మేం తురకలమెట్లవుతం?

తుర్కోళ్లు అని పిలవటం వల్ల ముస్లింల మనసు ఎంత గాయపడుతుందో గ్రహించక చాలా చులకనగా మాట్లాడుతుంటారు. ఆ మాట ఎంత లోతైన గాయం చేస్తుందో కవి కరీముల్లా మాటల్లో వినండి...

Update: 2023-12-19 04:00 GMT
(pic credit: countercurrents.org)

-కవి కరీముల్లా 

అనేక మంది ముస్లింలను గురించిన సంబోధనలో "తురకలు" అనే పదాన్ని విస్తృతంగా ఉపయోగిస్తుంటారు. ఈ పదంలో పరాయి జాతి భావన ఇమిడి వుందని తెలిసినా చాలా తేలిక భావంతో ప్రయోగిస్తారు.

తురక అని పిలవటం వల్ల ముస్లింల మనసు ఎంత గాయపడుతుందో, క్షోభ చెందుతుందో గ్రహించక చాలా చులకనగా మాట్లాడుతుంటారు. కొందరు లౌకికవాదులు, ప్రగతిశీలవాదులు సైతం తమకు తెలిసో తెలియకో, అలవాటు గానో ఈ పదాన్ని అలవోకగా వాడుతుంటారు. కొన్ని ప్రాంతాల్లో ఈ పదం ముస్లింలను ఉద్దేశించిన పారిభాషికా పదమైంది. టర్కీ దేశానికి చెందిన తరుష్కులు తురక భాష మాట్లాడ్తారు కనుక వారిని తురకలు అనటంలో పెద్దగా ఆశ్చర్యపడాల్సిన పనిలేదు. కాని భారత దేశంలో పుట్టి ఇక్కడే మరణించే భారతీయ ముస్లింలను తురకలు అని పిలవటమే ఆక్షేపణీయం.

భారత్ లో తురకం ఎవరూ మాట్లాడారు

భారతదేశ ముస్లింలు జాతి రీత్యా చూసినా, భాషా పరంగా చూసినా తురుష్కులతో సంబంధం లేనివారు. ఏ ప్రాంతానికి చెందిన ముస్లింలైనా తురకం మాట్లాడరు.

ఉర్దూలేదా ఇతర ప్రాంతీయ భాషలు మాట్లాడతారు. అయినా ముస్లింలను తురకలు అనటం హేయమైన విషయం. చరిత్ర మూలాల్లోకి వెళితే భారతదేశం ఏ ఒక్క జాతికీ, మతానికీ చెందినది కాదని తెలుస్తుంది. నదులన్నీ విభిన్న మార్గాలగుండా ప్రవహించి సముద్రంలో కల్సినట్లు నలుదిక్కుల నుండి వచ్చిన జాతులు ఇక్కడి భూమిలో మిళితమై పోయాయి.

ఈ గడ్డపై వరుసక్రమంలో స్థిరనివాసం ఏర్పరుచుకున్న జాతుల్ని ఆర్.పి. చందా, గుహలాంటి వారు ఆరు జాతులుగా విభజించారు. అవి నీగ్రిటో, అస్ట్రలాయిడ్లు, బ్రాకీసిఫల్ లేక అల్సైన్లు, ద్రవిడియన్లు, ఆర్యులు, మంగోలియట్లు అనే జాతులుగా విశ్లేషించారు. ఈ జాతులన్నీ పరాయి దేశాల భూమి నుండి ఇక్కడికి వచ్చి స్థిరపడినవే.

ఒక కోణంలో పరిశీలిస్తే మొదటగా వచ్చిన నీగ్రిటో జాతికి చెందినవారు ఈ దేశమూలవాసులని అనేకమంది చరిత్రకారుల అభిప్రాయం. వీరే చరిత్రలో సంభవించిన అనేక మార్పుల కారణంగా ఆర్యుల చేత భంగపడి చాతుర్వర్ణ వ్యవస్థ బలీయమైన క్రమంలో అంటరాని వారిగా, దళితులుగా, శూద్రులుగా మిగిలిపోయారు. ఈ దళితులు, శూద్రులే అనాదిగా వివక్షతకు గురౌతూ మలబార్ తీరానికొచ్చిన అరబ్బులు ద్వారా తమకు సమానత్వాన్ని ప్రసాదించిన ఇస్లాంలోకి ప్రవేశించారు.

ఆ తర్వాత ఇస్లాంమత ప్రచార నిమిత్తం భారతదేశంలోని వివిధ ప్రాంతాల కొచ్చిన ముస్లిం సూఫీల ప్రభావానికి గురై ఈ దేశ మూలవాసులైన దళితులు, శూద్రులలో అధిక భాగం ఇస్లాం స్వీకరించటం జరిగింది. అరబ్బులకు, తురుష్కులకు చెందిన సంతతి కూడా ఇక్కడ స్థిరపడినవారిలో వున్నారు. వీరు ఇక్కడి ముస్లింలలో కేవలం అతి కొద్ది మంది మాత్రమే. విగ్రహారాధన పట్ల విముఖత పెంచుకున్న అగ్ర వర్ణాల వారు సైతం ఇస్లాం పట్ల ఆకర్షితులై ఇస్లాం స్వీకరించటం కూడా వాస్తవమే.

వాళ్లకు ఆ బ్రాండ్ వేయలేదు, వీళ్లకే ఎందుకు

అయినా మన దేశంలో ఎవరు జాతులుగా, మతాలుగా, కులాలుగా, వర్గాలుగా అభివృద్ధి చెందినా, ఈ భూభాగం పై దాడి చేసి ఇక్కడ పరిపాలించినా అంతా పై ఆరుజాతులనుండి వచ్చినవారే. ఈ దేశానికి వలస వచ్చిన హూణుల్నికాని, కుషానుల్ని కానీ, ఆర్యుల్ని కానీ వారు వచ్చిన దేశాల పేర్లతో పిలవరు వారిని హిందువులుగా పిలుస్తారు. కాని ఈ మట్టి కణాల్లో కణాలైన ఈ దేశ మూల వాసులైన ముస్లింలను మాత్రం "తురకలు” అని పిలుస్తారు. ఇది ఎంత వివక్షతతో కూడిన దుర్మార్గమైన భావజాలమో సరియైన ఆలోచనా దృక్పథం కలిగిన వారు ఆలోచించవల్సిన అవసరం వుంది.

ఆధునిక రాజ్యంలో “జాతి” అనే పదాన్ని ఉపయోగించడంలో విస్తృతమైన అర్ధాన్ని ఇచ్చారు. హేస్ అనే రాజనీతి శాస్త్రజ్ఞుడు 'Essays on Nationalism' అనే తన రచనలో రాజకీయ ఐక్యతను, సార్వభౌమాధికారంతో కూడిన స్వాతంత్ర్యాన్ని పొందిన ఒక జాతీయ సముదాయం. "జాతి" అవుతుందని వివరించాడు. ఇదే భావన నేడు దాదాపుగా అన్ని దేశాల్లోనూ ఆమోదింపబడి కొనసాగుతుంది. పౌరులు ఏ మతానికి చెందిన వారైనా జాతీయ భావనతో ఒకే జాతిగా పిలవబడుతున్నారు. కనుక ఈ దేశానికి చెందిన హిందువులైనా, ముస్లింలైనా, క్రైస్తవులైనా మరెవరైనా సరే భారత జాతికి చెందిన వారే. ఇక్కడ నివసిస్తున్న హిందువులతో సహా దాదాపు అన్ని మతాలకు చెందిన ప్రజలు పరాయి దేశాల నుండి ఇక్కడికి వలస వచ్చిన మూల జాతులైన పై ఆరు జాతులకు చెందిన వారే. కనుక ఈ దేశం ఎవరి సొత్తూ కాదు. ముస్లింలను "తురకలు" అని పిలిచే అర్హత ఎవరికీ లేదు. మతం ప్రాతిపదికగా ముస్లింలను పరాయి వారిగా భావించే అధికారం కూడా ఎవరికీ లేదు. ఎందువల్లనంటే ఇక్కడి అన్ని మతాలు, సంస్కృతీ సంప్రదాయాలు పై ఆరు జాతుల నుండి వచ్చినవే. ఇలా విభిన్న కోణాలనుండి పరిశీలించినా ముస్లింలు ఈ దేశమూలవాసులని, ఈ మట్టి పుత్రులని విశదమవుతుంది.

తర్కోళ్లు అనడంలో కుట్ర ఉందా!

నిజానికి ముస్లింలను "తురకలు" అని పిలవటంలో ఒక భయంకరమైన కుట్రదాగివుంది. జర్మనీలో నాజీజం మైనార్టీలకు వ్యతిరేకంగా ఎట్టి కుట్రలు పన్నిందో అనే కుట్రల్ని ఇక్కడి ముస్లింలకు వ్యతిరేకంగా కొన్ని వర్గాలు కొనసాగిస్తున్నాయి. ఇక్కడి మెజారిటీ ప్రజలైన హిందువులలో ముస్లింలు పరాయి వారనే భావన సృష్టించి తద్వార భీతావహా పరిస్థితులు కల్పించి ముస్లింలను భౌతికంగా, సాంస్కృతికంగా అణిచివేయడమనే తమ వ్యూహంలో భాగంగానే "తురక” అనే ఈ పదాన్ని సృష్టించారు. ఇప్పటికైనా దేశంలోని లౌకికవాదులు మేల్కొని ఫాసిస్టు పోకడలకు చిహ్నంగా నిలిచిన ఈ పదాన్ని వాడటాన్ని నిరోధించాలి. అదృష్టవశాత్తు మనదేశంలోని మెజారిటీ ప్రజలైన హిందువులు, ముస్లింలు లౌకిక భావనల్ని వీడలేదు. వ్యవస్థలో కొన్ని లొసుగులుంటే వుండవచ్చునేమో కాని మొత్తంగా వ్యవస్థ మతతత్వీకరించబడలేదు. ఏవో కొన్ని వర్గాలు తప్ప దాదాపుగా అందరూ శాంతి శ్రేయాలను, లౌకికతను వాంఛిస్తున్నారు.

శ్రమజీవుల్ని కించపరుస్తారా!

ఉదయం నుండి సాయంత్రం వరకు స్వేదంలో తడిసి ముద్దవుతూ కార్ఖానాల్లో స్టీరింగ్ చక్రాల్లో, మిషన్ చక్రాల్లో, ఫుట్పాత్ బతుకుల్లో మ్రగ్గిపోతూ శ్రమ జీవులుగా జీవిస్తున్న ముస్లింలను తురకలని కించపర్చటం సాంఘీక నేరంగా పరిగణించాలి. అనుక్షణం వెంటాడుతూ, తల్వారై కుళ్ళ పొడుస్తూ వేధించే ఈ పదాన్ని యస్.సి., యస్.టి., ఎట్రాసిటీ చట్టాల పరిధిలోకి తీసుకురావాలి. తద్వారా మతోన్మాద భావంతో ముస్లింలను కించపరిచే స్వభావం కొంతమేరకైనా తగ్గుతుంది. ఇక్కడి మెజారిటీ ప్రజలు, మైనారిటీ ప్రజలు ఒకే ఆత్మకు రెండు భాగాల వంటి వారు. ఒక భాగాన్ని గాయ పర్చటం ద్వారా మరొక భాగం అభివృద్ధి చెందజాలదు.

తురక అనే మాట అభద్రత పెంచుతుంది

'తురక' అనే ఈ పదాన్ని ఉపయోగించడం వల్ల అసలే అస్థిత్వ భయాలతో, అభద్రతాభావంతో బతుకులు వెళ్ళదీస్తున్న ముస్లింలు మరింత ఆత్మన్యూన్యతకు గురి కావలసివస్తుంది. భారతీయులమైన మనమందరం సమిష్టి ప్రేమను, సమిష్టిశ్రమను సమిష్టి కృషిని, సమిష్టి శ్రేయోధర్మాన్ని అలవర్చుకున్ననాడే మనం నిజమైన భారతీయులుగా జీవించగలం. తురక అనే పదాన్ని ఉపయోగించే బుద్ధి జీవులూ మేం తురకలమెట్లవుతమో! కొద్దిగా ఆలోచించండి. ఈ మట్టి పుత్రులమైన మమ్మల్ని తురకలని పిలవటం 'భారతీయత' కు వెన్నుపోటు పొడవటమే అని తెల్సుకోండి.

( కవి కరీమూల్లా రాసిన పుస్తకం 'నన్ను సాయిబును చేసింది వాళ్లే' పుస్తకం నుంచి)

Tags:    

Similar News