హైదరాబాద్‌లో ఈ సారి పతంగ్ ఎగిరేనా?

వచ్చే ఎంపీ ఎన్నికల్లో హైదరాబాద్‌లో కాషాయ జెండా ఎగుర వేసేందుకు కమలనాథులు వ్యూహాలు రూపొందిస్తున్నారు. దీనికి ప్రతిగా ఎంపీ అసదుద్దీన్ ప్రతి వ్యూహాలు పన్నుతున్నారు.

Update: 2024-03-01 04:50 GMT
MP Asaduddin Owaisi (Photo Credit : AIMIM)

హైదరాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో బీజేపీ, మజ్లిస్ పార్టీల వ్యూహ, ప్రతి వ్యూహాలతో ఇక్కడి రాజకీయాలు వేడెక్కాయి. గతంలో వరుస విజయాలతో మజ్లిస్ కంచుకోటగా ఉన్న హైదరాబాద్ నియోజకవర్గంలో అసదుద్దీన్ ఓవైసీకి ఈ సారి ప్రత్యర్థి నుంచి బలమైన పోటీ ఉంటుందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ఎందుకంటే ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నాంపల్లి, యాకుత్‌పురా నియోజకవర్గాల్లో ఏఐఎంఐఎం గట్టి పోటీని ఎదుర్కొంది. మజ్లిస్ యాకుత్‌పురా అభ్యర్థికి ఎంబీటీ నాయకుడు అమ్జదుల్లా ఖాన్ గట్టి పోటీ ఇచ్చి కేవలం 878 ఓట్ల తేడాతో ఓడిపోయారు. నాంపల్లిలోనూ కాంగ్రెస్ పార్టీతో హోరాహోరీ పోరు సాగింది.దీంతో లండన్ లో బారిస్టర్ న్యాయవాద కోర్సు చదివిన అసదుద్దీన్ ఈ సారి ఎన్నికల్లో మరోసారి తన సత్తా చాటేందుకు కొత్త వ్యూహాలతో సమాయత్తమవుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే మజ్లిస్ నాయకత్వం లోక్‌సభ ఎన్నికల ప్రచారానికి దిగింది. హైదరాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గంలో ఆ పార్టీ నాయకులు వరుసగా అభివృద్ధి పనులను ప్రారంభించారు. అభివృద్ధి పనుల పురోగతిని సమీక్షించడానికి నిరంతరం తనిఖీలు చేస్తున్నారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజు మార్చి 2వతేదీని పార్లమెంటు ఎన్నికలకు పార్టీ క్యాడర్ ను సమాయత్తం చేసేలా మలుచుకునేందుకు మజ్లిస్ సమాయత్తమవుతోంది. శనివారం పాత నగరం నలుమూలల నుంచి ర్యాలీలు చేపట్టి, హైదరాబాద్‌లోని దారుస్సలాంలో తన బలాన్ని చాటుకోవాలని మజ్లిస్ నిర్ణయించింది.త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఆవిర్భావ దినోత్సవం కీలకమైన ఘట్టంగా ఆ పార్టీ పరిగణిస్తోంది.


కమలనాథుల వ్యూహాలు
మజ్లిస్ పార్టీ కంచుకోట అయిన హైదరాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో పాగా వేయాలనే లక్ష్యంతో కమలనాథులు వ్యూహాలు రూపొందిస్తున్నారు. హైదరాబాద్‌ స్థానాన్ని అమిత్ షా ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని ఈ సారి అసదుద్దీన్‌ను కట్టడి చేయాలని నిర్ణయించారు. ఈ సారి ఎన్నికల్లో వై నాట్ హైదరాబాద్ అనే నినాదంతో తాము అక్కడ కూడా గెలుస్తామని సాక్షాత్తూ తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, కేంద్రమంత్రి జి కిషన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. హైదరాబాద్ పార్లమెంట్ ఎన్నికల్లో మజ్లిస్ అభ్యర్థి అసదుద్దీన్ ఒవైసీని ఓడిస్తామని బీజేపీ ప్రకటించింది. దీనిలో భాగంగా అసద్ పై బలమైన హిందూ అభ్యర్థిని ఎన్నికల బరిలోకి దించాలని నిర్ణయించారు. హిందూ ఓట్లను ఏకపక్షంగా రాబట్టగలిగే అభ్యర్థిని ఈ సారి పోటీ చేయించాలని బీజేపీ నేతలు యోచిస్తున్నారు. గోషామహల్ అసెంబ్లీ నియోజకవర్గంలో హ్యాట్రిక్ విజయాలు సాధించిన రాజాసింగ్ ను బీజేపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేపిస్తే ఎలా ఉంటుందనే అంశంపై కమలనాథులు సర్వే కూడా జరిపారు. హైదరాబాద్ ఎంపీ సీటును ఈ సారి కైవసం చేసుకుంటామని ఆదిలాబాద్ బీజేపీ ఎమ్మెల్యే పాయల శంకర్
‘ఫెడరల్ తెలంగాణ’
కు చెప్పారు.

పంచముఖ పోరు ఏర్పడనుందా?
హైదరాబాద్ పార్లమెంటు స్థానంలో ఎవరికివారుగా వేర్వేరుగా ఎన్నికల్లో పోటీ చేస్తే మజ్లిస్ పార్టీ అభ్యర్థి విజయం సునాయాసమవుతుందని భావిస్తున్నారు. హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో అన్ని రాజకీయ పార్టీలు సొంతంగా ఎన్నికల్లో పోటీ చేసేందుకు సమాయత్తమవుతున్నాయి. ఈ స్థానం నుంచి భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్, భారత రాష్ట్ర సమితి, మజ్లిస్ బచావో తెహ్రీక్ (ఎంబీటీ)లతో ఎఐఎంఐఎం పార్టీ అభ్యర్థులు బరిలో నిలిస్తే పంచముఖ పోరు ఉంటుంది. పంచముఖ పోరులో హిందూ ఓట్లను ఏకీకృతం చేసేలా బలమైన అభ్యర్థిని రంగంలోకి దించితే బీజేపీకి కూడా విజయావకాశాలుంటాయని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. దీని కోసం గట్టి వ్యూహాలు రూపొందిస్తున్నారు. ఈ సారి పాతబస్తీలో బీజేపీ విజయం కోసం గట్టి ప్రయత్నం చేస్తుందని హిందూ ఓట్లు ఏకీకృతం అయితే ఆ పార్టీ అభ్యర్థికి కూడా విజయావకాశాలున్నాయని హైదరాబాద్ నగరానికి చెందిన సీనియర్ జర్నలిస్ట్, ఆర్ఎస్ఎస్ క్రియాశీల సభ్యుడు గోనే రాజేంద్రప్రసాద్
‘ఫెడరల్ తెలంగాణ’
కు చెప్పారు.

మజ్లిస్ కంచుకోట...హైదరాబాద్
హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో మజ్లిస్ పార్టీ వరుస విజయాలతో ఆ పార్టీకి కంచుకోటగా మారింది. 1984 పార్లమెంట్ ఎన్నికల్లో మొట్టమొదటి సారి సుల్తాన్ సలావుద్దీన్ ఒవైసీ విజయం సాధించారు. నాటి నుంచి 1984,1989,1991,1996,1998,1999 సంవత్సరాల్లో జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో ఆరుసార్లు సలావుద్దీన్ ఒవైసీ విజయం సాధించారు. అనంతరం 2004వ సంవత్సరంలో పార్లమెంటు బరిలో దిగిన అసదుద్దీన్ ఓవైసీ లక్ష ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించారు. అనంతరం 2009, 2014, 2019 సంవత్సరాల్లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో అసదుద్దీన్ ఓవైసీ ఎంపీగా విజయం సాధించారు. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రత్యర్థి పార్టీల నుంచి గట్టి పోటీ ఎదుర్కొన్న మజ్లిస్ పార్లమెంటు ఎన్నికల్లో మాత్రం అసదుద్దీన్ ఒవైసీ వైపే పాతబస్తీ ఓటర్లు మొగ్గు చూపే అవకాశముందని పాత నగరానికి చెందిన సీనియర్ జర్నలిస్ట్ షేక్ ముజాహిద్ ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు.



 మజ్లిస్ 66వ ఆవిర్భావ దినోత్సవం రేపు

తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ కేంద్రంగా ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) పార్టీ ఏర్పడి రేపటికి 66 ఏళ్లు కానుంది. మజ్లిస్ 66 వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఆ పార్టీ ప్రధాన కార్యాలయం అయిన దారుస్సలాంలో రేపు సమావేశం జరగనుంది. మజ్లిస్ ఆవిర్భావం తర్వాత 1960 వసంవత్సరంలో జరిగిన హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో 24 డివిజన్లలో గెలిచి ప్రధాన ప్రతిపక్షంగా ఆవిర్భవించింది. సుల్తాన్ సలావుద్దీన్ ఒవైసీ నగరంలోని మల్లేపల్లి డివిజన్ నుంచి కార్పొరేటరుగా ఎన్నికయ్యారు. అనంతరం 1962వ సంవత్సరంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగి, హైదరాబాద్‌లోని ఫత్తర్ గట్టి నియోజకవర్గం నుంచి సుల్తాన్ సలావుద్దీన్ ఒవైసీ ఎన్నికయ్యారు. 1967 ఎన్నికల్లో మూడు అసెంబ్లీ స్థానాలను మజ్లిస్ కైవసం చేసుకుంది. సుల్తాన్ సలావుద్దీన్ ఒవైసీ మజ్లిస్ పార్టీ అధ్యక్షునిగా బాధ్యతలు స్వీకరించి, 34 సంవత్సరాలు నిరంతరాయంగా ఆ పదవిలో కొనసాగారు.

పాతబస్తీలో ఒవైసీ కుటుంబం పాగా
పాతబస్తీలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒవైసీ కుటుంబం పాగా వేసింది. గతంలో ఎంపీగా ఉన్న సలావుద్దీన్ ఒవైసీ మరణానంతరం అతని ఇద్దరు కుమారులు అసదుద్దీన్ ఒవైసీ, అక్బరుద్దీన్ ఒవైసీలు వరుస విజయాలతో ప్రజాప్రతినిధులుగా కొనసాగుతున్నారు. ఓటమి ఎరగని వీరుల్లా ఒవైసీ బ్రదర్స్ రాజకీయాల్లో తనదైన పాత్ర పోషిస్తున్నారు. 1984 పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేసిన సుల్తాన్ సలావుద్దీన్ ఒవైసీ విజయం సాధించారు. నాటి నుంచి వరుసగా ఆరుసార్లు ఎంపీగా గెలిచారు. 2002లో ఎంసీహెచ్ ఎన్నికలు జరిగినప్పుడు మజ్లిస్ మళ్లీ అతిపెద్ద పార్టీగా అవతరించింది. 2007వ సంవత్సరంలో అసెంబ్లీ నుంచి మొట్టమొదటిసారి శాసససభ మండలి ఎన్నికతో రాష్ట్ర శాసన మండలిలోకి ప్రవేశించింది. తండ్రి సాలార్ మరణం తర్వాత అతని పెద్దకుమారుడైన బారిస్టర్ అసదుద్దీన్ ఒవైసీ పార్టీ పగ్గాలు చేపట్టారు. అసద్ నేతృత్వంలో 2009 గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో మజ్లిస్ విజయం సాధించింది. తెలంగాణలో గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మజ్లిస్ మలక్ పేట, నాంపల్లి, కార్వాన్, చార్మినార్, చాంద్రాయణగుట్ట, యాకుత్ పురా, బహదూర్ పురా సీట్లను గెల్చుకొని తన సత్తాను చాటుకుంది.

బీఆర్ఎస్‌తోనే మజ్లిస్ స్నేహ సంబంధాలు కొనసాగనున్నాయా?
తెలంగాణలో జరగనున్న లోక్‌సభ ఎన్నికల కోసం ఏఐఎంఐఎం,బీఆర్‌ఎస్ స్నేహపూర్వక సంబంధాలను కొనసాగించే అవకాశం కనిపిస్తోంది. గత ఏడాది జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత గత రెండు నెలలుగా ఆ పార్టీ కూడా మజ్లిస్‌తో అంతర్గతంగా అవగాహనకు వచ్చినట్లు కనిపిస్తోంది. కొత్త అసెంబ్లీలో ప్రొటెం స్పీకరుగా అక్బరుద్దీన్ ఒవైసీకి అవకాశం కల్పించారు. కాంగ్రెస్ సీఎం రేవంత్ రెడ్డి అక్బరుద్దీన్ తో కలిసి మూసీ నది తీర ప్రాంతం అభివృద్ధిపై చర్చించేందుకు లండన్ వెళ్లారు. అనంతరం హైదరాబాద్ నగర అభివృద్ధిపై నిర్వహించిన సమీక్షా సమావేశాల్లోనూ సీఎం రేవంత్ అక్బరుద్దీన్ కు ప్రాధాన్యం ఇచ్చారు. కాంగ్రెస్ రాబోయే పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని మజ్లిస్ తో స్నేహపూర్వక సంబంధం పెట్టుకునేందుకు ప్రయత్నిస్తోంది.

కాంగ్రెస్, బీజేపీల మధ్యే ప్రధాన పోరు
తెలంగాణలో మొత్తం 17 లోక్‌సభ స్థానాలు ఉండగా, బీఆర్‌ఎస్‌ గతంలో తొమ్మిది స్థానాలను గెలుచుకుంది. కాంగ్రెస్ మూడు స్థానాలు, భారతీయ జనతా పార్టీ నాలుగు, ఎఐఎంఐఎం ఒకటి చొప్పున గెలిచాయి. ఈసారి కాంగ్రెస్ అధికారంలో ఉన్నందున, బీఆర్‌ఎస్ తక్కువ సీట్లు గెలుచుకునే అవకాశం ఉందని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. పార్లమెంటరీ ఎన్నికలకు సంబంధించిన ఓటింగ్ సరళి జాతీయ సమస్యలపై ఉన్నందున బీజేపీ, కాంగ్రెస్ మధ్య ప్రత్యక్ష పోరు ఉంటుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీతో మజ్లిస్ కు స్నేహపూర్వక పొత్తు కొనసాగుతుందని భావిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో ఫిరోజ్ ఖాన్ ఇతర నేతలు ఉన్నందున వారితో మజ్లిస్ కలిసి పనిచేయదని కోట్ చేయడానికి ఇష్టపడని మజ్లిస్ పార్టీకి చెందిన ఓ నాయకుడు వ్యాఖ్యానించారు.




Tags:    

Similar News