మంత్రుల ఇన్ కం టాక్స్ కూడా ప్రభుత్వమే చెల్లించాలా?

తెలంగాణ రాష్ట్రంలో ప్రజాధనం పక్కదారి పడుతోంది. కేబినెట్ ర్యాంక్ ఉన్న ప్రజాప్రతినిధులకు భారీగా జీతభత్యాలు ఇవ్వడమే కాకుండా, వారి ఆదాయపుపన్ను చెల్లిస్తున్నారు.

Update: 2024-03-20 12:47 GMT
Telangana Secretariate

తెలంగాణ రాష్ట్రంలో కేబినెట్ ర్యాంకు ఉన్న ప్రజాప్రతినిధులకు భారీగా  జీతభత్యాలు ఇవ్వడమే కాకుండా వారి ఆదాయపు పన్నుకూడా రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తోంది. 

తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మంత్రులు, అసెంబ్లీ స్పీకర్, డిప్యూటీ స్పీకర్, శాసనమండలి ఛైర్మన్, ఉప ఛైర్మన్, కేబినెట్ ర్యాంకు ఉన్న ప్రభుత్వ సలహాదారులు, కేబినెట్ ర్యాంకు ఉన్న కార్పొరేషన్ ఛైర్మన్లు, అసెంబ్లీ, శాసనమండలిలోని ప్రతిపక్ష నాయకులు, చీఫ్ విప్, విప్ లు, పార్లమెంటరీ కార్యదర్శులకు ప్రభుత్వం భారీగా  జీతభత్యాలతోపాటు రకరకాల ప్రత్యేక అలవెన్సులు ఇస్తోంది. అదే సమయంలో ముఖ్యమంత్రి, ఇతర కేబినెట్ ర్యాంకు ఉన్న వారికి  ప్రజాప్రతినిధుల జీతభత్యాల చట్టం ( 1953) లోని క్లాజ్ (4) సెక్షన్ 3 ప్రకారం వారు చెల్లించాల్సిన ఆదాయపు పన్నుకూడా రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తోంది. ఇదిపుడు చర్చనీయాంశమయింది. ప్రభుత్వం వారి ఆదాయపు పన్నును చెల్లించే విధానం మానుకోవాలనే సూచన వస్తూ ఉంది.


కేబినెట్ ర్యాంకు ప్రజాప్రతినిధులకు ఎన్నెన్నో అలవెన్సులు
 కేబినెట్ ర్యాంకు హోదా ఉన్న ప్రజాప్రతినిధులకు ఇన్ని రకాల అలవెన్సులు ఇస్తున్నా వారు పొందుతున్న ఆదాయంపై కేంద్రప్రభుత్వానికి ఆదాయపు పన్నును కూడా ప్రభుత్వం ఎందుకు భరించాలి. ఇలా దాదాపు 70 యేళ్లుగా ప్రభుత్వం ఈ భారం భరిస్తూ ఉంది.ఈ మధ్య కాలంలో  కేబినెట్ ర్యాంకు ఉన్న వారికందరికీ జీతభత్యాలను అనూహ్యంగా పెంచారు.   ఏ మంత్రి లేదా ప్రజా ప్రతినిధి ఆదాయం పన్ను చెల్లించలేదని దీనావస్థలో లేరు.  

తెలంగాణలో ప్రజాధనం దుర్వినియోగం
మధ్యప్రదేశ్, చత్తీస్ ఘడ్, హర్యానా, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో  కేబినెట్ ర్యాంకు మంత్రులు, ప్రజాప్రతినిధులకు ఆదాయపన్ను చెల్లింపును నిలిపివేశారు. ఉత్తర ప్రదేశ్ లో యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం 2019 లో మంత్రుల ఆదాయపు పన్ను చెల్లించరాదని నిర్ణయించింది. ఈ చెల్లింపు మీద పలు విమర్శులు రావడంతో  యోగి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. కానీ  తెలంగాణ రాష్ట్రంలో మాత్రం 60 మంది కేబినెట్ ర్యాంకు ప్రజాప్రతినిధులకు భారీ జీతభత్యాలతోపాటు వారు చెల్లించాల్సిన ఆదాయపు పన్నును కూడా ప్రభుత్వమే ప్రజాధనంతో చెల్లిస్తోంది. దీనివల్ల ప్రజాధనం దుర్వినియోగమవుతోంది. మంత్రులే ఇలా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తే ఎలా అని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ కార్యదర్శి సోమ శ్రీనివాసరెడ్డి ప్రశ్నించారు.

మంత్రుల ఆదాయపు పన్ను చెల్లింపులు ఆపండి : ఎం పద్మనాభరెడ్డి

తెలంగాణ సీఎం, మంత్రులతోపాటు కేబినెట్ ర్యాంకు ప్రజాప్రతినిధుల ఆదాయపు పన్ను చెల్లింపులు నిలిపివేయాలని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ అధ్యక్షుడు ఎం పద్మనాభరెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎ శాంతికుమారికి బుధవారం వినతిపత్రాన్ని సమర్పించారు. కేబినెట్ ర్యాంకు ప్రజాప్రతినిధుల ఆదాయపు పన్ను చెల్లించడం ప్రజాధనం దుర్వినియోగం చేయడమేనని, ఇది రాజ్యాంగ విరుద్ధమని ఆయన పేర్కొన్నారు. ఆదాయం పొందుతున్న కేబినెట్ ర్యాంకు ప్రజాప్రతినిధులే ఆదాయపు పన్ను చెల్లించాలి తప్ప ప్రజాధనాన్ని వారి పన్ను చెల్లింపులకు వినియోగించవద్దని పద్మనాభరెడ్డి కోరారు.


మంత్రుల ఆదాయపు పన్ను చెల్లింపులకు ప్రజాధనం వెచ్చింపు

2015వ సంవత్సరంలో అప్పటి సీఎం కేసీఆర్, ఇతర మంత్రులు, కేబినెట్ ర్యాంకు ప్రజాప్రతినిధులకు రూ.22.51 లక్షలను ఆదాయపు పన్నును తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించింది. ఈ మేర 2015మార్చి 25వతేదీన జీఓఆర్టీ నంబరు 917 తో ఉత్తర్వులు జారీ చేశారు. 2015వ సంవత్సరం మార్చి 25వతేదీన అప్పటి ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ అజయ్ మిశ్రా జారీ చేసిన ఉత్తర్వుల్లో 2014-15 ఆర్థిక సంవత్సరానికి గాను సీఎం కేసీఆర్ కు రూ.15.39 లక్షల ఆదాయపు పన్నును ప్రభుత్వమే చెల్లించింది. సలహాదారులైన ఆర్ విద్యాసాగర్, ఏకే గోయల్, ఎం రామలక్ష్మణ్, బీవీ పాపారావు,డాక్టర్ కేవీ రమణాచారి, జీఆర్ రెడ్డి, అల్లం నారాయణ, పార్లమెంటరీ సెక్రటరీలు జలగం వెంకట్రావు, వినయ్ భాస్కర్ ల ఆదాయపు పన్ను చెల్లించారు.

కేబినెట్ ర్యాంకు ప్రజాప్రతినిధులకు భారీగా జీతాల పెంపు

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే అప్పటి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి మంత్రులు, కేబినెట్ ర్యాంకు ప్రజాప్రతినిధుల జీతాలను భారీగా పెంచారు. ఆంధ్రప్రదేశ్ యాక్ట్ 1954 ప్రకారం ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం, మంత్రుుల, కేబినెట్ ర్యాంకు డిప్యూటీ, స్టేట్ మంత్రులు, చీఫ్ విప్, విప్, ప్రతిపక్ష నాయకుల జీతభత్యాలను పెంచారు. అప్పట్లో తమిళనాడు, కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర లను సంప్రదించి పెరిగిన జీవన వ్యయానికి అనుగుణంగా జీతభత్యాలను పెంచామని అప్పటి ప్రభుత్వం సమర్ధించుకుంది. 2012 మార్చి 16వతేదీన ప్రజాప్రతినిధుల జీతభత్యాలు పెంచుతూ ఉమ్మడి రాష్ట్రంలోనే గెజిట్ నోటిఫికేషన్ జారీ చేశారు.

జీతాలే కాదు అలవెన్సులూ అధికమే...

ప్రజాప్రతినిధులకు జీతాలే కాకుండా అలవెన్సులు కూడా అధికంగానే చెల్లిస్తున్నారు. ప్రజాప్రతినిధికి నియోజకవర్గ అలవెన్సు కింద నెలకు 83వేలరూపాయలు, హౌస్ రెంట్ అలవెన్సు కింద రూ.50వేలు ప్రభుత్వం చెల్లిస్తోంది. దీంతోపాటు ప్రజాప్రతినిధికి సొంత కారు ఉంటే దానికి గాను కారు అలవెన్సు కింద నెలకు రూ.30వేలు, ఇంధన ఖర్చుల కోసం రూ.15వేలు, సెక్యూరిటీ కారు అలవెన్స్ రూ.30వేలు ఇస్తున్నారు. దీంతోపాుట క్యాంపు కార్యాలయం అలవెన్స్ రూ.10వేలు, స్పెషల్ అలవెన్స్ రూ.8వేలు, ఇతర అలవెన్స్ కింద రూ.7వేలు చెల్లిస్తున్నారు.




Tags:    

Similar News