అడుగంటిన భూగర్భజలం:హైదరాబాద్‌లో వేసవికి ముందే నీటి సమస్య

తెలంగాణ రాజధాని నగరమైన హైదరాబాద్‌లో వేసవికి ముందే మంచినీటి సమస్య ఏర్పడింది. ఈ ఏడాది తక్కువ వర్షపాతం వల్ల నగరంలో భూగర్భ జలాలు అడుగంటి పోయాయి. దీంతో వేసవి కాలానికి ముందే నీటి సమస్య ఏర్పడింది...

Update: 2024-02-17 15:06 GMT
Water Tanker (Photo Credit : Facebook)

హైదరాబాద్ వాటర్ బోర్డు నగరంలో ప్రజలకు సరిపడా మంచినీటిని సరఫరా చేయక పోవడంతో నీళ్ల ట్యాంకర్లకు డిమాండ్ పెరిగింది. సాధారణంగా మార్చి నెల రెండో వారం నుంచి వాటర్ బోర్డు ట్యాంకర్లకు డిమాండ్ ఉంటుంది.కానీ ఈసారి ఫిబ్రవరి రెండో వారం నుంచే నీటి ట్యాంకర్లకు డిమాండ్ మొదలైంది. ఫిబ్రవరి నెల మొదటి వారం నుంచే రోజుకు 1500 ట్యాంకర్లు బుక్ అయ్యాయి. డిమాండుకు అనుగుణంగా వాటర్ బోర్డు అధికారులు మంచినీటిని సరఫరా చేయలేక పోతున్నారు.హైదరాబాద్ నగరంలో గత సంవత్సరం ఆశించిన మేర వర్షాలు కురవలేదు. దీంతో నగరంలోని మియాపూర్‌, కేపీహెచ్‌బీ, ప్రగతినగర్‌, నిజాంపేట్‌, మాదాపూర్‌, జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌, కొండాపూర్‌, గచ్చిబౌలి తదితర ప్రాంతాల్లో భూగర్భ జలాలు అడుగంటింది. దీంతో బోరుబావుల్లో నీరు అడుగంటుతోంది.

పెరిగిన నీటి ట్యాంకర్ల బుకింగ్

హైదరాబాద్ నగర ప్రజలు నీటి సమస్యను అధిగమించేందుకు వాటర్ బోర్డు ట్యాంకర్లను బుక్ చేస్తున్నారు. సాధారణంగా రోజుకు 500 నుంచి 700 వరకు ట్యాంకర్లను బుక్ చేస్తుంటారు. కానీ భూగర్భ జల మట్టం పడిపోవడంతో నీటి సమస్య వల్ల ట్యాంకర్ల బుకింగ్ లు రెట్టింపు అయ్యాయి. దీంతో రిజర్వాయర్ల వద్ద నీళ్ల ట్యాంకర్లు బారులు తీరుతున్నాయి. 24 గంటల ముందే ట్యాంకర్ బుక్ చేసినా డెలివరీ కావడం లేదని నగర ప్రజలు చెబుతున్నారు. డిమాండ్ వల్ల రోజుకు 400 ట్యాంకర్లు పెండింగులో ఉంచాల్సి వస్తుందని వాటర్ బోర్డు అధికారి చెప్పారు.

నీళ్ల ట్యాంకర్లపై ట్రాఫిక్ ఆంక్షలు

హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ పెరిగిన నేపథ్యంలో ట్రాఫిక్ పోలీసులు నగరంలో ట్యాంకర్ల రాకపోకలపై ఆంక్షలు విధించారు. ట్రాఫిక్ అవస్థలు ఏర్పడకుండా ప్రతీ రోజూ సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు ట్యాంకర్ల రాకపోకలపై ట్రాఫిక్ పోలీసులు నిషేధం విధించారు. వేసవి కాలంలో నగరంలో రెండు వేల నుంచి నాలుగు వేల నీటి ట్యాంకర్ల ద్వారా మంచినీటిని సరఫరా చేయాల్సి ఉంటుందని హైదరాబాద్ నగర వాటర్ బోర్డు అధికారి కృష్ణ చెప్పారు. నగరంలో ఉన్న 600 నీళ్ల ట్యాంకర్లలో చాలా వాటికి అనుమతుల గడువు ముగిసింది. దీంతో ట్యాంకర్ల కొరత ఏర్పడింది. ట్రాఫిక్ రద్దీ వల్ల ట్యాంకర్లు తరచూ ప్రమాదాలకు, ట్రాఫిక్ జామ్ లకు కారణమవుతున్నాయి.

నల్లా నీటి సరఫరాలో తరచూ అంతరాయాలు

వేసవి కాలానికి ముందే హైదరాబాద్ నగరంలో మంచినీటి సమస్యలు ఏర్పడ్డాయి. షేక్ పేట్ రిజర్వాయరుకు మంచినీటి సరఫరా లేదు...భోజగుట్ట రిజర్వాయరులో లో ప్రెషర్ వల్ల నీటి సరఫరాలో సమస్య ఏర్పడింది. బంజారాహిల్స్, ఎర్రగడ్డ రిజర్వాయర్లలోనూ నీటి ప్రెషర్ తగ్గింది. బోరబండ, లింగంపల్లి రిజర్వాయర్ల పరిధిలోని ప్రాంతాలకు నీరందించాలంటే వీటిలో సరిపడా నీటి నిల్వలు లేవు. విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో హైదరాబాద్ నగరంలో శుక్ర వారం నీటి సరఫరాలో సమస్యలు ఏర్పడ్డాయి. గత జనవరి నెల 3, 20 తేదీల్లోనూ నగరంలో పలు ప్రాంతాల్లో మంచినీటి సరఫరాలో సమస్యలు తలెత్తాయి. కృష్ణా డ్రింకింగ్ వాటర్ సప్లయి ఫేజ్ 1 ప్రాజెక్టు పరిధిలోని సంతోష్ నగర్ జంక్షన్ వద్ద పైపులైన్ పనుల వల్ల నీటి సరఫరాలో 24 గంటల పాటు అంతరాయం వాటిల్లింది.

మంచినీటికి కటకట

చాంద్రాయణగుట్ట ప్రాంతంలో నీటి లీకేజీలతో పలు పరాంతాల్లో నీటి సరఫరాలో అంతరాయం వాటిల్లింది. నల్లా నీటి సరఫరాలో అంతరాయం వల్ల తాము తరచూ అవస్థలు పడుతున్నామని అత్తాపూర్ ప్రాంతానికి చెందిన బీఎల్‌వీ ప్రసాద్ చెప్పారు. నల్లా నీరు సరిగా రాకపోవడంతో తాము తాగునీటికి కటకట ఏర్పడిందని పాతబస్తీకి చెందిన రమేష్ చెప్పారు. హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు చేపట్టిన మరమ్మతు పనుల కారణంగా హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో 24 గంటల పాటు నీటి సరఫరా నిలిచిపోతుంది.హైదరాబాద్‌లోని మిస్రిగంజ్, బహదూర్‌పురా, కిషన్ బాగ్, జహనుమా, మొఘల్ పురా మరియు దారుల్‌షిఫాతో సహా అనేక ప్రాంతాలు భారీ లీకేజీని అరికట్టడానికి చాంద్రాయణగుట్ట వద్ద మరమ్మతు పనుల కారణంగా నీటి సరఫరాలో అంతరాయం ఏర్పడింది.

వృథాగా పోతున్న మంచినీరు

హైదరాబాద్ నగరంలోని 74 రిజర్వాయర్ల నుంచి నీళ్ల ట్యాంకర్లను 15 లక్షల మందికి చేరవేయాలని ఈ వేసవిలో లక్ష్యంగా పెట్టుకున్నారు. రూ.500 రూపాయలకే 5వేల లీటర్ల ట్యాంకరును వాటర్ బోర్డు అందిస్తోంది. వాణిజ్య అవసరాల కోసం అయితే 5వేల లీటర్ల నీటిని 850 రూపాయలకు విక్రయిస్తున్నారు. రిజర్వాయర్ల వద్ద నీటిని ట్యాంకర్లలో నింపడంలో మంచినీరు వృథాగా పోతోంది. రోజుకు 17 లక్షల లీటర్ల నీటిని ట్యాంకర్ల ద్వారా సరఫరా చేస్తుండగా 60వేల లీటర్ల నీరు వృథా అవుతోందని వాటర్ బోర్డు అధికారులే చెబుతున్నారు.దీనికితోడు పైపులైన్ల లీకేజీల వల్ల కూడా నీరు వృథాగా రోడ్లపై పారుతోంది.

Tags:    

Similar News