సీఏఏ అమలుపై స్టే ఇవ్వండి..సుప్రీం కోర్టెక్కిన ఒవైసీ

సీఏఏ చట్టం అమలును నిలిపివేయాలని కోరుతూ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.ఈ పిటిషన్లను మార్చి 19వతేదీన విచారించేందుకు సుప్రీం అంగీకరించింది.

Update: 2024-03-16 11:11 GMT
AIMIM president Asaduddin Owaisi

పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) 2019, దాంతో పాటు వాటి రూల్స్ 2024 అమలుపై స్టే విధించాలని కోరుతూ హైదరాబాద్ సిట్టింగ్ ఎంపీ, ఎఐఎంఐఎం పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ శనివారం సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. సీఏఏ చట్టం రాజ్యాంగ చెల్లుబాటును ఆయన సుప్రీంకోర్టులో సవాలు చేశారు. దేశంలో ఈ కొత్త చట్టాన్ని అమలు చేయడం ద్వారా వాతావరణాన్ని చెడగొట్టేందుకు, ప్రజల దృష్టి మరల్చేందుకు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ సర్కారు ప్రయత్నిస్తుందని అసద్ ఆరోపించారు.వివాదాస్పద చట్టాన్ని పార్లమెంటు ఆమోదించిన నాలుగేళ్ల తర్వాత ఈ ఏడాది మార్చి 11వతేదీన నిబంధనల నోటిఫికేషన్‌తో సీఏఏను అమలు చేశారని ఆయన పేర్కొన్నారు.


దరఖాస్తుల ప్రాసెసింగ్ నిలిపివేయండి
చట్టపరమైన చర్యలు ఒక పరిష్కారానికి వచ్చే వరకు సవరించిన పౌరసత్వ చట్టం కింద దరఖాస్తుల ప్రాసెసింగ్ ను నిలిపివేయాలని ఒవైసీ కోరారు. పౌరసత్వ సవరణ చట్టం, దీంతో పాటు ఉన్న నిబంధనలను రెండింటిని తుది తీర్పు వెలువడే వరకు అమలు చేయవద్దని అసద్ కోర్టును అభ్యర్థించారు. సీఏఏ ప్రభావంపై దేశంలో జరిగిన ఆందోళనలు, అసోం రాష్ట్రంలో ముస్లింలు, ఇతర అట్టడుగు వర్గాలకు చెందిన వారి పేర్లను నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ జాబితా నుంచి మినహాయించారని ఆయన పేర్కొన్నారు. సీఏఏ వల్ల ముస్లిం దరఖాస్తుదారులు అనిశ్చిత పరిస్థితిని ఎదుర్కొంటుండగా, హిందువులకు పౌరసత్వం కల్సిస్తామని అసోం సీఎం హిమంత బిస్వాశర్మ హామీ ఇస్తూ చాటిన అసమానతలను ఒవైసీ ప్రశ్నించారు.

మతం ఆధారంగా వివక్ష
మతం ఆధారంగా వివక్ష చూపించే సీఏఏ చట్టాల వల్ల రాజ్యాంగ సూత్రాలు ప్రమాదంలో పడతాయని ఒవైసీ పేర్కొన్నారు. పార్లమెంటు ఎన్నికలకు ముందు సీఏఏ అమలుకు కేంద్ర హోంమంత్రిత్వశాఖ నిబంధనలను ప్రవేశపెట్టడం వల్ల వివాదానికి ఆజ్యం పోసినట్లయిందని చెప్పారు. పొరుగు దేశాల వలసదారులకు భారతీయ పౌరసత్వం మంజూరుకు రూపొందించిన సీఏఏ చట్టం మత సమూహాలను లక్ష్యంగా చేసుకుందని ఆయన పేర్కొన్నారు. మతపరమైన అనుబంధంతో సంబంధం లేకుండా పౌరులందరికీ ప్రాథమిక హక్కుల రక్షణను నిర్ధారించడానికి చర్యలు తీసుకోవాలని కోరారు.

ముస్లిమేతర వలసదారులకు భారత పౌరసత్వం
పౌరసత్వ సవరణ చట్టం 2019 అమలుపై స్టే విధించేలా కేంద్రాన్ని ఆదేశించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లను మార్చి 19వతేదీన విచారించేందుకు సుప్రీంకోర్టు శుక్రవారం అంగీకరించింది. సీఏఏపై కేరళకు చెందిన రాజకీయ పార్టీ ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్, మరో ముగ్గురు మధ్యంతర పిటిషన్లు దాఖలు చేశారు.పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్,బంగ్లాదేశ్ ల నుంచి వలస వచ్చిన ముస్లిమేతర వలసదారులైన హిందువులు, సిక్కులు, జైనులు, బౌద్ధులు, పార్శీలు, క్రైస్తవులకు భారత పౌరసత్వం కల్పించే ప్రక్రియను మోదీ సర్కారు ప్రారంభించింది.
కేంద్ర ప్రభుత్వ గెజిట్ నోటిఫికేషన్ ప్రకారం ఈ సీఏఏ నిబంధనలు తక్షణమే అమల్లోకి వచ్చాయి.వివాదాస్పద సీఏఏపై 2019 చివరిలో, 2020 ప్రారంభంలో వివక్షాపూరిత నిబంధనలపై దేశంలోని వివిధ ప్రాంతాల్లో నిరసనలు వెల్లువెత్తాయి. ఈ చట్టంపై స్టే విధించేందుకు నిరాకరిస్తూనే, సుప్రీంకోర్టు 2019వ సంవత్సరం డిసెంబర్ 18వతేదీన పిటిషన్లపై కేంద్రానికి నోటీసులు జారీ చేసింది.


Tags:    

Similar News