జనాభాలో సగం ఉన్నా తెలంగాణ బీసిలకు నాయకుడే లేడు, ఎందుకు?
తీన్మార్ మల్లన్న బీసీ సమైక్యత సాధించేందుకు సన్నద్ధమవుతాడా. బీసి ఉద్యమాన్ని రెడ్ల వ్యతిరేక ఆగ్రహ వ్యక్తీకరణగా కుదించి వేస్తాడా?;
తప్పైనా ఒప్పైనా తెలంగాణలో ఇపుడు 46 శాతం మంది బిసిలు ఉన్నారు. ఇది ప్రభుత్వం లెక్క. ఇది ఇంత కంటే తగ్గదు. మార్పులు చేర్పులు ఉంటే, ఈ సంఖ్య పెరుగుతుందే తప్ప తగ్గదు. అంటే రాష్ట్రంలో దాదాపు సగం జనాభా బిసిలదే. కాని దురదృష్టమేమిటంటే, ఈ 46 శాతం మందికి ఒక్క రాష్ట్ర నాయకుడు లేడు. 46 శాతం జనాభాలో చాలా కులాలున్నాయి. వీళ్లంతా ఇపుడు బీసీపొలిటికల్ ఎంపవర్ మెంటు అని, బీసీలకు రాజ్యాధికారం అనే సింగిల్ స్లోగన్ ఇవ్వగలుగుతున్నారు. వీళ్లకి కమాండర్ లేడు.
https://youtu.be/DA_AslNzNAA?si=t7YHRB1BU-lGxVjr
చెప్పుకునేందుకు అన్ని పార్టీల్లో ఎమ్మెల్యేలున్నారు. ఎంపిలున్నారు. ఇది చాలాదన్నట్లు చాలా మంది సొంత బీసీపార్టీలు పెట్టుకున్నారు. బీసీసంస్థలు నడుపుతున్నారు.
ఇంతే కాదు, వీళ్లలో ఇపుడు ప్రొఫెసర్లున్నారు. ఐఎఎస్ అధికారులున్నారు. మాజీ న్యాయమూర్తులున్నారు. వ్యాపారస్థులున్నారు. రియల్టర్లు ఉన్నారు. పెద్ద సంఖ్యలో ఎన్నారైలు ఉన్నారు.
బిసిల దగ్గిర డబ్బు కూడా బాగానే ఉంది. అందుకే పెద్ద పెద్ద స్లోగన్స్ తో మహాసభలు పెడుతున్నారు. బహిరంగ సభలు ఏర్పాటు చేస్తున్నారు. రౌండ్ టేబుల్స్ పెడుతున్నారు.
అయినా సరే, 46 శాతం జనాభాని ఏక త్రాటిపై నడిపేందుకు రాష్ట స్థాయిలో బీసీకమాండర్ అనే వ్యక్తి ఎవ్వరూ లేరు. ఒక మహానేత ఎవ్వరూ తయారు కాలేదు. వీళ్లలో బిసి ఐడియాలజీతో ఉన్న ఒక్క కరుణానిధి లేడు, ములాయం సింగ్ లేడు, లాలూ ప్రసాద్ యాదవ్ లేడు.
ఉన్నవాళ్లంతా నియోజకవర్గ స్థాయి మించని కాంగ్రెస్ బీసీనేతలు, బిఆర్ ఎస్ బీసీనేతలు, బిజెపి నేతలు, కమ్యూనిస్టు బీసీనేతలు మాత్రమే.
వీళ్లలో కొందరు రాష్ట్ర స్థాయి కులసంఘాల నేతలయ్యారు తప్ప రాష్ట్ర స్థాయి బీసీ నేతగా గుర్తింపు పొందలేదు.
పొందేందుకు ఆయా పార్టీల్లో ఆస్కారం లేదు.
అంతో ఇంతో రాష్ట్ర స్థాయి గుర్తింపు తెచ్చుకున్న కె కేశవరావు కాంగ్రెస్ నుంచి బిఆర్ ఎస్ కు ఫిరాయించి అక్కడి నుంచి మళ్లీ కాంగ్రెస్ కు వెనక్కొచ్చి బాగా అపకీర్తి పాలయ్యారు.
ఏ పార్టీకి చెందని ఆర్ కృష్ణయ్య బీసీ నేత అని గుర్తింపు తెచ్చుకుని చివరకు టిడిపిలో చేరాడు, కాంగ్రెస్ చేరాడు, వైసిపిలో చేరి రాజ్యసభ్యుడయ్యాడు, ఇపుడు బిజెపిలో మళ్లీ రాజ్యసభ సభ్యుడయ్యాడు. ఈ ఫిరాయింపులతో ఆయనా నవ్వుల పాలయ్యారు.
వయసు రీత్యా కేశవరావు, ఆర్ కృష్ణయ్య చాప్టర్ ముగిసిపోయింది.
బీసీలీడర్ అని పేరున్న ఈటెల రాజేందర్ పరిస్థితి అంతే, ఒకపుడు ఆయన బిఆర్ ఎస్ బీసీ లీడర్. ఇపుడాయన బిజెపి బీసీ లీడర్.
మంచి నాయకత్వ లక్షణాలున్న దేవేందర్ గౌడ్ తెలుగుదేశం పార్టీకే పరిమితం అయి బీసీ లకు నాయకత్వం వహించలేకపోయారు. డబ్బున్న జ్ఞానేశ్వర్ ముదిరాజ్ చంద్రబాబు నాయుడికి, బిఆర్ ఎస్ కు ఉపయోగపడ్డారు తప్ప, బిసి నేతగా ఎదగలేకపోయారు.
ఒక నాటి రాజమల్లు, బాలాగౌడ్, సి జగన్నాథం, మల్లికార్జున్ గౌడ్. వి హనుమంతరావు నుంచి నోముల నరసింహయ్యదాకా తెలంగాణలో బీసీనేతలెందరో వచ్చారు. వాళ్లంతా నియోజకవర్గం స్థాయి మించని ఉపనేతలు మాత్రమే. కాకపోతే, పార్టీల్లో సీనియర్ నేతలు. బీసీలను ఏకం చేసే ఒక నినాదం కూడా తీసుకురాలేకపోయారు.
అందువల్ల తెలంగాణలో బిసిలను ఏకం చేసి విశాల బీసీఉద్యమం నడిపే మహానేత ఇంకా రావలసి ఉంది. ఆ కుర్చీ ఖాళీగా ఉంది.
తెలంగాణలో ఒక కొండాలక్ష్మణ్ బాపూజీ లేడు. ఒక పి శవశంకర్ లేడు. ‘తెలంగాణ బీసీనేత’ రంగం మీదకు రావలసిన అవసరం ఎంతైనా ఉంది.
బాపూజీ, శివశంకర్ లకు ఉన్నబీసీ ప్రతిష్ఠ పార్టీలకు అతీతంగా వచ్చింది. కాంగ్రెస్ లోనే ఉన్నా వారిని అన్ని కులాలు ‘బీసీ నేత’గా గుర్తించాయి.
బీసీలలో విద్య తక్కువగా ఉన్నపుడు, బీసీలలో రాజకీయ చైతన్యం లేనపుడు, వివిధ రంగాలలో బీసీల ఉనికి అంతంత మాత్రంగానే ఉన్నపుడు వాళ్లు బీసీ మహానాయకులు అయ్యారు. బిసిలలోని అన్ని కులాలు వాళ్లని గౌరవించాయి. కానీ ఇపుడు బీసీల జనాభా పెరిగింది. చదవు పెరిగింది. డబ్బు పెరిగింది. చైతన్యం పెరిగింది. బీసీలు అన్నింటా ఎంపవర్ మెంట్ కోరుతున్నారు. రాజ్యాధికారం అంటున్నారు. ముఖ్యమంత్రి పదవి అంటున్నారు. అయితే వీళ్లని అటువైపు నడిపే నాయకుడింకా పుట్టలేదు. తెలంగాణ రాష్ట్ర బీసీలకు నాయకుడంటూ ఒక వ్యక్తి తయారువుతాడా?
ఇపుడు రాష్ట్రమంతా వినబడుతున్న బీసీలీడర్ పేరు తీన్మార్ మల్లన్న. తీన్మార్ మల్లన్న అసలు పేరు చింతపండు నవీన్ కుమార్. తెలంగాణ మున్నూరు కాపు కులం నుంచి వచ్చాడు. బిసిలలో ఇది పెద్ద కులం. మాదిగ బిడ్డను పెళ్లాడాడు. చదువు ఉంది. బిగ్గరైన ధిక్కార స్వరం ఉంది. వయసు ఉంది. ప్రస్తుతం కాంగ్రెస్ ఎమ్మెల్సీ. అందరిని తన వైపు తిప్పుకోగలగిన చతురత ఉంది. బిఆర్ ఎస్ ప్రభుత్వంతో తలపడ్డారు. నాటి ముఖ్యమంత్రి కెసిఆర్ ను ధిక్కరించాడు. అరెస్టయ్యాడు. కేసుల్లో ఇరుక్కున్నాడు. పోలీసులు వెంటబడుతూనే వచ్చారు. ఇటీవలి కాలంలో ఒక రాజకీయ కారణంగా ఇంతగా వేధింపులకు గురైన బీసీ నాయకుడెవరూ లేరు. వీటన్నింటిని చూసి తీన్మార్ మల్లన్న భయపడి పారిపోలేదు. కెసిఆర్ కుటుంబంతో రాజీ కాలేదు. ఆయన నినాదం మారలేదు. తీన్మార్ మల్లన్నకు కులబలం ఉంది. యువతరంలో జనామోదం ఉంది.
బిసిల విషయంలో అవసరమయితే కాంగ్రెస్ పార్టీ తో తెగతెంపులు చేసుకో గలిగి తెగింపూ ఉంది. రాష్ట్ర బీసీ మహానాయకుడు ఎదిగే లక్షణాలున్నాయని చాలా మంది నమ్ముతున్నారు.
పదవులకోసం రోజుకొక పార్టీ మారేందుకు వెనకాడని ఈ రోజుల్లు పార్టీకి ఎదురుతిరుగుతున్న ఏకైక బీసీవాది తీన్మార్ మల్లన్నే అంటున్నారు.
అతని వాలకం చూస్తే కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి రాష్ట్రంలో బీసీఉద్యమం నిర్మించే ప్రయత్నం చేస్తున్నట్లు అర్థమవుతుంది.
జనాభాలో 46 శాతం అనేమాటను ఒక ఆయుధంగా మార్చుకుని తీన్మార్ మల్లన్న బిసిల పొలిటికల్ ఎంపవర్ మెంటుకు పోరాటం చేస్తాడా లేదా అదును చూసి ఏదో ఒక పార్టీలోకి జారుకుంటాడా?
రాజకీయాల్లో ఏమయినా జరగవచ్చు. ఇప్పటికయితే, రాష్ట్రంలో బీసీలంతా ఒక నాయకుడురావాలని చూస్తున్నారు. తీన్మార్ మల్లన్న స్టెప్పులు ఎటువైపు అని అన్ని పార్టీల వాళ్లు ఆత్రంగా చూస్తున్నారు.
ఎందుకంటే, తీన్మాన్ మల్లన్న లో ఉన్న ధిక్కార స్వరానికి ఆకర్షణ వుంది. స్పష్టత ఉంది. మొన్న కులగణన డాక్యుమెంటును తగులబెట్టడం అందరికంటా పడింది. బిసిల జనాభా తగ్గించి, అగ్రకులాల జనాభా పెంచే ప్రయత్నం కులగణనలో జరిగిందని ఆయన చేసిన ఆరోపణ చర్చనీయాంశమయింది. అంతేకాదు, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ గా ఉంటూ ఈ పనిచేయడం కూడా ప్రశంసలందుకుంది.
బిసిలను సమీకరించడంలో ఈ మధ్య తీన్మార్ మల్లన్న కీలక పాత్ర వహిస్తున్నారు. కొంతవరకు సక్సెస్ అవుతున్నారు. ఆయన ఏర్పాటు చేసే సమావేశాలకు జనం మేధావులు పెద్ద ఎత్తున వస్తున్నారు. ఆయన పిలుపుకు అంతో ఇంతో బిసిలు స్పందించడం మొదలయింది. అయితే, ఆయన ఆగ్రహ ధోరణి చూస్తే రెండు ప్రశ్నలు ఎదురవుతాయి.
తీన్మార్ మల్లన్న బీసీ ఉద్యమ నేత కావాలనుకుంటున్నారా? లేక కేవలం రెడ్ల వ్యతిరేక బిసి నాయకుడు కావాలనుకుంటున్నారా?
ఎందుకంటే బీసీఉద్యమం అంటే రెడ్ల వ్యతిరేక ఉద్యమం కాదు. అదొక కోణం మాత్రమే. రెడ్లను తీవ్రంగా దుయ్యబడితే సభల్లో చప్పట్లు వస్తాయి తప్పా సాధారణ బీసీ జనాలు పారిపోతారు.
తెలంగాణలో చిత్రమయిన పరిస్థితి ఉంది. తెలంగాణ బిసిల గురించి చెప్పుకోవాలంటే ఒక నాటి ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి గురించి తప్పక చెప్పుకోవాలి. చాలా మంది బిసి నేతలను ప్రోత్సహించింది మర్రి చెన్నారెడ్డే. అంతెందుకు ఆంధ్రా బిసినాయకుడు గౌతులచ్చన్న డా. చెన్నారెడ్డి నాయకత్వం వహించిన 1969 తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి మద్దతు తెలిపాడు. ఎందుకు? చెన్నారెడ్డిలో ఉన్న బీసీ సానుకూల వైఖరి వల్లే. బీసీనేతల పట్ల, బిసి విద్యార్థి నాయకుల పట్ల డా. చెన్నారెడ్డిలో సాఫ్ట్ కార్నర్ ఉందని చాలా మంది బీసీ మేధావులు ‘ఫెడరల్’ కు చెప్పారు. అందువల్ల రెడ్ల వ్యతిరేకత అనేది బిసిల రాజ్యాధికార అస్త్రంగా పనికి రాదు.
గాంధేయ వాదం, బిసిల సంక్షేమంతో మాత్రమే పద్మశాలి అయిన కొండాలక్మణ్ బాపూజీ పనిచేసి బీసీ మహానేత అయ్యారు. బిసి కులాలను ఆయన సహకార ఉద్యమంలోకి తీసుకురావాలనే కృషి ఆయన్ని కులాలకు ఆప్తుడిని చేసింది. మున్నూరు కాపు కులం నుంచి వచ్చిన శివశంకర్ కాలానికి పరిస్థితులు కొద్దిగా మారాయి. ఆయన కొద్దిగా రెడ్ల పట్ల ఆగ్రహం వ్యక్తం చేసినా అదెపుడూ పరిమితులు దాటలేదు. కేంద్రంలో అధికారంలో ఉన్నపుడు చట్టాలను సవరించి, కొత్త చట్టాలను తీసుకువచ్చి శివశంకర్ బీసీసంక్షేమం కోసం కృషి చేశాడు. ఇలా బీసీ మహానేత అయ్యాడు. వివిధ ప్రభుత్వ వ్యవస్థల్లో బిసిలు కనిపించాలని ఆయన ఆలోచించారు. ముఖ్యంగా న్యాయవ్యవస్థలో బిసిలకు తలుపులు తెరిచింది ఆయనే. ఇలా అన్ని కులాలకు చేరువ అయ్యారు.
బాపూజీకి గాని, శివశంకర్ గాని విశాల బీసీ ఉద్యమం నిర్మించాల్సిన అవసరం రాలేదు. అప్పటి బిసి ఉద్యమం కేవలం కాంగ్రెస్ పార్టీలోపలే జరిగింది. ఇపుడు పరిస్థితులు మారాయి. బీసీలు రాజ్యాధికారం అంటున్నారు. వాళ్ల జనాభా 46 శాతం అని అధికారికంగా తెలింది. రాజ్యాధికారానికి బీసీకులాలను ఏకం చేయడానికి ఉద్యమాలు అవసరమవుతాయి. 46శాతం అనేది ఒక ఆయుధంగా మారి బిసిల సమైక్యతా ఉద్యమానికి బాట వేస్తుందా? అన్ని కులాలను కలిపేందుకు రాజ్యాధికారం ఒక నినాదం అవుతుందా?
తీన్మార్ మల్లన్న బీసీ సమైక్యత సాధించేందుకు సన్నద్ధమవుతాడా. బీసి ఉద్యమాన్ని రెడ్ల వ్యతిరేక ఆగ్రహ వ్యక్తీకరణగా కుదించి వేస్తాడా? అదే జరిగితే ఆయనకూ నష్టం జరుగుతుంది. బీసీఉద్యమానికి అంతకంటే ఎక్కువ నష్టం జరుగుతుందని బీసీమేధావులు చెబుతున్నారు.