పార్లమెంటు చరిత్రలో 146 మంది సస్పెన్షన్ ఓ రికార్డ్

సరిగ్గా 34 ఏళ్ల కిందట 63మంది ఎంపీలను సస్పెండ్ చేస్తే ఇది ప్రజాస్వామ్యమేనా, ఇది పార్లమెంటేనా అని దేశం ఘోషించింది. మరి ఇప్పుడు ఏకంగా 146 మంది..

By :  A.Amaraiah
Update: 2023-12-22 19:22 GMT
ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద కాంగ్రెస్ ధర్నా

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వంలో ప్రతిదీ సంచలనమే, రికార్డే. పార్లమెంటు శీతాకాల సమావేశాలు డిసెంబర్ 22 వరకు జరగాలి. ఒక రోజు ముందే నిరవధిక వాయిదా పడ్డాయి. ఈ సెషన్ రికార్డ్ ఏమిటంటే.. మొత్తం ప్రతిపక్షం సభ్యుల్లో 146 మందిని ఒక సెషన్ కే లేకుండా సస్పెండ్ చేయడం. ఇందులో 97 మంది లోక్ సభ సభ్యులు, 49 మంది రాజ్యసభ సభ్యులు. పార్లమెంటు వర్తమాన చరిత్రలో ఇదో రికార్డు.

వీళ్లు డిమాండ్ చేసిందేమిటంటే...

పార్లమెంటు భద్రతా వైఫల్యంపై హోం మంత్రి అమిత్ షా లోక్ సభలో సమాధానం చెప్పాలని యావత్ ప్రతిపక్షం డిమాండ్ చేసింది. పార్లమెంటు భద్రతా వ్యవస్థను కన్నుగప్పి లోక్ సభలోకి వచ్చిన ఇద్దరు కుర్రాళ్లు ఏకంగా విజిటర్స్ గ్యాలరీ నుంచి సభలోకి దూకి, పొగబాంబులు వదిలి భీతావహం సృష్టించారు. ఈ ఘటన అసాధారణమైంది. కనుక సభలో దీనిపై ప్రకటన చేయాలని ప్రతిపక్షాలు న్యాయసమ్మతమైన డిమాండ్ చేశాయి. ఇదెందుకో ఇష్టం లేని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్ షా పార్లమెంటు బయట మాట్లాడారు తప్ప లోపల మాట్లాడలేదు. ఇది ప్రతిపక్షాలకు ఆగ్రహం తెప్పించింది. పార్లమెంటు ఉభయ సభల్లో రభస చేశాయి. రాజుకన్నా ధైర్వవంతుడు మొండివాడన్న సామెతగా అమిత్ షా సభకు రాలేదు. వచ్చినా జవాబు చెప్పలేదు. ప్రతిపక్షాలకు మిగిలిందల్లా ఆందోళనే కావడంతో స్పీకర్ పొడియం వైపు దూసుకుపోయారు. నిబంధనలు కాదంటున్నా గత్యంతరం లేకపోయింది. హద్దు మీరారంటూ స్పీకర్ ఓం బిర్లా రోజూ కొంతమంది చొప్పున విపక్ష ఎంపీలను సస్పెండ్ చేస్తే రాజ్యసభలో ఒక్కరోజే ఏకంగా 36 మందిని బయటకు పంపించారు.

దోషుల్ని శిక్షించమంటే ప్రజాస్వామ్యంపై దాడి..

విపక్ష సభ్యుల్ని సస్పెండ్ చేయడంపై ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తీవ్రంగానే స్పందించారు.. పార్లమెంటుపై దాడి చేసిన వారిని శిక్షించమంటే విపక్షంపైన, ప్రజాస్వామ్యంపైన దాడి చేస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే వరుసలో అన్ని పార్టీల వారూ ఖండనలు ఇచ్చారు. డిసెంబర్ 22న దేశవ్యాప్తంగా ధర్నాలకు పిలుపిచ్చారు. ఢిల్లీలో ఖర్గే నాయకత్వంలో జంతర్ మంతర్ వద్ద ర్యాలీ, ధర్నాలు జరిగాయి. మిగతా రాష్ట్రాల్లోనూ నిరసనలు సాగాయి.

రాజీవ్ గాంధీ హయాంలో ఏమి జరిగిందంటే...

1989, మార్చి 15.. పార్లమెంటు సమావేశమైంది. ఇందిరా గాంధీని హత్య చేసిన తర్వాత ఏర్పాటైన టక్కర్ కమిషన్ రిపోర్టు లోక్ సభలో చర్చకు వచ్చింది. అప్పుడు ప్రధానమంత్రి ఇందిరా గాంధీ పెద్ద కుమారుడు రాజీవ్ గాంధీ. ప్రతిపక్ష నాయకుడు విశ్వనాథ్ ప్రతాప్ సింగ్. ఆయన పార్టీ జనతాదళ్. టక్కర్ కమిషన్ నివేదికపై చర్చ సందర్భంగా అధికార, ప్రతిపక్ష పార్టీకి మధ్య పెద్దఎత్తున వివాదం సాగింది. స్పీకర్ ఎంత చెప్పినా వినకపోవడంతో లోక్ సభలోని ప్రతిపక్ష సభ్యులు 63 మందిని సస్పెండ్ చేశారు. అది ఆ ఒక్క రోజుకే. కానీ ప్రస్తుత పార్లమెంటులో 143 మంది విపక్ష సభ్యుల్ని అసలీ సెషన్ కే రాకుండా బయటకు పంపింది అధికార బీజేపీ పక్షం. పార్లమెంటు చరిత్రలో ఇది రికార్డు.

ఏయే పార్టీల నుంచి ఎంతెంత మంది...

లోక్ సభలో కాంగ్రెస్ కు మొత్తం 48 మంది ఉంటే వారిలో 38 మంది, డీఎంకేకి 24 మంది ఉంటే 16 మంది, తృణమూల్ కాంగ్రెస్ కి 22 మంది ఉంటే 13 మంది, జేడీయూ కి 16 మంది ఉంటే 11 మందిని, ఎన్సీపీకి ఐదుగురు ముగ్గుర్నీ, ఇండియన్ యూనియన్ ఆఫ్ ముస్లిం లీగ్ కి ఉన్న ముగ్గుర్నీ, ఎస్సీకున్న ముగ్గుర్లో ఇద్దర్నీ, ఫరూక్ అబ్దుల్లా పార్టీ జేకేఎన్సీకి ముగ్గురుంటే ఇద్దర్నీ, సీపీఎంకి ఉన్న ముగ్గుర్లో ఇద్దర్నీ, వీసీకే పార్టీ, ఆర్ఎస్పీ, బీఎస్పీ, సీపీఐ, ఆప్ పార్టీకి చెందిన ఒక్కొక్కర్నీ స్పీకర్ ఓం బిర్లా సస్పెండ్ చేయడం గమనార్హం. రాజ్యసభలోనూ ఇదే రీతిన సస్పెన్షు కొనసాగాయి. కాంగ్రెస్ నుంచి 18 మంది, తృణమూల్ కాంగ్రెస్ వాళ్లు 8 మంది, డీఎంకే వాళ్లు 5, సీపీఎం వాళ్లు ముగ్గురు, ఎస్పీ నుంచి ఇద్దరు, ఆర్జేడీ వాళ్లు ఇద్దరు, జేడీ యూ వాళ్లు ఇద్దరు, సీపీఐ నుంచి ఇద్దరు, ఎన్సీపీ, కేసీఎం, జేఎంఎం పార్టీల వాళ్లు ఒక్కొక్కరు రాజ్యసభ నుంచి సస్పెండ్ అయ్యారు. వీళ్లందరూ శీతాకాల సమావేశాలు పూర్తయ్యేంత వరకు సస్పెండ్ కావడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

తర్వాత ఏం జరిగింది...


సస్పెండ్ అయిన సభ్యులు పార్లమెంటు ఎదుట మాక్ పార్లమెంటు నిర్వహించారు. రాజ్యసభ సభ ఛైర్మన్ సహా పలువురు అధికార పార్టీ మంత్రులపై విపక్షాలు విమర్శలు చేశాయి. షెడ్యూల్ కన్నా సభను అధికార పక్షం నిరవధిక వాయిదా వేసింది. మొత్తం 8 రోజుల సమావేశాలు ఎందుకూ కొరగాకుండా పోయాయి.

ప్రతిపక్షం లేకుండానే మూడు కీలక బిల్లులపై చర్చ..

యావత్ ప్రతిపక్షం సభలో లేని సమయంలో ఐపీసీ, సీఆర్పీసీ, ఎవిడెన్స్ యాక్ట్ ల పేర్లు మార్పునకు సంబంధించిన బిల్లుల్ని లోక్ సభ ఆమోదించింది. దీనిపైనా విపక్షాలు సర్వత్రా నిరసన తెలిపాయి. ఈ మూడు బిల్లుల ఆమోదం కోసమే తమను సస్పెండ్ చేశారా అంటూ నిలదీశాయి.

డిసెంబర్ 22న ఏంజరిగిందంటే...

విపక్షాల పిలుపు మేరకు దేశవ్యాప్తంగా ఆందోళనలు సాగాయి. శీతాకాల సమావేశాల సందర్భంగా పార్లమెంటు నుంచి మొత్తం 146 మంది ఎంపీలను సస్పెండ్ చేయడాన్ని వ్యతిరేకిస్తూ ప్రతిపక్ష ఇండియా కూటమి పార్టీలు దేశవ్యాప్తంగా నిరసనలు తెలిపాయి. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద 'సేవ్ డెమోక్రసీ' బ్యానర్‌పై ప్రదర్శన చేశారు. పార్లమెంటు నుంచి విజయ్ చౌక్ వరకు నిరసన ప్రదర్శన నిర్వహించారు. కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే, పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ, ఇతర పార్టీల నేతలు నిరసనలు చేపట్టారు. అధికార పక్షం తీరును దుమ్మెత్తిపోశారు.

Tags:    

Similar News