల, ఇంజినీరింగ్ కళాశాలలో భాగస్వామ్యం ఉంది.
ఇలా పార్లమెంట్ బరిలో నిలిచిన అభ్యర్థుల్లో 90 శాతం మంది బడా వ్యాపారులు కావడం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. వ్యాపారాల్లో విజయం సాధించి కోట్లకు పడగలెత్తిన పార్లమెంట్ ప్రధాన పక్షాల అభ్యర్థులు ఎన్నికల ప్రచారంలో కోట్ల రూపాయలు వెదజల్లుతున్నారని ఎన్నికల కమిషన్ వ్యయ నియంత్రణ పరిశీలకులే చెబుతున్నారు. ఈ ఎన్నికల్లో ఎవరు విజయం సాధిస్తారో లేదో జూన్ 4వతేదీ ఎన్నికల ఓట్ల లెక్కింపు వరకు వేచిచూడాల్సిందే.



Tags:    

Similar News