వరి రైతును కోలుకోలేని దెబ్బకొట్టిన మిగ్‌జాం
కోస్తా జిల్లాల్లో లక్షల ఎకరాల్లో వరి ధాన్యం నేలపాలు, కోతకు గురైన చప్టాలు, చెరువులు, వాగులు, రోడ్లు బుధవారం సాయంత్రానికి నష్టం వివరాలు అందే అవకాశం
ఆంధ్రప్రదేశ్‌లోని కోస్తా జిల్లాల్లో మిగ్‌జాం తుపాన్ బీభత్సం సృష్టించింది. వర్షానికి, చలికి ప్రజలు వణికి పోతున్నారు. పూరిగుడిసెల్లో ఉండే వారు ఎక్కడ తలదాచుకోవాలో తెలియక తికమక పడుతున్నారు. పునరావాస కేంద్రాలకు తరలించినా అక్కడ కప్పుకునేందుకు దుప్పట్లు లేవు. ఇండ్ల వద్ద నుంచి కట్టుబట్టలతో పునరావాస కేంద్రాలకు బాధితులు వచ్చారు. భారీ చెట్లు నేల కూలాయి. విద్యుత్ స్తంభాలు కిందపడ్డాయి. కొన్ని చోట్ల ట్రాన్స్‌ఫారాలు కూడా దిమ్మెలపై నుంచి కిందపడ్డాయి. ప్రధానంగా వరి రైతులను నీట ముంచింది. పండించిన పంట రెండు రోజులుగా కళ్లముందే నీళ్లలో పోయింది. మంత్రులు, ఉన్నతాధికారులు కొన్ని చోట్ల నీటిలో ఉన్న ధాన్యాన్ని వాహనాల ద్వారా స్కూలు కాంపౌండ్స్, మెరక ప్రాంతాలకు తరలించారు. కొన్ని చోట్ల ధాన్యాన్ని నేరుగా మిల్లులకు తరలించారు. కొన్ని జిల్లాల్లో మిర్చి, పొగాకు పంటలు కూడా నీట మునిగాయి. అరటి తోటలు పూర్తిగా నేలకూలాయి. చాలా చోట్ల జామ, బత్తాయి, నిమ్మ, దానిమ్మ వంటి పండ్లతోటల్లో చెట్లు నేలకొరిగాయి. గొర్రెలు, మేకలు, గేదెలు, ఆవులు వంటి పశు సంపద రెండు రోజులుగా మేతలేక అల్లాడుతున్నాయి. కల్లాల్లో నిల్వ ఉంచిన ఎండుగడ్డి కూడా తడిసిపోయింది.