మరో రెండు గంటల్లో తుపాన్ తీరం దాటే అవకాశం
తుపాన్ తాకిడికి ఆంధ్రప్రదేశ్‌లోని ఎనిమిది జిల్లాలు అతలాకుతలం
Byline : The Federal
Update: 2023-12-05 06:52 GMT
మిగ్‌జాం తుపాన్‌వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కోస్తా జిల్లాలు అతలాకుతలం అవుతున్నాయి. ప్రధానంగా ఎనిమిది జిల్లాల్లో రెండు రోజులుగా ఏకధాటిగా వర్షాలు పడుతున్నాయి. చాలా గ్రామాలు నీట మునిగాయి. అనేక చోట్ల ఇల్లు కూలాయి. ఇండ్లలోకి నీరు చేరటంతో ఎక్కడ ఉండాలో తిక్కుతోచని స్థితిలో ప్రజలు ఉన్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలకు ప్రభుత్వం చాలా మందిని సోమవారం రాత్రే తరలించింది. మంగళవారం ఉదయం నుంచి వరద మంపుకు గురయ్యే ప్రాంతాల వాసులను తరలిస్తున్నారు. రాష్ట్రం మొత్తంగా 308 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు.
నెల్లూరు బాపట్ల మధ్య తీరం దాటే అవకాశం: బాపట్ల కలెక్టర్ రంజిత్‌బాషా
తుపాన్ ప్రభావంపై బాపట్ల జిల్లా కలెక్టర్ పి రంజిత్‌బాషాను పెడరల్ ప్రతినిధి ప్రశ్నించగా ఇప్పటి వరకు మాకు ఉన్న సమాచారం ప్రకారం నెల్లూరు బాపట్లకు మధ్య తుపాన్ తీరం దాటే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపిందన్నారు. అయితే ఖచ్చితంగా ఎక్కడ తీరం దాటే అవకాశం ఉందో వెల్లడి కాలేదన్నారు. జిల్లా వ్యాప్తంగా తుపాన్ ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. తుపాన్ ముగియగానే ఎన్యుమరేషన్ చేపట్టి నష్టపోయిన వారికి తగిన సాయం అందిస్తామని చెప్పారు.
సాయంత్రం రెండు గంటలకు తీరం దాటే అవకాశం
మరో రెండు గంటల్లో అంటే మంగళవారం సాయంత్రం రెండు గంటల ప్రాంతంలో బాపట్ల సమీపంలో మిగ్‌జాం తుపాన్ తీరం దాటే అవకాశం ఉందని బాపట్ల జిల్లా అధికారులు భావిస్తున్నారు.
నీటమునిగిన పంటలు, తడిసిన ధాన్యం
తుపాన్ ప్రభావిత ఎనిమిది జిల్లాల్లో పంటలు పూర్తి స్థాయిలో నీట మునిగాయి. వరి ధాన్యం పూర్తిగా తడిసిపోగా, కొన్ని జిల్లాల్లో నేలకు వరికంకులు వాలిపోయాయి. పత్తి, మిర్చి, పొగాకు పంటలు కూడా నీట మునిగాయి. నెల్లూరు, బాపట్ల జిల్లాల్లో పూర్తిస్థాయిలో పంటలు నీట మునిగాయి. లక్షల టన్నుల్లో వరి ధాన్యానికి నష్టం వాటిల్లిందని రైతులు వాపోతున్నారు.
పొంగిపొర్లుతున్న వాగులు,డ్యామ్‌లు
తిరుపతి జిల్లాలో పాపవినాశనం, గోగర్భం డ్యాముల నుంచి నీటిని భారీస్థాయిలో విడుదల చేశారు. ఏర్పేడు మండలంలోని జంగాలపల్లి వాగు పూర్తి స్థాయిలో పారుతున్నది. చప్టా కొట్టుకుపోయింది. తిరుమల డ్యామ్‌ల నుంచి 32,352.99 క్యూసెక్స్ నీటిని కిందకు విడుదల చేశారు. తిరుపతి జిల్లాలో ఇప్పటికే చాలా గ్రామాలు నీట మునిగాయి. తిరుపతిలోని పూలవానిగుంట, గొల్లవానిగుంట ప్రాంతాలు నీట మునగటంతో ఎమ్మెల్యే కరుణాకర్‌రెడ్డి ఆయా ప్రాంతాల్లో పర్యటించారు.
తుపాన్ విధులకు సచివాలయ సిబ్బంది
వాలంటీర్లు, గ్రామ సచివాలయ సిబ్బందిని తుపాన్ విధులకు ఉపయోగిస్తున్నారు. ఎక్కడ ఎటువంటి సంఘటనలు జరిగినా వెంటనే రాష్ట్ర కేంద్రానికి సమాచారం అందించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంది.