వైసీపీ ఎమ్మెల్యేలకు తాడేపల్లి టెన్షన్‌

సర్వేల్లో దాగున్న భవితవ్యం

Update: 2023-12-19 04:07 GMT
CM YS Jagan Mohan Reddy

తాడేపల్లి సీఎంఓ కార్యాలయం నుంచి ఫోన్‌ అంటే హడలిపోతున్నారు వైసీపీ ఎమ్మెల్యేలు. ఏ నిమిషంలో ఏ మాట వినాల్సి వస్తుందో తెలియక గుండెలు బిగపట్టుకుని బిక్కుబిక్కుమంటున్నారు. ఎన్నికల నోటిఫికేషన్‌ వచ్చేదాక టెన్షన్‌ లేకుండా ఉండొచ్చులెమ్మనుకున్న ఎమ్మెల్యేలకు ఇప్పుడు తాడేపల్లి భయం పట్టుకుంది. సీఎంఓ ఆఫీసు నుంచి ఫోన్‌ అనడంతోనే ఇక ఆ సీటు గోవిందా అనే పరిస్థితి నెలకొంది. ప్రజలు నిర్ణయించాల్సిన పని తీరును సర్వే సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు నిర్ణయించడమే ఇందుకు కారణం.

ఆ ఆరు సంస్థలేంటో, ఆ కథేంటో...
వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేల పనితీరును సర్వే సంస్థలు నిర్ణయిస్తున్నాయి. ఆరు సర్వే సంస్థలతో సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో సర్వేలు చేయించారు. వేరువేరుగా సర్వే సంస్థలు ఇచ్చిన రిపోర్టులను పరిశీలించిన సీఎం జగన్‌ ఎమ్మెల్యేలతో నేరుగా మాట్లాడాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు నెగటివ్‌ రిపోర్టులు వచ్చిన ఎమ్మెల్యేలను నేరుగా క్యాంపు కార్యాలయానికి పిలిపిస్తున్నారు.
చావు కబురు చల్లగా చెప్పినట్టు ’ఈసారికి మీరు దుకాణం సర్దుకోండన్నా’ అని చెబుతున్నారట. సీఎం జగన్, రాష్ట్రప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడి విషయం చెప్పేస్తారు. నాలుగు రోజుల తరువాత మళ్లీ రావాల్సిందిగా చెబుతారు. అప్పుడు నియోజకవర్గం నుంచి ఎందుకు తప్పిస్తున్నారో సీఎం వారికి చెబుతున్నారు. టిక్కెట్‌ లేకుంటే లేదని చెబుతున్నారు. ఒక వేళ వేరే నియోజకవర్గానికి మార్చాలని భావిస్తే ఏ నియోజకవర్గానికి ఇన్‌చార్జ్‌గా వేస్తున్నారో అప్పుడే వారికి చెప్పి పంపిస్తున్నారు. ఇది పార్టీ నిర్ణయమని, పార్టీకోసం కష్టపడి పనిచేస్తే మంచే జరుగుతుందని చెబుతున్నట్లు సీఎంను కలిసిన కొందరు ఎమ్మెల్యేలు తెలిపారు. అయితే మాపేర్లు రాయవద్దని వారు చెప్పారు.
గోదావరి జిల్లాల్లో భారీ మార్పులు
తూర్పుగోదావరి జిల్లా నుంచి జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు, ప్రత్తిపాడు ఎమ్మెల్యే పర్వతనేని ప్రసాద్, పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబు, రామచంద్రాపురం ఎమ్మెల్యే, బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణు గోపాలకృష్ణ పశ్చిమగోదావరి జిల్లా నుంచి పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు, చింతలపూడి ఎమ్మెల్యే ఉన్నమట్ల రకడ ఎలీజా సీఎంను క్యాంపు కార్యాలయంలో కలిసారు. సర్వేల్లో వచ్చిన ఫలితాలను వారికి సీఎం వివరించినట్లు సమాచారం. ఎమ్మెల్యేల సమాధానాలు విన్న తరువాత మరోసారి సర్వే చేద్దామని సీఎం వారికి చెప్పినట్లు తెలిసింది. ఉమ్మడి గోదావరి జిల్లాల్లో భారీ స్థాయిలో అభ్యర్థుల మార్పులు ఉండే అవకాశం ఉందని వైఎస్సార్‌సీపీ వర్గాలు చెబుతున్నాయి.
గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే ఇప్పటి వరకు ఇన్‌చార్జ్‌గా ఉన్న మద్దాల గిరి కూడా సీఎంను కలిసారు. అయితే ఆయనకు సీఎం అపాయింట్‌మెంట్‌ ఇవ్వలేదు. మంత్రి జోగి రమేష్‌ ద్వారా సీఎంను కలిసి తనకు సీటు ఇవ్వకపోవడానికి కారణాలు అడిగారు. సర్వే రిపోర్టుల ఆధారంగానే సీటు ఇవ్వడం లేదని, మీరు బాధ పడొద్దని, పార్టీలో మీకు మంచి స్థానం ఉంటుందని సర్థిచెప్పినట్లు సమాచారం.
ఆ 11 నియోజకవర్గాల సరసన ఈ ఆరు..
ఇప్పటి వరకు మార్పులు చేసిన 11 నియోజకవర్గాల వారితోనూ ముందుగా సీఎం మాట్లాడారు. వారికి చెప్పిన తరువాతనే ఈ మార్పులు చేశారు. చెప్పి చేయడం వల్ల వ్యతిరేకత రాకుండా ఉంటుందని సీఎం భావిస్తున్నట్లు సమాచారం. ఎమ్మెల్యేలను నమ్మకుండా సర్వే సంస్థలను నమ్మడం ఏమిటనే చర్చ కూడా మార్పులకు గునైన ఎమ్మెల్యేల్లో సాగుతున్నది. వారు కొన్ని వర్గాలను మాత్రమే అడుగుతారని, అందువల్ల సరైన ఫలితాలు వచ్చే అవకాశం లేదని కొందరు ఎమ్మెల్యేలు చెబుతున్నారు.


Tags:    

Similar News