సంక్షేమ పథకాలతో పేదరికం తగ్గింది...
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ పథకాల వల్ల ఆ రెండు రాష్ట్రాలతోపాటు దేశంలో పేదరికం గణనీయంగా తగ్గింది. గతంలో కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ప్రవేశపెట్టిన ఉపాధి హామీ పథకం వల్ల దేశంలోని కార్మికుల వేతనాలు పెరిగాయి. గతంలో ఒక్కో కూలీకి రోజువారీ వేతనం రూ.80 నుంచి వందరూపాయలుండేది. ఉపాధి హామీ పథకాన్ని కేంద్రం ప్రారంభించాక కనీస కూలీ గణనీయంగా పెరిగింది. దీంతోపాటు జాతీయ ఆహార భద్రత పథకం కింద దారిద్ర్యరేఖకు దిగువన ఉన్న పేదలకు ఉచితంగా బియ్యాన్ని పంపిణీ చేస్తుండటంతో ఆకలిచావులకు తెరపడింది. గతంలో తెలంగాణలోని మహబూబ్ నగర్, నల్గొండ, ఆదిలాబాద్ జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో నిరుపేదలు ఆకలికి అలమటిస్తూ మరణించేవారు. గతంలో ఉన్న ఆకలి చావులు సర్కారు చేపడుతున్న సంక్షేమ పథకాల అమలుతో ఆగిపోయాయని చెప్పవచ్చు. మొత్తం మీద తలసరి వ్యయం పెరిగిందని సర్వేలో వెల్లడవడంతో తెలుగు రాష్ట్రాలతోపాటు దేశంలో పేదరికం తగ్గిందని రుజువు అవుతోంది. ప్రైవేటు, సాఫ్ట్ వేర్ రంగాల్లో ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు జీతాలు ఎక్కువగా ఉండటంతో తలసరి వ్యయం పెరిగింది.
రెట్టింపు అయిన తలసరి వ్యయం
2022-23 సర్వేలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో కుటుంబాల నెలవారీ తలసరి వినియోగ వ్యయం గతంతో పోలిస్తే రెట్టింపు కంటే ఎక్కువగా ఉందని వెల్లడైంది. 2022-23 సంవత్సరంలో ధాన్యాలు,చక్కెర, పాలు, కూరగాయలు, పండ్లు, చేపలు, మాంసం, నూనె, తదితర ఆహారపదార్థాలకు నెలకు గ్రామీణ ప్రాంతాల్లో 1,750 రూపాయలు, పట్టణ ప్రాంతాల్లో 2,530 రూపాయలు ఖర్చు అవుతోందని తాజా సర్వేలో వెల్లడైంది. పాన్, పొగాకు, ఇంధన ఖర్చు, విద్యుత్, విద్య, వైద్యం, అద్దె, వస్త్రాలు లాంటి ఆహారేతర ఖర్చు అధికంగా అవుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఆహారేతర తలసరి ఖర్చు నెలకు 2,023రూపాయలు, పట్టణ ప్రాంతాల్లో 3,929 రూపాయలు అవుతోంది.
నేషనల్ శాంపిల్ సర్వే ఆఫీస్ విడుదల చేసిన డేటా ప్రకారం దేశంలో జరిగిన అభివృద్ధి స్థాయిని ప్రతిబింబిస్తూ 2011-12వ సంవత్సరంతో పోలిస్తే 2022-23వ సంవత్సరంలో తలసరి నెలవారీ గృహ వ్యయం రెండింతలు పెరిగింది.
తలసరి వ్యయంలో సిక్కిం టాప్
దేశంలోని గ్రామీణ ప్రాంతాల కంటే పట్టణ జనాభాలో సగటు తలసరి వ్యయం రెట్టింపు ఉందని జాతీయ సర్వేలో వెల్లడైంది. టాప్ 5 శాతం జనాభాలో గ్రామాల్లో సగటు తలసరి వ్యయం నెలకు రూ. 10,501కాగా పట్టణాల్లో రూ.20,824లకు పెరిగింది. దేశంలోనే గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోనూ సిక్కింలో తలసరి వ్యయం అత్యధికంగా ఉంది. పర్యాటక ప్రాంతంగా విశేష అభివృద్ధి చెందిన సిక్కింలో నెలసరి తలసరి వ్యయం దేశంలోనే అధికంగా ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో తలసరి నెలవారీ వ్యయం రూ.7,787 ఉండగా పట్టణ ప్రాంతాల్లో తలసరి వ్యయం 12, 125రూపాయలకు పెరిగింది. పేద రాష్ట్రంగా పేరొందిన ఛత్తీస్ ఘడ్ రాష్ట్రంలో దేశంలోనే అత్యంత తక్కువగా అంటే గ్రామీణ ప్రాంతాల్లో రూ.2,575, పట్టణ ప్రాంతాల్లో 4,557 రూపాయలు తలసరి వ్యయం చేస్తున్నారు. దేశంలో తలసరి వ్యయం విషయంలో గ్రామీణ, పట్టణాల మధ్య మేఘాలయ, ఛత్తీస్ ఘడ్, జార్ఖండ్ రాష్ట్రాల్లో వ్యత్యాసం ఎక్కువగా ఉందని సర్వేలో తేలింది.
ఆహారేతర వ్యయమే అధికం
గృహ వినియోగ వ్యయాల్లో కేంద్రపాలిత ప్రాంతాల్లో చంఢీఘడ్ లో అత్యధికంగా 7,467 రూపాయలు వెచ్చిస్తున్నారు. అదే పట్టణప్రాంతాల్లో అయితే 12,577 రూపాయలు ఖర్చు అవుతోంది. జమ్మూకశ్మీర్ పరిధిలోని లడఖ్ ప్రాంతంలో అత్యల్పంగా తలసరి వినియోగ వ్యయం రూ.4,062 ఉంది. లక్షద్వీప్ లో రూ.5,511 తలసరి వ్యయం అవుతోంది. ఆహార పదార్థాలైన నూనె, గుడ్డు, చేపలు, మాంసం, కూరగాయలపై గృహ వినియోగదారుల వ్యయంపై ఆధారపడి ఉంటుంది. ఆహార పదార్థాల్లో పండ్లు, సుగంధ ద్రవ్యాలు, పానీయాలు, రిఫ్రెష్‌మెంట్‌లు, ప్రాసెస్ చేసిన ఆహారం, పాన్, పొగాకు, మత్తు పదార్థాలు కూడా కలిపారు.దేశంలోని గ్రామీణ, పట్టణ కుటుంబాల మొత్తం వ్యయంలో తృణధాన్యాలు,ఆహార వినియోగం యొక్క వాటా గణనీయంగా పడిపోయిందని సర్వే సూచిస్తుంది. దేశంలో ఆహార ఖర్చులు తగ్గిపోవడంతో, అభివృద్ధి పుంజుకుంది. తాజా జరిపిన గృహ వినియోగ వ్యయ సర్వేలో గ్రామీణ, పట్టణ ప్రాంతాల రెండింటికీ ఆహార వ్యయం తక్కువగా ఉందని తేలింది.
పేదరికం 5 శాతానికి తగ్గింది : నీతి ఆయోగ్ సీఈఓ బి.వి.ఆర్. సుబ్రహ్మణ్యం
దేశంలో పేదరికం 5 శాతం దిగువకు తగ్గిందని, గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని ప్రజలు మరింత సంపన్నులు అవుతున్నారని తాజా గృహ వినియోగదారుల వ్యయ సర్వే సూచిస్తోందని నీతి ఆయోగ్ సీఈవో బి.వి.ఆర్. సుబ్రహ్మణ్యం వ్యాఖ్యానించారు.దిగువన ఉన్న 5 శాతం మంది పేద ప్రజల తలసరి సగటు నెలవారీ వ్యయం గ్రామీణ ప్రాంతాల్లో రూ. 1,373, పట్టణ ప్రాంతాల్లో రూ. 2,001గా ఉందని సర్వే వెల్లడించింది.కేంద్ర ప్రభుత్వం తీసుకున్న పేదరిక నిర్మూలన చర్యలు వినియోగదారుల వ్యయ సర్వేలో ప్రతిబింబిస్తున్నాయని సుబ్రహ్మణ్యం విలేకరులతో అన్నారు.మనం దారిద్య్ర రేఖను తీసుకుని, దానిని వినియోగదారుల ధరల సూచీతో పోలిస్తే దేశంలో కేవలం 5శాతం మంది మాత్రమే పేదరికంలో ఉన్నారని వెల్లడైంది. ఉచిత ఆహార ధాన్యాల పంపిణీ, వారి పిల్లలకు సైకిళ్లు, పాఠశాల యూనిఫాంలు వంటి వస్తువులను పంపిణీ చేయడం వల్ల పేదరికం తగ్గిందని సర్వేలో తేలింది.
ఉపాధి హామీ పథకంతో పేదరికం తగ్గింది : తెలంగాణ రాష్ట్ర ప్లానింగ్ బోర్డు మాజీ డైరెక్టర్ షేక్ మీరా
ఉపాధి హామీ పథకం, సంక్షేమ పథకాలతో పేదరికం తగ్గిందని తెలంగాణ రాష్ట్ర ప్లానింగ్ బోర్డు మాజీ డైరెక్టర్, హెఛ్ఎండీఏ ప్రణాళికాధికారి షేక్ మీరా ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. ఉచితంగా బియ్యం పంపిణీ చేయడంతోపాటు పలు సంక్షేమ పథకాల కింద కుటుంబానికి లబ్ధి చేకూరుతుండటంతో పేదల సంఖ్య తగ్గిందని మీరా పేర్కొన్నారు. సమాజంలో నేడు అన్ని వర్గాల ప్రజల ఆదాయాలు పెరగడం వల్ల వారి తలసరి వ్యయం కూడా పెరిగిందని ఆయన చెప్పారు. సగటు తలసరి ఆదాయం పెరగడంతోపాటు అన్నపూర్ణ పథకాల కింద పేదలకు ఉచితంగా బియ్యం పంపిణీ చేస్తుండటం వల్ల వారి సగటు ఆదాయంతోపాటు వ్యయం కూడా పెరిగిందని మీరా వివరించారు.