నేత్ర వైద్యంలో వరల్డ్ ఐకాన్ డాక్టర్ ఎన్ రావు విజయ ప్రస్థానం

ఎల్వీ ప్రసాద్ ఐ ఇన్‌స్టిట్యూట్ వ్యవస్థాపకులు డాక్టర్ గుళ్లపల్లి ఎన్ రావుకు వరల్డ్ ఐకాన్స్ 21 అవార్డు లభించింది. డాక్టర్ రావు విజయ ప్రస్థానంపై ప్రత్యేక కథనం...

Update: 2024-03-01 10:30 GMT
World EyeCon DR Gullapalli N.Rao

డాక్టర్ గుళ్లపల్లి ఎన్ రావు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల్లోని 290 ఎల్వీపీఈఐ కేంద్రాల ద్వారా నేత్రవైద్యసేవలు అందిస్తున్నారు.

21వ శతాబ్దంలో ప్రపంచంలో నేత్ర సంరక్షణకు డాక్టర్ ఎన్ రావు చేసిన అసాధారణ కృషికి గుర్తింపుగా ఆసియా ఫసిఫిక్ జర్నల్ ఆఫ్ అఫ్తాల్మాలజీ గుర్తించింది. ప్రపంచ వ్యాప్తంగా టాప్ టెన్ ప్రభావవంతమైన నేత్ర వైద్యుడిగా ఈయన గుర్తింపు పొందారు. ఇటీవల ఇండోనేషియాలోని బాలి నగరంలో జరిగిన 39వ ఆసియా పసిఫిక్ అకాడెమీ ఆఫ్ ఆప్తాల్మాలజీ సమావేశంలో ఎల్‌వి ప్రసాద్ ఐ ఇన్‌స్టిట్యూట్ వ్యవస్థాపకుడు డాక్టర్ గుళ్లపల్లి ఎన్ రావుకు ఈ అవార్డును ప్రదానం చేశారు.


ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లా చోడవరం గ్రామంలో పుట్టి గుంటూరు మెడికల్ కళాశాల, ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, అమెరికాలోని టఫ్ట్స్ యూనివర్శిటీ, రోచెస్టర్ లో నేత్ర వైద్య విద్య అభ్యసించారు. అనంతరం యూఎస్ రోచెస్టర్ యూనివర్శిటీలోనే 1986వ సంవత్సరం వరకు ఫ్యాకల్టీగా పనిచేశారు. కార్నియా, కమ్యూనిటీ నేత్ర వైద్యంలో స్పెషలిస్ట్ అయిన డాక్టర్ ఎన్ రావు తన విజయ ప్రస్థానాన్ని ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు...ఆ వివరాలు...ఆయన మాటల్లోనే...


నాన్నే నా మార్గదర్శకుడు...
‘‘మా నాన్న డాక్టర్ గుళ్లపల్లి వెంకటేశ్వరరావే నాకు మార్గదర్శకుడు. 1953వ సంవత్సరంలో గుంటూరు నగరంలో మొట్టమొదటి కంటి వైద్యుడిగా ఆసుపత్రి నడిపారు. నా తండ్రి సలహాతో గుంటూరు మెడికల్ కాలేజీలో వైద్యవిద్య అభ్యసించాను. అనంతరం నా తండ్రి బాటలో పయనించాలనే లక్ష్యంతో ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో ఆప్తాల్మాలజీ పీజీ కోర్సులో చేరాను. ఢిల్లీ ఎయిమ్స్‌లో చదువుకునే అవకాశం లభించడంతో నా జీవితం అక్కడే మలుపు తిరిగింది. నలుగురు వైద్యులు అందించిన స్ఫూర్తితో నేను ముందడుగు వేయడంతో ప్రభావవంతమైన నేత్ర వైద్యుడిగా ప్రపంచంలోనే గుర్తింపు లభించింది. దీనికి కారణం నాకు నలుగురు గురువులు అందించిన ప్రోత్సాహమే కారణం.’’

గురువుల సలహాలతోనే జీవితం మలుపు తిరిగింది...
‘‘డాక్టర్ రాజేంద్రప్రసాద్ సెంటర్ ఫర్ అఫ్తాల్మాక్స్ మాజీ చీఫ్ ప్రొఫెసర్ ఎల్ పి అగర్వాల్, ఎయిమ్స్ మాజీ డైరెక్టర్ ప్రొఫెసర్ రామలింగస్వామిల పరిచయంతో నా జీవితం మలుపుతిరిగింది. నేత్ర వైద్యంలో పీజీ చేశాక అమెరికా వెళ్లి అక్కడి యూనివర్శిటీలో చేరాను. అమెరికాలోని బోస్టన్ నగరంలో ఉన్న టఫ్ట్స్ యూనివర్శిటీ న్యూ ఇంగ్లాండ్ మెడికల్ సెంటరులో చదువుకునేటపుడు అప్పటి డాక్టర్ జూల్స్ బామ్ నుంచి ఎన్నో పాఠాలు నేర్చుకున్నాను. కంటి రోగిని ఎలా శ్రద్ధగా చూడాలో ఆయనే నేర్పించారు. రోగిని శ్రద్ధగా చూడటంతోపాటు కంటి శస్త్రచికిత్సలు ఎలా చేయాలో ఆయన నేర్పించారు. అనంతరం నేను అమెరికాలోని న్యూయార్క్ నగరంలోని రోచెస్టర్ యూనివర్శిటీ ఫ్లామ్ ఐ ఇన్ స్టిట్యూట్ లో చదువుకున్నాను. అఫ్తల్మాలజీ ఫ్రొఫెసర్ డాక్టర్ జేమ్స్ అక్వావెల్లా ఇచ్చిన సలహాలతో ప్రపంచంలోనే మెరుగైన నేత్రవైద్యుడిగా సేవలు చేసే అవకాశం నాకు లభించింది. నేను ప్రస్థుతం ఈ స్థాయికి చేరుకున్నానంటే నాకు చదువు చెప్పిన గురువుల ప్రభావమే ప్రధాన కారణం.ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ వైద్యులు, నోబెల్ బహుమతి గ్రహీతలతో కలిసి పనిచేసే అవకాశం నాకు లభించింది. నాకున్న ప్రపంచ స్థాయి వైద్య నిపుణులతో ఉన్న పరిచయాలతో నేత్ర వైద్యంలో ఎల్వీ ప్రసాద్ ఐ ఇన్‌స్టిట్యూట్ ను ప్రపంచ స్థాయికి తీసుకువెళ్ల గలిగాను.’’



 అమెరికా నుంచి హైదరాబాద్‌కు వచ్చి...

‘‘1986వ సంవత్సరంలో అమెరికా దేశాన్ని వదిలి సొంత రాష్ట్రానికి వచ్చి, 1987వ సంవత్సరంలో హైదరాబాద్ కేంద్రంగా ఎల్వీ ప్రసాద్ ఐ ఇన్‌స్టిట్యూట్ ను ప్రారంభించాను. అప్పటి ముఖ్యమంత్రి ఎన్ టి రామారావు, ఎల్వీ ప్రసాద్ చేయూతతో బంజరాహిల్స్ ప్రాంగణం కేంద్రంగా ఐ ఇన్‌స్టిట్యూట్ తెరిచాం. అనంతరం కిస్మత్ పూర్ లో ఎన్టీఆర్ భూమి కేటాయించడంతో అక్కడ ఆఫ్తమాలజీ కోర్సులు ప్రవేశపెట్టాం. నేత్ర వైద్యంతో పాటు పరిశోధనలు, పునరావాసం, అధునాతన నాణ్యమైన నేత్ర వైద్య సేవలను ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చాను. నేత్ర వైద్యంలో నేను రాసిన 300 పరిశోధనాపత్రాలను అంతర్జాతీయ జర్నల్స్ లలో ప్రచురిత మయ్యాయి. నేత్రవైద్యంలో వచ్చిన మార్పులకు అనుగుణంగా అధునాతన వైద్యాన్ని ఎల్వీపీఈఐలో అందుబాటులోకి తీసుకువచ్చాను. కంటి వ్యాధులకు మెరుగైన చికిత్స అందించడంతోపాటు కంటి వ్యాధులు రాకుండా ముందుజాగ్రత్తలు తీసుకునేందుకు మా ఎల్వీపీఈఐ వైద్యులు కృషి చేస్తున్నారు. దీంతోపాటు పుట్టుకతో కంటి చూపు కోల్పోయిన వారికి పునరావాసం కల్పించడం, వరల్డ్ క్లాస్ నేత్ర వైద్యాన్ని రోగులకు అందించడంతో మా ఆసుపత్రికి ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తింపు లభించింది. విజన్ 2020తో నేత్ర వైద్యరంగంలో విశిష్ఠ ప్రగతి సాధించాం.’’

లిబేరియా దేశంలోనూ వైద్యసేవలు అందిస్తున్నాం...
‘‘లిబేరియా దేశ అధ్యక్షుడి వినతిపై లిబేరియా దేశ రాజధాని నగరమైన మోన్ రోవియాలో ఎల్వీ ప్రసాద్ ఐ ఇన్ స్టిట్యూట్ కేంద్రాన్ని ఏర్పాటు చేసి నేత్రవైద్య సేవలు అందిస్తున్నాం. నేను ప్రారంభించిన ఎల్వీ ప్రసాద్ ఐ ఇన్‌స్టిట్యూట్ ద్వారా మూడు రాష్ట్రాల్లోని లక్షలాదిమంది రోగులకు నేత్ర వైద్య సేవలు అందించాలన్నదే నా జీవితాశయం. పేదలకు ఉచిత వైద్యంతోపాటు రోగులు అందరికీ మెరుగైన అధునాతన కంటి వైద్యాన్ని అందుబాటులోకి తీసుకురావాలన్నదే నా లక్ష్యం. ఆ లక్ష్యసాధనలో నేను, నా ఎల్వీపీఈఐ వైద్యులు నిత్యం శ్రమిస్తూనే ఉంటాం.’’ అని తన జీవిత ప్రస్థానాన్ని ముగించారు.






Tags:    

Similar News